MK Stalin: బీజేపీయేతర ప్రభుత్వాలకు స్టాలిన్ వినూత్న సూచన
ABN , First Publish Date - 2023-04-12T22:04:08+05:30 IST
గవర్నర్లతో రాష్ట్ర ప్రభుత్వాలకు వరుసగా విభేదాలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో స్టాలిన్ ప్రతిపాదనకు ప్రాధాన్యత ఏర్పడింది.
చెన్నై: డీఎంకే (DMK) అధినేత, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ (Tamil Nadu CM MK Stalin) బీజేపీయేతర ప్రభుత్వాలకు లేఖ రాశారు. రాష్ట్రాల అసెంబ్లీలు చేసిన చట్టాలను ఫలానా సమయంలోగా ఆమోదించేలా గవర్నర్లను నిర్దేశిస్తూ తీర్మానాలు చేయాలని లేఖలో పేర్కొన్నారు. ఈ తీర్మానాలను కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్రపతికి పంపాలన్నారు. గవర్నర్లతో రాష్ట్ర ప్రభుత్వాలకు వరుసగా విభేదాలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో స్టాలిన్ ప్రతిపాదనకు ప్రాధాన్యత ఏర్పడింది.
తమిళనాడు గవర్నర్ రవితో కూడా డీఎంకే ప్రభుత్వానికి విభేదాలున్నాయి. ఇవి ప్రతిరోజూ చర్చనీయాంశంగా మారుతున్నాయి. రాష్ట్రాన్ని తమిళనాడుకు బదులుగా "తమిళగం'' అని పిలవాలంటూ గవర్నర్ వ్యాఖ్యలు చేయడంతో పాటు అసెంబ్లీని ఉద్దేశించి గవర్నర్ చేసిన ప్రసంగంలో కొన్ని పేరాలను పక్కనపెట్టి ఆయన చదివారు. డీఎంకే దిగ్గజాలైన సీఎన్ అన్నాదురై, ఎం కరుణానిధితో పాటు ద్రవిడ సిద్ధాంతకర్త పెరియార్, భారత రాజ్యంగనిర్మాత బీఆర్ అంబేడ్కర్ పేర్లను తప్పించి, తన ప్రసంగం సాగించారు. దీనిపై డీఎంకే సహా దాదాపు అన్ని పార్టీలు విభేదించడంతో పాటు నిరసన ప్రదర్శనలకు దిగాయి. గవర్నర్ దిష్టిబొమ్మలను దగ్ధం చేశాయి. గవర్నర్ చర్యలకు వ్యతిరేకంగా ఎంకే స్టాలిన్ ప్రభుత్వం అసెంబ్లీలో ఒక తీర్మానం చేసి ఆమోదించడంతో గవర్నర్ దిగివచ్చారు. చరిత్రను ఉటంకిస్తూనే తాను మాట్లాడానని ఆయన వివరణ ఇచ్చుకుంటూ క్షమాపణ చెప్పారు. తాజాగా, ప్రభుత్వ బిల్లులను గవర్నర్ అడ్డుకోవడంపైనా రచ్చ చోటుచేసుకుంది. గవర్నర్ చర్యలకు నిరసనగా రెండోసారి స్టాలిన్ సర్కార్ ఆసెంబ్లీలో తీర్మానం ఆమోదించారు. దీనిపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, కేంద్రం జోక్యం చేసుకుని గవర్నర్‌కు ఆదేశాలివ్వాలని ఆ తీర్మానంలో కోరారు.
తమిళనాడుతో పాటు ఢిల్లీ, కేరళ, తెలంగాణ, పశ్చిమబెంగాల్, పంజాబ్, జార్ఖండ్ వరకూ విపక్ష పార్టీల ప్రభుత్వాలు ఉన్న చోట్లలో ఒకే సన్నివేశం కనిపిస్తోంది. బీజేపీయేతర పాలిత రాష్ట్రాల్లో గవర్నర్లు మునుపెన్నడూ లేనంతగా విమర్శల పాలవుతున్నారు. కొన్నిచోట్ల ప్రభుత్వాలతో విభేదిస్తూ కోర్టు కేసులు, అసెంబ్లీలో తీర్మానాల వరకూ వ్యవహారాలు వెళ్లాయి. కొన్ని కేసుల్లో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాల కంటే తామే శక్తివంతులమన్నట్టు గవర్నర్ల వ్యవహారశైలి నడుస్తోందన్న ఆరోపణలు తీవ్రస్థాయిలో ఉన్నాయి. నిజానికి ఇలాంటివి కొత్తేమీ కాదు. గతంలోనూ రాష్ట్ర ప్రభుత్వాలు, గవర్నర్ల మధ్య అభిప్రాయభేదాలు పొడచూపిన సందర్భాలున్నాయి. అయితే, ఇప్పుడు ఈ ధోరణి మరింత ముదిరి పాకాన పడుతుండటంతో ప్రజాస్వామ్యం, రాజ్యాంగం ప్రమాదంలో పడుతున్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వామపక్షాలు మరో అడుగు ముందుకేసి అసలు గవర్నర్ పదవినే రద్దు చేయాలని డిమాండ్ చేసేంత వరకూ వెళ్లాయి. గవర్నర్ పదవి ఇప్పటి పరిస్థితుల్లో అవసరమే లేదని తెగేసి చెబుతున్నాయి. బీజీపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలో ప్రజా ప్రభుత్వాలకు, గవర్నర్లకు మధ్య వివాదాలు పెరుగుతున్న నేపథ్యంలో స్టాలిన్ తాజా ప్రతిపాదన సంచలనం సృష్టిస్తోంది.