Delhi Liquor Scam: జైలులో సిసోడియాకు వీవీఐపీ ట్రీట్‌మెంట్.. ఎల్జీకి లేఖ
ABN , First Publish Date - 2023-03-11T15:07:37+05:30 IST
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్టయిన 'ఆప్' నేత మనీష్ సిసోడియాకు తీహార్ జైలులో వీవీఐపీ ట్రీట్‌మెంట్ ఇస్తున్నారని ..
న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు (Delhi Liquor Policy case)లో అరెస్టయిన 'ఆప్' నేత మనీష్ సిసోడియాకు తీహార్ జైలులో వీవీఐపీ (VVIP) ట్రీట్‌మెంట్ ఇస్తున్నారని ఈడీ కేసులో నిందితుడైన సుకేష్ చంద్రశేఖర్ (Sukesh Chandrasekhar) ఆరోపించారు. ఈ మేరకు ఆయన ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ (LG) వీకే సక్సేనా (VK Saxena)కు శనివారంనాడు ఒక లేఖ రాశారు. సిసోడియాకు జైలులో ఇస్తున్న వీవీఐపీ ట్రీట్‌మెంట్‌పై విచారణ జరపించాలని ఎల్జీని కోరారు.
''సిసోడియాను జైల్-1లోని వార్డు నెంబర్ 9లో ఉంచారు. తీహార్ జైలులోనే ఇది వీవీఐపీ వార్డు. ఇక్కడ హైప్రొపైల్ వివీఐపీ ఖైదీలను ఉంచుతారు'' అని సుకేష్ చంద్రశేఖర్ ఆ లేఖలో తెలిపారు. గ్యాంగ్‌స్టర్లతో కలిపి సిసోడియాను ఉంచారంటూ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తప్పుడు ప్రచారం సాగిస్తున్నారని కూడా ఆయన తన లేఖలో పేర్కొన్నారు. అవన్నీ తప్పుడు కథనాలనీ, పబ్లిక్‌ను ఫూల్స్ చేసే వ్యవహారమనీ ఆయన తెలిపారు. వీవీఐపీ వార్డులో సిసోడియా పట్ల జాగ్రత్తలు తీసుకుంటూ, బయటకు మాత్రం కేజ్రీవాల్, సత్యేందర్ జైన్, జైలు అధికారులు కలిపి ముందస్తు వ్యూహంతో తప్పుడు ప్రచారం సాగిస్తున్నారని అన్నారు. జైలు సిబ్బంది ఇప్పటికీ సత్యేంద్ర జైన్ అదుపాజ్ఞల్లోనే ఉన్నారని, జైలు అధికార యంత్రాగం పూర్తిగా ఆమ్ ఆద్మీ పార్టీ చేతులో కీలుబొమ్మలుగా ఉన్నారని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు.
లిక్కర్ పాలసీ కేసులో సిసోడియాకు ఈనెల 20వ తేదీ వరకూ జ్యుడిషయల్ కస్టడీ విధించడంతో ఆయన తీహార్ జైలులో ఉన్నారు. మనీ లాండరింగ్ వ్యవహారంలో జైలులోనే ఈడీ అధికారులు గత గురువారంనాడు 6 గంటలకు పైగా ప్రశ్నించారు.