Uddhav Thackeray: ప్రభుత్వాన్ని కూల్చిన ఆ 40 మంది పీతల్లాంటి వారు
ABN , First Publish Date - 2023-07-27T01:45:30+05:30 IST
తన నాయకత్వంపై తిరుగుబాటు చేసిన 40 మంది శివసేన ఎమ్మెల్యేలను శివసేన(ఉద్ధవ్ బాల్‌ఠాక్రే) అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే(Uddhav Thackeray) పీతలతో పోల్చారు. తన నేతృత్వంలోని మహావికాస్ అఘాడీ(Mahavikas Aghadi) ప్రభుత్వం (వర్షాల్లో) కొట్టుకుపోలేదని, పీత లు డ్యామ్(ప్రభుత్వం)ను కూల్చివేశాయని ఆయన పేర్కొన్నారు.
తిరుగుబాటు చేసిన ఎమ్మెల్యేలపై ఉద్ధవ్ ఆగ్రహం
ముంబై, జూలై 26: తన నాయకత్వంపై తిరుగుబాటు చేసిన 40 మంది శివసేన ఎమ్మెల్యేలను శివసేన(ఉద్ధవ్ బాల్‌ఠాక్రే) అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే(Uddhav Thackeray) పీతలతో పోల్చారు. తన నేతృత్వంలోని మహావికాస్ అఘాడీ(Mahavikas Aghadi) ప్రభుత్వం (వర్షాల్లో) కొట్టుకుపోలేదని, పీత లు డ్యామ్(ప్రభుత్వం)ను కూల్చివేశాయని ఆయన పేర్కొన్నారు. ఉద్ధవ్ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూకు సంబంధించిన ప్రోమో విడుదలైంది. దానిలో గతేడాది భారీ వర్షాల్లో మీ ప్రభుత్వం కొట్టుకుపోయిందా అన్న ప్రశ్నకు ఆయన ఈ మేరకు సమాధానమిచ్చారు. ఎంపీ సంజయ్ రౌత్ చేసిన ఈ ఇంటర్వూ, రెండు భాగాలుగా బుధ, గురువారాల్లో శివసేన యూబీటీ చానల్‌లో ప్రసారం అవుతుంది. ఈ ప్రోమోలో సీఎం ఏక్‌నాథ్ షిండే, ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీ్‌సలతో పాటు ఎన్నికల సంఘంపైనా ఉద్ధవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శివసేన పేరును, గుర్తును నిర్ణయించడానికి ఈసీ, శివసేన బంధువు కాదని వ్యాఖ్యానించారు. బీజేపీకి ఉద్ధవ్ వెన్నుపోటు పొడిచారన్న ఫడణవీస్ వ్యాఖ్యలపై స్పందిస్తూ, ‘బీజేపీని ఎన్సీపీ కూడా వెన్నుపోటు పొడిచిందా, ఎందుకంటే ఎన్సీపీని కూడా బీజేపీ చీల్చింది కదా’ అని పేర్కొన్నారు. అలాగే షిండే ఢిల్లీకి వెళ్లడంపై మాట్లాడుతూ, ‘ప్రతి రోజూ ఢిల్లీ వెళ్లి నమస్కారాలు పెట్టడం మన సంస్కృతి కాద’ని ఉద్ధవ్ అన్నారు.