LG Manoj Sinha: కశ్మీర్‌లో కొన ఊపిరితో టెర్రరిజం
ABN , First Publish Date - 2023-10-23T19:52:21+05:30 IST
జమ్మూకశ్మీర్‌లో భద్రతా పరిస్థితి మెరుగుపడిందని, ఈ ప్రాంతంలో టెర్రరిజం కొన ఊపిరితో ఉందని లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా తెలిపారు. కుప్వారా జిల్లాలోని మాతా భద్రకాళి ఆలయంలో సోమవారంనాడు జరిగిన మహానవమి వేడుకల్లో ఎల్జీ పాల్గొన్నారు. జమ్మూలోని పలు ప్రాంతాల నుంచి కశ్మీర్ పండిట్లు ఈ వేడుకలకు హాజరయ్యారు.
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో భద్రతా పరిస్థితి మెరుగుపడిందని, ఈ ప్రాంతంలో టెర్రరిజం కొన ఊపిరితో (Last breath) ఉందని లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా (Manoj Sinha) తెలిపారు. కుప్వారా జిల్లాలోని మాతా భద్రకాళి ఆలయంలో సోమవారంనాడు జరిగిన మహానవమి వేడుకల్లో ఎల్జీ పాల్గొన్నారు. జమ్మూలోని పలు ప్రాంతాల నుంచి కశ్మీర్ పండిట్లు ఈ వేడుకలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా సిన్హా మాట్లాడుతూ, జమ్మూకశ్మీర్‌లో గతంలో కంటే భద్రతా పరిస్థితిలు మెరుగుపడ్డాయని చెప్పారు. టెర్రరిజం కొనఊపరితో ఉందనే విషయం తాను చెప్పగలనన్నారు.
కశ్మీర్ పండిట్లలో భయాలు నింపేందుకు సునిశితమైన ప్రాంతాలను గతంలో టెర్రరిస్టులు టార్గెట్‌గా చేసుకునే వారని ఆయన చెప్పారు. పొరుగుదేశం ఉద్దేశపూర్వకంగానే జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని రగులుస్తూ వచ్చేదని పాకిస్థాన్‌ను పరోక్షంగా విమర్శించారు. కశ్మీర్ పండిట్లు, మైనారిటీల భద్రతకు అవసరమైన అన్ని చర్యలను తాము తీసుకుంటున్నామని, ఈ లక్ష్య సాధన కోసం పోలీసులు, భద్రతా బలగాలు అహరహం శ్రమిస్తున్నాయని చెప్పారు.
కశ్మీర్ పండిట్ కమ్యూనిటీకి చెందిన ఉద్యోగులకు స్థలాలు కేటాయించి, గృహ నిర్మాణాలకు సబ్సిడీలు కల్పిస్తామన్నారు. కచ్చితంగా ఈ సదుపాయాలు కల్పించి తీరుతామని, ఆయా వర్గాల ఆందోళనలను తొలగించేందుకు, సమస్యల పరిష్కారానికి తమ కార్యాలయం, ప్రభుత్వ యంత్రాంగం తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని హామీ ఇచ్చారు. కశ్మీర్ పండిట్లకు కల్పించే అకాడమినేషన్ల వద్ద భద్రతను పెంచుతామన్నారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదన హోం మంత్రిత్వ శాఖకు సమర్పించామని, కచ్చితంగా సానుకూల స్పందన వస్తుందనే నమ్మకం ఉందని చెప్పారు. కేంద్రం నుంచి అనుమతి రాగానే తక్షణం వాటిని అమలు చేస్తామని సిన్హా హామీ ఇచ్చారు.