ఈసారి భారీ మెజార్టీతో గెలుస్తా.. కానీ...

ABN , First Publish Date - 2023-04-16T08:31:12+05:30 IST

ఈసారి భారీ మెజార్టీతో విజయం సాధిస్తానని, ఇందులో ఎటువంటి అనుమానాలకు అవకాశమే లేదని

ఈసారి భారీ మెజార్టీతో గెలుస్తా..  కానీ...

బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై(Chief Minister Basavaraj Bommai) హావేరి జిల్లా శిగ్గావి శాసనసభా నియోజకవర్గంలో శనివారం నామినేషన్‌ దాఖలు చేశారు. ఆయన వెంట ప్రజాపనుల శాఖ మంత్రి సీసీ పాటిల్‌ తదితరులు ఉన్నారు. అనంతరం సీఎం మీడియాతో మాట్లాడుతూ శిగ్గావి ప్రజలు తనను పలుమార్లు ఆశీర్వదించారని, వారి మద్దతుతో గతంలో కన్నా భారీ మెజార్టీతో గెలుస్తానన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. శిగ్గావి ఓటర్లు ఎంతో తెలివైన వారని, నియోజకవర్గంలో తాను చేసిన సమగ్ర అభివృద్ధిని గమనించి తనకు అండగా నిలబడ్డారని పేర్కొన్నారు. నియోజకవర్గానికి కొత్త పరిశ్రమలు తెచ్చానని, టెక్స్‌టైల్స్‌పార్కు, ఐఐటీ, ఆయుర్వేద ఆసుపత్రి తదితర ఎన్నో మెగా కార్యక్రమాలు చేపట్టానని సీఎం చెప్పారు. వీటి వల్ల నియోజకవర్గంలోని అన్ని వర్గాల ప్రజలకు ఉపాధి అవకాశాలు లభించాయన్నారు. టికెట్ల కేటాయింపుపై పార్టీలో నెలకొన్న గందరగోళానికి మరో రెండు మూడు రోజుల్లో తెరపడనుందని, తర్వాత అంతా సర్దుకుంటుందన్నారు. కాగా ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాఎన్నికల ప్రచార సభలకు సంబంధించిన రోడ్‌మ్యాప్‌ సిద్ధమవుతోందన్నారు. తనపై పోటీచేసే ప్రత్యర్థి ఎవరనే అంశాన్ని తాను పట్టించుకోబోనని, ప్రజల ఆశీర్వాదంతో విజయం సాధిస్తానన్న ఆత్మవిశ్వాసం తనకు అపారంగా ఉందన్నారు.

ఈ నెల 19న పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో మరోసారి నామినేషన్‌ దాఖలు చేస్తానని సీఎం ప్రకటించారు. పార్టీ ఎమ్మెల్యే నెహ్రూ ఓలేకర్‌ తనపై చేస్తున్న అవినీతి ఆరోపణలు పూర్తిగా నిరాధారమన్నారు. ముందు తనపై ఉన్న ఆరోపణల నుంచి ఆయన విముక్తి పొందాలని ఓలేకర్‌కు సీఎం సవాల్‌ విసిరారు. మాజీ ముఖ్యమంత్రి జగదీష్‌ శెట్టర్‌కు టికెట్‌ రాకపోవడానికి తానే కారణమని మీడియాలో వస్తున్న కథనాలను సీఎం తీవ్రంగా ఖండించారు. ఎట్టి పరిస్థితిలోనూ శెట్టర్‌ను వదులుకోబోమన్నారు. నిజానికి మాజీ ఉపముఖ్యమంత్రి లక్ష్మణ్‌సవదిని కూడా పార్టీలోనే కొనసాగేలా చేసేందుకు చివరి నిముషం వరకు ప్రయత్నించామని, ఆయన చాలా ఆవేశపడి కాంగ్రెస్‏లో చేరారని తెలిపారు. ఆయనకు మంచి జరగాలని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. టికెట్ల కేటాయింపు పూర్తిగా అధిష్టానం పర్యవేక్షణలోనే జరిగిందని, ఇందులో తన ప్రమేయం లేదని సీఎం తేల్చిచెప్పారు. శిగ్గావిలో ఎన్నికల ప్రచారం చేసేందుకు కొంత సమయం కేటాయిస్తానని, మిగిలిన రోజుల్లో పార్టీ జాతీయ నేతలతో కలిసి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటానని వెల్లడించారు. ముస్లిం రిజర్వేన్ల రద్దు విషయం కోర్టు పరిధిలో ఉన్నందున వ్యాఖ్యానించేందుకు సీఎం నిరాకరించారు.

kkkk.jpg

Updated Date - 2023-04-16T08:44:19+05:30 IST