Earthquake in Delhi-NCR: ఢిల్లీలో భూ ప్రకంపనలు
ABN , First Publish Date - 2023-10-15T17:05:09+05:30 IST
హర్యానాలోని ఫరీదాబాద్‌లో ఆదివారం మధ్యాహ్నం 4.08 గంటలకు 3.1 తీవ్రతతో భూకంపం సంభవించినట్టు నేషనల్ సెంటర్ ఫర్ సిస్సోలజీ తెలిపింది. ఫరీదాబాద్ ఈస్ట్‌కు తొమ్మిది కిలోమీటర్లు, ఆగ్నేయ ఢిల్లీకి 30 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం నమోదైనట్టు పేర్కొంది.
న్యూఢిల్లీ: హర్యానాలోని ఫరీదాబాద్‌లో ఆదివారం మధ్యాహ్నం 4.08 గంటలకు 3.1 తీవ్రతతో భూకంపం (Earthquake) సంభవించినట్టు నేషనల్ సెంటర్ ఫర్ సిస్సోలజీ (NCS) తెలిపింది. ఫరీదాబాద్ ఈస్ట్‌కు తొమ్మిది కిలోమీటర్లు, ఆగ్నేయ ఢిల్లీకి 30 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం నమోదైనట్టు పేర్కొంది. ఈ ప్రభావంతో ఢిల్లీ-ఎన్‌సీఆర్ (Delhi-NCR) పరిధిలో భూమి కంపించింది. ప్రజలు భయాందోళనలకు గురికాగా, ఇళ్లలోని సామాగ్రి ఊగిపోయినట్టు పలువురు స్థానికులు తెలిపారు. దేశ రాజధానిలో భూ ప్రకంపనలు సంభవించడం గత పదిహేను రోజుల్లో ఇది రెండోసారి.
దీనికి ముందు, అక్టోబర్ 3న ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాతంలో బలమైన భూప్రకంపనలు సంభవించాయి. స్థానికులు ఇళ్లు, కార్యాలయాలు వదలి బయటకు పరుగులు తీశారు. పొరుగు దేశమైన నేపాల్‌లో గంట వ్యవధిలో సంభవించిన నాలుగు భూకంపాల ప్రభావం మన దేశ రాజధాని డిల్లీపై కూడా తీవ్రంగా చూపింది. తొలి భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.6గా నమోదైంది. రెండవది 6.2గా నమోదైంది.