Delhi Services Bill: అవినీతిపై పోరాటమే బిల్లు లక్ష్యం: అమిత్‌షా

ABN , First Publish Date - 2023-08-07T21:21:27+05:30 IST

ఢిల్లీలో ఎలాంటి అవినీతికి తావులేని పాలన అందివ్వడం, అవినీతిపై పోరాటమే నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ (అమెండమెంట్) బిల్లు-2023 ముఖ్య ఉద్దేశమని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా అన్నారు. రాజ్యసభలో బిల్లుపై జరిగిన చర్చ కు అమిత్‌షా సమాధానమిస్తూ, తాము సుప్రీంకోర్టు ఉల్లంఘనకు పాల్పడలేదన్నారు.

Delhi Services Bill: అవినీతిపై పోరాటమే బిల్లు లక్ష్యం: అమిత్‌షా

న్యూఢిల్లీ: ఢిల్లీలో ఎలాంటి అవినీతికి తావులేని పాలన (Corruption-free administraion) అందివ్వడం, అవినీతిపై పోరాటమే నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ (అమెండమెంట్) బిల్లు-2023 ముఖ్య ఉద్దేశమని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా (Amit shah) అన్నారు. గతవారం లోక్‌సభలో ఆమోదం పొందిన ఈ బిల్లును ఆయన సోమవారం మధ్యాహ్నం రాజ్యసభలో ప్రవేశపెట్టారు. అనంతరం బిల్లుపై చర్చ జరిగింది. పలువురు అధికార, విపక్ష పార్టీల నేతలు బిల్లుపై చర్చించారు. అనంతరం బిల్లుపై జరిగిన చర్చకు అమిత్‌షా సమాధానమిస్తూ, సుప్రీంకోర్టు ఉత్తర్వులను బిల్లు ఉల్లంఘించలేదని చెప్పారు.


ఢిల్లీలో పోస్టింగుల బదిలీల విషయంలో గతంలో ఎలాంటి గొడవులు లేవనని, ముఖ్యమంత్రులతో ఎలాంటి సమస్యలు ఉండేవి కావని అమిత్‌షా అన్నారు. 2015లో ఒక ఆందోళన తర్వాత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని, కేంద్రం తమ హక్కులను లాక్కోవాలని చూస్తోందంటూ కొందరు మాట్లాడారని అన్నారు. అయితే ఆవిధంగా చేయాల్సిన పని కేంద్రానికి లేదని, దేశ ప్రజలు తమకు అధికారం, హక్కు ఇచ్చారని చెప్పారు.


కాంగ్రెస్ పార్టీపై అమిత్‌షా విమర్శలు గుప్పిస్తూ, ఎమర్జెన్సీ తెచ్చేందుకు తాము రాజ్యాంగ సవరణలు చేపట్టడం లేదన్నారు. ప్రజాస్వామ్యంపై మాట్లాడే హక్కు వారికి లేదన్నారు. ఢిల్లీలో సర్వీసులతో అన్ని అంశాలపైన పార్లమెంటుకు అధికారం ఇస్తూ గతంలోని కాంగ్రెస్ ప్రభుత్వమే రాజ్యాంగ సవరణ చేసిందన్నారు. తాము తీసుకువచ్చిన ఢిల్లీ సర్వీసుల బిల్లు ప్రధాన ఉద్దేశం అవినీతిపై పోరాడేందుకేనని స్పష్టం చేశారు.


ఢిల్లీలో సీనియర్ అధికారుల పోస్టింగులు, బదలీలకు సంబంధించిన అధికారాలను ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌కు అప్పగిస్తూ కేంద్రం ఇటీవల తీసుకువచ్చిన ఆర్డినెన్స్ స్థానే తీసుకు వచ్చిన ఈ బిల్లును కేజ్రీవాల్ సారథ్యంలోని ఆప్ ప్రభుత్వం మొదట్నించీ వ్యతిరేకిస్తుంది. రాజ్యసభలో బిల్లును ఓడించేందుకు గత రెండు నెలుగా కేజ్రీవాల్ విపక్ష పార్టీల సహకారం కోరుతున్నారు. 26 విపక్ష పార్టీలతో కూడిన I.N.D.I.A. కూటమి కేజ్రీవాల్‌కు మద్దతు ప్రకటించగా, రాజ్యసభలో బిల్లును నెగ్గించుకునేదుకు బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే పట్టుదలగా ఉంది. లోక్‌సభలో గత వారం ఆమోదం పొందిన ఈ బిల్లుపై రాజ్యసభలో చర్చ పూర్తి కాగానే ఓటింగ్ ఉంటుంది.

Updated Date - 2023-08-07T21:21:27+05:30 IST