Legendry Elephant: అటవీ శాఖ గార్డ్ ఆఫ్ హానర్‌తో లెజండరీ ఎలిఫెంట్ 'కలీమ్' రిటైర్..

ABN , First Publish Date - 2023-03-08T17:02:21+05:30 IST

క్రూరమృగాలను ఛేజ్‌ చేసి, పట్టుకునే విషయంలో అటవీ శాఖ జరిపిన 99 ఆపరేషన్లలో విజయవంతంగా పాల్గొన్న లెజ్రెండీ ఏనుగు..

Legendry Elephant: అటవీ శాఖ గార్డ్ ఆఫ్ హానర్‌తో లెజండరీ ఎలిఫెంట్ 'కలీమ్' రిటైర్..

చెన్నై: క్రూరమృగాలను ఛేజ్‌ చేసి, పట్టుకునే విషయంలో అటవీ శాఖ జరిపిన 99 ఆపరేషన్లలో విజయవంతంగా పాల్గొన్న లెజెండ్రీ ఏనుగు (legendary Elephant) అనామలై కలీమ్ (Anamalai Kaleem) 60వ పడిలో బుధవారంనాడు రిటైర్ అయింది. ఐదు దశాబ్దాల పాటు అటవీ శాఖకు సేవలందించిన కలీమ్‌ గౌరవార్ధం కొళికముతి ఎలిఫెంట్ క్యాంప్‌లో ఐదుగురు ఫారెస్ట్ రేంజర్లు 'గార్డ్ ఆఫ్ హానర్' (Guard of honour)తో వీడ్కోలు పలికారు. కలీమ్ రిటైర్మెంట్‌కు సంబంధించిన వీడియోను రాష్ట్ర పర్యావరణ శాఖ కార్యదర్శి సుప్రియ సాహు (Supriya Sahu IAS) ట్వీట్‌ చేశారు.

కలీమ్ ఒక లెజెండ్ అని, తన సేవల ద్వారా ప్రజల హృదయాలను ఎంతగానో చూరగొందని ఆమె తెలిపారు. 99 ఆపరేషన్లు పూర్తి చేసుకున్న కలీమ్ 60 ఏళ్ల వయస్సులో బుధవారం రిటైర్ అవుతుండటంతో మా కళ్లు చెమ్మగిల్లుతున్నాయి. కృతజ్ఞతతో హృదయం బరువెక్కుతోంది. తమిళనాడు ఫారెస్ట్ గార్డుల గౌరవ వందనాన్ని కలీమ్ అందుకుంది'' అని చెప్పారు. కలీమ్ వీడియో సోషల్ మీడియాలో ఒక్కసారిగా వైరల్ అవుతోంది. ఇంతవరకూ 1,60,000 వ్యూస్, 9,300 లైక్స్ అందుకుంది. కలీమ్ 100వ ఆపరేషన్‌గా కరుప్పన్ అనే వైల్డ్ టస్కర్‌ను పట్టుకునేందుకు వినియోగించాలని అనుకున్నప్పటికీ, సత్యమంగళం టైగర్ రిజర్వ్‌లోకి కరుప్పన్ పారిపోయినట్టు కలీమ్ ట్రయినర్ (25) మణి తెలిపారు.

50 ఏళ్ల సేవలో...

కలీమ్ 1972 డిసెంబర్‌లో పట్టుబడింది. మావటి పళనిసామితో దానికి శిక్షణ ఇప్పించారు. పళనిస్వామి ఆ తర్వాత చనిపోవడంతో అతని మేనల్లుడు మణి మావటిగా ఉన్నాడు. సలీమ్ శిక్షణ పొందిన ఇతర ఏనుగులంత పొడవైనది కానప్పటికీ చాలా బలిష్టంగా ఉండేది. సుమారు ఐదు టన్నుల బరువు మోసేది. బలం, నిర్భీతికి చిరునామాగా పేరు తెచ్చకుంది. ఎట్టి వాతావరణ పరిస్థితుల్లోనైనా ఎంతో కూల్‌గా, క్రమశిక్షణగా, పూర్తి సామర్థ్యం ప్రదర్శించేది. కలీమ్ ఇటు తమిళనాడులోనే కాకుండా పొరుగు రాష్ట్రాలైన కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, పశ్చిమబెంగాల్‌లో కూడా అటవీ శాఖ జరిపిన పలు ఆపరేషన్లలో పాల్గొంది.

Updated Date - 2023-03-08T17:30:40+05:30 IST