Train: జూన్ వరకు సికింద్రాబాద్-రామనాథపురం రైలుసేవలు
ABN , First Publish Date - 2023-03-01T10:39:01+05:30 IST
సికింద్రాబాద్ నుంచి రామనాథపురం వరకు నడుపుతున్న వీక్లీ ప్రత్యేక రైలును జూన్ వరకు పొడిగించినట్లు దక్షిణ రైల్వే శాఖ ప్రకటించింది.
ప్యారీస్(చెన్నై): సికింద్రాబాద్ నుంచి రామనాథపురం వరకు నడుపుతున్న వీక్లీ ప్రత్యేక రైలును జూన్ వరకు పొడిగించినట్లు దక్షిణ రైల్వే శాఖ ప్రకటించింది. తెలంగాణ రాష్ట్రం సికింద్రాబాద్-రామనాథపురం(Secunderabad-Ramanathapuram) మధ్య ప్రతి బుధవారం వీక్లీ నడుపుతున్నారు. సికింద్రాబాద్ నుంచి రాత్రి 9.10 గంటలకు బయల్దేరే ఈ రైలు మరుసటిరోజు రాత్రి 10.30 గంటలకు రామనాథపురం చేరుకుంటుంది. ప్రస్తుతం ఈ రైలు సేవలను బుధవారం నుంచి జూన్ 28వ తేది వరకు పొడిగించారు. మరోమార్గంలో రామనాథపురం నుంచి ప్రతి శుక్రవారం ఉదయం 9.50 గంటలకు బయల్దేరే ప్రత్యేక రైలు మరుసటిరోజు మధ్యాహ్నం 12.50 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. ఈ రైలు సేవలను జూన్ 30వ తేది వరకు పొడిగించారు. ఈ రైలు మానామదురై, శివగంగ, కారైక్కుడి, ఆరన్‌తాంగి, పట్టుకోట, అదిరంపట్టణం, తిరుత్తురైపూండి, తిరువారూర్, మైలాడుదురై, శీర్గాళి, చిదంబరం, తిరుపాదిరిపులియూర్, విల్లుపురం, చెంగల్పట్టు, చెన్నై ఎగ్మూర్ మీదుగా నడుపుతున్నారు.
చెన్నై-బిట్రగుంట రైలు రద్దు...
చెన్నై నుంచి నెల్లూరు జిల్లా బిట్రగుంట వరకు నడిపే ఎక్స్‌ప్రె్‌సను ఈ నెల 3వ తేది వరకు రద్దు చేస్తున్నట్లు దక్షిణ రైల్వే ప్రకటించింది. బిట్రగుంట-చెన్నై మధ్య సోమవారం నుంచి శుక్రవారం వరకు నడుపుతున్న ఈ రైలును ట్రాక్ మరమ్మతుల కారణంగా రద్దుచేశారు.