Stalin inagurates house: శ్రీలంక తమిళ శరణార్ధులకు1,591 ఇళ్లు
ABN , First Publish Date - 2023-09-17T17:49:06+05:30 IST
తమిళనాడులోని 13 జిల్లాల్లో ఉన్న 19 శ్రీలంక తమిళ శరణార్ధుల శిబిరాల్లో కొత్తగా నిర్మించిన 1,500కు పైగా ఇళ్లను రాష్ట్ర ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ ఆదివారంనాడు ప్రారంభించారు. రూ.79.70 కోట్లతో 1,591 ఇళ్లను నిర్మించారు.
చెన్నై: తమిళనాడులోని 13 జిల్లాల్లో ఉన్న 19 శ్రీలంక తమిళ శరణార్ధుల(Srilanka Tamil refugees) శిబిరాల్లో కొత్తగా నిర్మించిన 1,500కు పైగా ఇళ్లను రాష్ట్ర ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ (MK Stalin) ఆదివారంనాడు ప్రారంభించారు. రూ.79.70 కోట్లతో 1,591 ఇళ్లను నిర్మించారు. మెల్మోనవూర్ క్యాంప్‌లో 220 ఇళ్లను స్టాలిన్ ప్రారంభించి, లబ్ధిదారులతో ముచ్చటించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కొత్త ఇళ్ల ప్రారంభోత్సవాన్ని నిర్వహించారు.
రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఇళ్లు నిర్మించిన జిల్లాలో తిరువన్నామలై, తిరుచిరాపల్లి, కోయంబత్తూరు, ఈరోడ్, సేలం, విరుదునగర్, శివగంగ సహా 12 జిల్లాలు ఉన్నాయి. వీడియా లింక్స్ ద్వారా లబ్ధిదారులతో సీఎం సంభాషించారు. అంగన్‌వాడీ సెంటర్లు, లైబ్రరీలు, ప్రజాపంపిణీ వ్యవస్థ వంటి కనీస సౌకర్యాలపై వారిని అడిగి తెలుసుకున్నారు. స్టాలిన్ నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం శ్రీలంక శరణార్ధుల పునరావాసంపై చురుకుగా పనిచేస్తోంది. 2021లో శ్రీలంక తమిళ శరణార్ధుల పునరావాస శిబిరాలకు రిహాబిలేషన్ క్యాంప్స్‌గా పేరు మార్చారు. శిథిలావస్థలో ఉన్న 7,469 ఇళ్లను పునర్నిర్మిస్తామని ప్రకటించారు. తొలి విడతలో భాగంగా 3,510 ఇళ్ల నిర్మాణం చేపట్టగా, ఇందుకోసం 2021-22 బడ్జెట్‌లో రూ.176.02 కోట్లు వెచ్చించారు. 20 జిల్లాలోని 35 రిహాబిలేషన్ క్యాంప్‌లలో ఈ ఇళ్ల నిర్మాణం ప్రస్తుతం జరుగుతోంది. వీటిలో 1,591 ఇళ్లు పూర్తికావడంతో వాటిని ముఖ్యమంత్రి ఆదివారంనాడు ప్రారంభించారు. తమిళనాడులోని మొత్తం 29 జిల్లాల్లోని 104 క్యాంపులలో 19,498 కుటుంబాలకు చెందిన 58,272 మంది నివస్తుండగా, వీరి స్థితిగతులను మెరుగుపరచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.