Delhi Liquor scam : మనీశ్ సిసోడియా బెయిలు దరఖాస్తుపై విచారణకు సుప్రీంకోర్టు అంగీకారం
ABN , First Publish Date - 2023-07-10T11:37:32+05:30 IST
మద్యం విధానం రూపకల్పనలో అక్రమాలు, అవినీతి జరిగినట్లు నమోదైన కేసులో అరెస్టయిన ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నేత మనీశ్ సిసోడియా (Manish Sisodia) బెయిలు దరఖాస్తుపై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు సోమవారం అంగీకరించింది. ఈ పిటిషన్‌పై ఈ నెల 14న విచారణ జరుపుతామని తెలిపింది.
న్యూఢిల్లీ : మద్యం విధానం రూపకల్పనలో అక్రమాలు, అవినీతి జరిగినట్లు నమోదైన కేసులో అరెస్టయిన ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నేత మనీశ్ సిసోడియా (Manish Sisodia) బెయిలు దరఖాస్తుపై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు సోమవారం అంగీకరించింది. ఈ పిటిషన్‌పై ఈ నెల 14న విచారణ జరుపుతామని తెలిపింది. ఆయన సతీమణి సీమ సిసోడియా అనారోగ్యంతో బాధపడుతున్నారని ఆయన తరపు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి సర్వోన్నత న్యాయస్థానానికి తెలిపారు.
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మనీశ్ సిసోడియాను కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI) ఫిబ్రవరి 26న అరెస్టు చేసింది. ఈ కేసులో ఆయనకు బెయిలు మంజూరు చేసేందుకు ఢిల్లీ హైకోర్టు మే 30న తిరస్కరించింది. ఆయన మనీలాండరింగ్‌కు పాల్పడినట్లు ఆరోపిస్తూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఆయనను మార్చిలో అరెస్ట్ చేసింది. ఈ కేసుల్లో తనకు బెయిలు మంజూరు చేయాలని ఆయన గురువారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన మద్యం విధానం 2021-22లో అక్రమాలు జరిగాయని, ముడుపులు చేతులు మారాయని సీబీఐ, ఈడీ ఆరోపిస్తున్నాయి. కొందరు మద్యం వ్యాపారులకు అనుకూలంగా ఉండే విధంగా ఈ విధానాన్ని రూపొందించి, ప్రభుత్వానికి రావలసిన ఆదాయానికి గండికొట్టారని తెలిపాయి.
ఈ కేసులో నిందితులైన మనీశ్ సిసోడియాతోపాటు, మరికొందరికి చెందిన రూ.52.24 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసినట్లు ఈడీ శుక్రవారం ప్రకటించింది. మనీశ్ సిసోడియా దంపతులకు చెందిన రూ.7.29 కోట్ల విలువైన స్థిరాస్తులను, చరియట్ ప్రొడక్షన్స్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ రాజేశ్ జోషీ, గౌతమ్ మల్హోత్రాలకు చెందిన భూమి/ఫ్లాట్లను జప్తు చేసినట్లు తెలిపింది. జప్తు చేసినవాటిలో చరాస్తుల విలువ రూ.44.24 కోట్లు అని తెలిపింది. మనీశ్ సిసోడియా ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు.
ఇవి కూడా చదవండి :
Unusual heavy rains : ఉత్తరాదిలో ఎందుకు ఈ అసాధారణ భారీ వర్షాలు?
Panchayat Polls : మమత బెనర్జీని ఏకిపారేసిన దిగ్విజయ సింగ్