MK Stalin: ఫ్యాక్టరీల్లో 12 గంటల పని బిల్లు ఉపసంహరణ..?

ABN , First Publish Date - 2023-04-24T17:11:48+05:30 IST

ఫ్యాక్టరీల చట్టం-1948కి సవరణలు చేస్తూ గత వారంలో అసెంబ్లీలో ఆమోదించిన బిల్లుపై తమిళనాడు ప్రభుత్వం వెనక్కి..

MK Stalin: ఫ్యాక్టరీల్లో 12 గంటల పని బిల్లు ఉపసంహరణ..?

చెన్నై: ఫ్యాక్టరీల చట్టం-1948కి సవరణలు చేస్తూ గత వారంలో అసెంబ్లీలో ఆమోదించిన బిల్లుపై తమిళనాడు (Tamilnadu) ప్రభుత్వం వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది. బిల్లును ఉపసంహరించుకోనున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. విపక్షాల నిరసనలు, ఆందోళనల మధ్య గత శుక్రవారంనాడు ఈ బిల్లుపై అసెంబ్లీలో చర్చ జరిపి, మూజువాణి ఓటుతో ఆమోదించారు. ఫ్యాక్టరీస్ (సవరణ) యాక్ట్-2023 ప్రకారం ఫ్యాక్టరీల్లో పనిచేసే వర్కర్ల పని గంటలను ప్రస్తుతం అమల్లో ఉన్న 8 నుంచి 12 గంటలకు పెంచారు. దీనిని కార్మిక వ్యతిరేక బిల్లుగా ప్రతిపక్షాలు ఆరోపిస్తూ అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశాయి. ఈ బిల్లుతో ఫ్యాక్టరీ వర్గర్లు దోపిడీకి గురవుతారని కాంగ్రెస్, సీపీఎం సహా విపక్ష పార్టీలు అభ్యంతరం తెలిపాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తీసుకోవాల్సిన తదుపరి చర్యపై ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సోమవారం సాయంత్రం మిత్రపక్షాలతో సమావేశమవుతున్నారు.

కాగా, ప్రభుత్వం తీసుకువచ్చిన సవరణ బిల్లుపై రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి తంగం తెన్నరసు మాట్లాడుతూ, పని గంటలు పెరిగినా ఒక వారంలో కార్మికులు చేసే మొత్తం పని గంటల్లో ఎలాంటి మార్పూ ఉండదని చెప్పారు. వారంలో నాలుగు రోజులు పని చేసి, మూడు రోజులు సెలవు తీసుకునే వీలుంటుందని చెప్పారు. ఆ మూడు రోజులు పెయిడ్ లీవ్‌ కిందే వస్తుందన్నారు. ప్రస్తుతం ఉన్న సెలవులు, ఓవర్‌టైమ్, వేతనం, తదితరాల్లో ఎలాటి మార్పులు ఉండవని చెప్పారు. కాగా, పూర్తి స్క్రూటినీ అనంతరమే ప్రభుత్వం బిల్లును అమలు చేస్తుందని కార్మిక సంక్షేమ శాఖ మంత్రి సీవీ గణేషన్ తెలిపారు. సవరించిన బిల్లు ప్రకారం, పని వేళల పెంపుపై ఉద్యోగుల అంగీకారాన్ని కూడా ఫ్యాక్టరీలు తీసుకుంటాయని, ఉద్యోగుల సంక్షేమానికి ఎలాంటి ఢోకా ఉండదని భరోసా ఇచ్చారు.

Updated Date - 2023-04-24T17:11:48+05:30 IST