Tamil Nadu : దిగి వచ్చిన స్టాలిన్ ప్రభుత్వం.. కార్మికుల పని గంటల పెంపు బిల్లు ఉపసంహరణ..
ABN , First Publish Date - 2023-05-01T14:19:32+05:30 IST
కార్మిక లోకం ఒత్తిళ్లకు తమిళనాడు ప్రభుత్వం దిగి వచ్చింది. కార్మికుల చేత రోజుకు పన్నెండు గంటలపాటు పని చేయించుకునేందుకు పరిశ్రమలకు
చెన్నై : కార్మిక లోకం ఒత్తిళ్లకు తమిళనాడు ప్రభుత్వం దిగి వచ్చింది. కార్మికుల చేత రోజుకు పన్నెండు గంటలపాటు పని చేయించుకునేందుకు పరిశ్రమలకు అనుమతి ఇచ్చేందుకు ఉద్దేశించిన బిల్లును ఉపసంహరించుకుంది. ఇటువంటి చట్టం వల్ల కార్మికుల జీవన ప్రమాణాలపై ప్రతికూల ప్రభావం పడుతుందని నిపుణులు హెచ్చరించిన సంగతి తెలిసిందే.
చైనాతో పోటీ పడాలంటే కార్మికుల పని వేళలను పెంచవలసి ఉంటుందని చెప్తూ కార్మిక చట్టాలకు కర్ణాటక, తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వాలు సవరణ చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. తమిళనాడు ప్రభుత్వం కూడా ఫ్యాక్టరీస్ (తమిళనాడు సవరణ) బిల్లు, (Factories (Tamil Nadu Amendment) Bill), 2023ను ప్రతిపాదించింది. ఐఫోన్ అమ్మకందారు ఫాక్స్‌కాన్ వంటి అంతర్జాతీయ కంపెనీలు తమ ఉద్యోగుల చేత రోజుకు 12 గంటలు పని చేయించడానికి ఈ బిల్లు అనుమతిస్తోంది. రోజుకు 12 గంటలు పని చేసేవారి చేత వారానికి నాలుగు లేదా ఐదు రోజులు మాత్రమే పని చేయించాలని ప్రతిపాదించింది.
ఈ బిల్లు చట్టంగా మారి, అమలైతే ఫ్యాక్టరీలు, కంపెనీలు ఉద్యోగులను తగ్గిస్తాయని, రోజుకు రెండు షిఫ్టుల్లోనే పని చేయించుకుంటాయని పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమైంది. ముఖ్యంగా మహిళలపై ప్రతికూల ప్రభావం పడుతుందని విమర్శలు వచ్చాయి. ఇంత సుదీర్ఘ సమయం పని చేస్తే, మహిళలు తమ కుటుంబ బాధ్యతలను ఏ విధంగా నెరవేర్చగలుగుతారని చాలా మంది ప్రశ్నించారు. ప్రజలు రోజుకు మూడుసార్లు భోజనం చేస్తారని, మధ్యలో నిర్ణీత విరామం తీసుకుంటారని, రోజుకు 12 గంటలు పని చేస్తే ఈ పరిస్థితి ఉండదని నిపుణులు చెప్తున్నారు. ఈ విధంగా ఆహారాన్ని తీసుకోకపోతే జీవ గడియారం కుప్పకూలుతుందని హెచ్చరిస్తున్నారు. మరోవైపు రాజకీయ పార్టీలు, డీఎంకే మిత్ర పక్షాలు, అన్ని ట్రేడ్ యూనియన్లు కూడా దీనిని వ్యతిరేకించాయి.
కార్మిక దినోత్సవాల సందర్భంగా సోమవారం తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ (MK Stallin) మాట్లాడుతూ, ఈ బిల్లును ఉపసంహరించినట్లు తెలిపారు. ఇది కేవలం కొన్ని పరిశ్రమలకే వర్తిస్తుందని, అయినప్పటికీ దీనిని ఉపసంహరించామని చెప్పారు. ట్రేడ్ యూనియన్లు, రాజకీయ పార్టీలు వ్యక్తం చేసిన అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. దీనిని తాత్కాలికంగా నిలిపేస్తున్నట్లు ఆయన ఏప్రిల్ 24న ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఇవి కూడా చదవండి :
LPG cylinder prices : భారీగా తగ్గిన వంటగ్యాస్ ధరలు
Karnataka Polls : రైతులకు సున్నా వడ్డీకే రుణాలు.. పేదలకు ఉచితంగా మూడు వంట గ్యాస్ సిలిండర్లు..