Odisha Train Accident : ఒడిశా ఘోర రైలు ప్రమాద ఘటనపై ఆడియో వైరల్.. విస్తుపోయే నిజాలు వెలుగులోకి..!

ABN , First Publish Date - 2023-06-04T18:30:04+05:30 IST

ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో దాదాపు 290 మంది మరణించగా.. వందలాది మంది క్షతగాత్రులయ్యారు. ప్రమాద ఘటనపై సోషల్ మీడియాలో ఆడియో వైరల్ కావడం సంచలనంగా మారింది.

Odisha Train Accident : ఒడిశా ఘోర రైలు ప్రమాద ఘటనపై ఆడియో వైరల్.. విస్తుపోయే నిజాలు వెలుగులోకి..!

ఒడిశా(Odisha)లో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో దాదాపు 290 మంది మరణించగా.. వందలాది మంది క్షతగాత్రులయ్యారు. ఈ ఘోర రైలు ప్రమాదానికి టెక్నికల్ లోపం కారణమా? లేక మానవ తప్పిదమా..? అని పలు సందేహాల వ్యక్తమవుతుండగా.. ప్రమాద ఘటనపై సోషల్ మీడియాలో ఆడియో వైరల్ కావడం సంచలనంగా మారింది. ఇద్దరు రైల్వే అధికారుల మధ్య జరిగిన సంభాషణ ఆ ఆడియోలో ఉంది. సౌత్ ఈస్ట్రన్ రైల్వేలో ట్రాఫిక్ సీఎస్‌వోగా(CSO (traffic)South Eastern railway ) అశోక్ అగర్వాల్(Ashok Agarwal) వాయిస్‌తో ప్రమాద ఘటనకు సంబంధించిన సంచలన విషయాలు ఈ ఆడియో ద్వారా బయటపడ్డాయి. ఈ ఆడియోలో ప్రమాద ఘటనకు సంబంధించిన నివేదిక విషయంలో అనుమానాలను వ్యక్తం చేస్తూ ఆ ఇద్దరు రైల్వే అధికారులు మాట్లాడుకున్నారు. ఘటన జరిగిన తీరుకు నివేదిక కొంచెం విరుద్ధంగా ఉందని ఓ అధికారి అనుమానం వ్యక్తం చేయగా.. అశోక్ అగర్వాల్ నివేదికలో స్పష్టత లేదని చెప్పారు.

ఇంతకీ ఆడియోలో ఏముంది..!?

సిగ్నల్ మెయిన్ లైన్‌(mainline)కు త్రూ చేశారు. కానీ పాయింట్ ఫేసింగ్ లూప్‌లైన్‌(Loop Line)లో ఉంచారని ఇదే ప్రమాదానికి కారణమని అధికారుల మధ్య సంభాషణ జరిగింది. ఎవరైనా కావాలనే చేస్తే అలా జరిగే అవకాశం ఉందని ప్రమాద సమయంలో ఎవరో గందరగోళం చేసేందుకు ప్రయత్నించారు. గందరగోళం జరగడం వల్లే ఈ ఘోర ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. కోరమండల్ ఎక్స్‌ప్రెస్ గూడ్స్‌ను ఢీకొట్టడం వల్లే బోగీలు పక్క ట్రాక్‌పై ఎగిరిపడ్డాయి. ఎగిరిపడిన బోగీల్లో కొన్నింటిని హౌరా ఎక్స్‌ప్రెస్ ఢీకొట్టింది’ అని ఇద్దరు మాట్లాడుకున్నట్లు ఆడియోలో ఉంది.

ఆ ఇద్దరు అధికారుల మధ్య సంభాషణ విధానం ఇలా..

ఆ ఇద్దరు అధికారుల మధ్య సంభాషణ..

కాలర్: ప్రమాదంపై చివరిగా ఏం తేల్చారు?

అశోక్ అగర్వాల్: పాయింట్ లూప్‌లైన్‌లో సెట్ చేయబడింది. కానీ సిగ్నల్ మెయిన్‌లైన్‌కి వెళ్లింది.

కాలర్: ఇది ఎలా సాధ్యం?

అశోక్ అగర్వాల్: అవకతవకలు జరిగితే అలా జరగొచ్చు.

కాలర్: అయితే వారు ఆ సమయంలో ఏదైనా పనిలో ఉన్నారా?

అశోక్ అగర్వాల్: అవును..పని జరుగుతోంది. కొంత గందరగోళం జరిగింది.. మెయిన్‌లైన్‌కి సిగ్నల్ ఇచ్చారు. కానీ ఫేసింగ్ పాయింట్ లూప్ లైన్‌కి ఉంది.

కాలర్: అందుకే కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ గూడ్స్ రైలును ఢీకొట్టింది?

అశోక్ అగర్వాల్: అవును సార్.. అది గూడ్స్ రైలును ఢీకొట్టింది. ఆపై అన్ని కోచ్‌లు, లోకోలు చెల్లాచెదురుగా పడ్డాయి. మరో ట్రాక్‌పై పడ్డ కోచ్‌లను హౌరా ఎక్స్‌ప్రెస్ ఢీకొంది. అంటూ ఇద్దరు అధికారుల మధ్య సంభాషణ కొనసాగింది.

అయితే.. మరోవైపు ప్రమాదానికి అసలు కారణాన్ని గుర్తించామని త్వరలోనే నివేదికను అందజేస్తామని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. సిగ్నలింగ్ లోపంతో మొదట కోరమాండల్ లూప్‌లైన్‌లోకి ప్రవేశించి.. గూడ్స్ రైలును ఢీకొట్టిందని ఇప్పటివరకు జరిగిన విచారణ ప్రాథమిక నివేదికలు చెబుతున్నాయి. అంతేకాదు.. ప్రధాన ట్రాక్‌లోకి వెళ్లేందుకు కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌కు సిగ్నల్ ఇచ్చినట్లే ఇచ్చి తర్వాత సిగ్నల్ నిలిపివేయబడింది. దీంతో కోరమాండల్ అతి వేగంతో లూప్‌లైన్‌లోకి ప్రవేశించి గూడ్స్ రైలును ఢీకొట్టిందని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు.

Updated Date - 2023-06-04T20:26:12+05:30 IST