Share News

Annamalai: ‘మేము అధికారంలోకి వస్తే దేవాలయాల ముందు’.. తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నమలై సంచలన వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2023-11-08T19:18:43+05:30 IST

Periyar Statues: తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కే అన్నమలై బుధవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలోకి వస్తే.. దేవాలయాల ముందు ఉన్న ‘పెరియార్’ విగ్రహాలను తొలగించేస్తామని కుండబద్దలు కొట్టారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే చేసే మొట్టమొదటి పనే అదేనని తేల్చి చెప్పారు.

Annamalai: ‘మేము అధికారంలోకి వస్తే దేవాలయాల ముందు’.. తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నమలై సంచలన వ్యాఖ్యలు

తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కే అన్నమలై బుధవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలోకి వస్తే.. దేవాలయాల ముందు ఉన్న ‘పెరియార్’ విగ్రహాలను తొలగించేస్తామని కుండబద్దలు కొట్టారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే చేసే మొట్టమొదటి పనే అదేనని తేల్చి చెప్పారు. పెరియార్ విగ్రహాలకు బదులుగా అళ్వార్, నాయనార్లతో పాటు స్వాతంత్ర సమరయోధుల విగ్రహాలను ప్రతిష్టిస్తామని పేర్కొన్నారు. శ్రీరాంనగర్‌లో నిర్వహించిన ర్యాలీలో భాగంగా ఆయన ఈమేరకు వ్యాఖ్యానించారు.


‘‘ఈరోజు శ్రీరాంనగర్ గడ్డ నుంచి బీజేపీ మీకు ఒక హామీ ఇస్తోంది. మేము తమిళనాడులో అధికారంలోకి వచ్చిన వెంటనే పెరియార్ విగ్రహాలను పెకిలించివేస్తాం. ప్రభుత్వం ఏర్పాటు చేశాక చేసే మొట్టమొదటి పని అదే. పెరియార్ విగ్రహాల స్థానంలో అళ్వార్, నాయనార్‌ల విగ్రహాలను ప్రతిష్టిస్తాం. అలాగే.. తమిళ గురువు తిరువళ్లువార్ విగ్రహాన్ని కూడా ఉంచుతాం. మన స్వాతంత్ర సమరయోధుల గౌరవార్ధం వారి విగ్రహాలను ఏర్పాటు చేస్తాం’’ అని అన్నమలై అన్నారు. అంతేకాదు.. హిందూ మత, ధర్మాదాయశాఖ మంత్రిత్వ శాఖను సైతం రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ మంత్రిత్వ శాఖ చివరి రోజు బీజేపీ ప్రభుత్వపు తొలి రోజు అవుతుందని ఉద్ఘాటించారు.

ఇదే సమయంలో 1967లో చోటు చేసుకున్న ఒక సంఘటనను అన్నామలై గుర్తు చేసుకున్నారు. ‘‘డీఎంకే పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు.. పెరియార్ ఉల్లేఖనాలతో చెక్కబడిన ఫలకాలను ఏర్పాటు చేసింది. ఆ ఫలకాల్లో.. ‘దేవుళ్లను అనుసరించే వాళ్లు మూర్ఖులు, దేవుళ్లను నమ్మేవారు మోసగించబడతారు, కాబట్టి దేవుడ్ని పూజించకండి’ అని డీఎంకే పార్టీ ముద్రించింది. ఈ ఫలకాలను తమిళనాడు వ్యాప్తంగా ఉన్న దేవాలయాల ముందు ఏర్పాటు చేసింది’’ అని అన్నమలై చెప్పారు. హిందూ దేవుళ్లను డీఎంకే పార్టీ అనుమానించిందని, అందుకే బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే పెరియార్ విగ్రహాల్ని తొలగించేస్తామని ఆయన మాటిచ్చారు.

Updated Date - 2023-11-08T19:30:40+05:30 IST