Turkey Earthquake : భారత సైన్యంపై టర్కీ భూకంప బాధితుల ప్రశంసలు
ABN , First Publish Date - 2023-02-12T13:25:31+05:30 IST
భూకంపాలతో అతలాకుతలమైన టర్కీ, సిరియాలకు భారత దేశం ‘ఆపరేషన్ దోస్త్’ పేరుతో సహాయపడుతోంది.
ఇస్తాంబుల్ : ‘మానవ సేవయే, మాధవ సేవ’ నినాదాన్ని స్ఫూర్తిదాయకంగా అమలు చేస్తున్న భారత సైన్యంపై టర్కీ భూకంప బాధితులు ప్రశంసలు కురిపిస్తున్నారు. అత్యంత కష్టకాలంలో వచ్చి ఆదుకున్నందుకు ధన్యవాదాలు చెప్తున్నారు. సైనికులను ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని, ముద్దాడి మరీ తమ కృతజ్ఞతను ప్రకటిస్తున్నారు. భూకంపాలు సంభవించిన కొద్ది గంటల్లోనే ఆపన్న హస్తం అందజేసినందుకు సంతోషిస్తున్నారు.
భూకంపాలతో అతలాకుతలమైన టర్కీ, సిరియాలకు భారత దేశం ‘ఆపరేషన్ దోస్త్’ పేరుతో సహాయపడుతోంది. ఇప్పటికే ఏడు భారీ విమానాల్లో ఆహారం, మందులు, ఆసుపత్రి పరికరాలు, సహాయక బృందాలు, జాగిలాలను పంపించింది. శిథిలాల క్రింద చిక్కుకున్నవారిని కాపాడి, క్షతగాత్రులకు చికిత్స అందిస్తోంది.
టర్కీలోని హటాయ్ వద్ద భారత సైన్యం ఓ ఫీల్డ్ ఆసుపత్రిని ఏర్పాటు చేసింది. దీనిని ఆరు గంటల వ్యవధిలోనే నిర్మించింది. 96 మంది భారత సైనిక సిబ్బంది ఇక్కడ నిరంతర వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ ఆసుపత్రి కమాండింగ్ ఆఫీసర్ లెఫ్టినెంట్ కల్నల్ యదువీర్ సింగ్ మాట్లాడుతూ, తాము 800 మందికి చికిత్స చేశామని తెలిపారు. అవసరమైనంత వరకు తాము వైద్య సేవలను అందిస్తామన్నారు. ఈ ఆసుపత్రి సెకండ్ ఇన్ కమాండ్ లెఫ్టినెంట్ కల్నల్ ఆదర్శ్ మాట్లాడుతూ, ఇక్కడ 10 ముఖ్యమైన శస్త్ర చికిత్సలు జరిగాయని తెలిపారు. ఈ సేవలను అందుకుంటున్న ప్రజలు భారత సైన్యాన్ని ప్రశంసిస్తున్నారు. ఇక్కడ చికిత్స చేయించుకున్న ఓ వ్యక్తి మాట్లాడుతూ, ‘థాంక్యూ హిందుస్థాన్’ అని చెప్పారు. స్థానికులు మాట్లాడుతూ, భారత సైన్యం వచ్చినందుకు సంతోషం వ్యక్తం చేశారు. వారు ఇక్కడికి రావడం ప్రశంసనీయమని వ్యాఖ్యానించారు.
గడ్డ కట్టే చలిలో...
మరోవైపు గడ్డకట్టే చలి వాతావరణంలో సహాయక బృందాలు శిథిలాల క్రింద అన్వేషిస్తున్నాయి. ఇంకా ఎవరైనా సజీవంగా ఉన్నారేమోనని చురుగ్గా గాలిస్తున్నాయి. టర్కీ, సిరియా దేశాల్లో సోమవారం సంభవించిన భూకంపాల వల్ల 28 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు అధికారిక లెక్కలు చెప్తున్నాయి.
సైనికులకు ముద్దులు...
ఓ టర్కిష్ మహిళ భారత సైన్యంలోని ఓ మహిళా సైనికురాలి చెక్కిళ్ళపై ఆత్మీయంగా ముద్దాడినట్లు కనిపిస్తున్న ఓ ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. దీనిని భారత సైన్యానికి చెందిన అదనపు డైరెక్టరేట్ జనరల్ (పబ్లిక్ ఇన్ఫర్మేషన్) ట్వీట్ చేసింది. దీనికి ‘మేం సంరక్షిస్తాం’ అనే శీర్షికను పెట్టింది. ట్విటరాటీలు కూడా సైన్యాన్ని ప్రశంసిస్తున్నారు. ఈ సంవత్సరం ఇప్పటి వరకు తీసిన అత్యుత్తమ క్షణాల ఫొటో అని, దీనిని షేర్ చేసినందుకు ధన్యవాదాలని పేర్కొన్నారు.
జాతీయ విపత్తు స్పందన దళం (NDRF) కూడా అత్యంత విలువైన సేవలు అందిస్తోంది. టర్కీలోని గజియాంటెప్ నగరంలో శిథిలాల క్రింద మూడు రోజులపాటు చిక్కుకున్న ఆరేళ్ళ బాలికను బయటకు తీసుకొచ్చి, ఆసుపత్రిలో చేర్పించింది. ఆ బాలిక ప్రస్తుతం చికిత్స పొందుతోంది. ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.