Share News

Sanatana Dharma Row: సనాతన ధర్మాన్ని వ్యతిరేకిస్తూనే ఉంటా.. మరో బాంబ్ పేల్చిన ఉదయనిధి స్టాలిన్

ABN , First Publish Date - 2023-11-06T20:22:19+05:30 IST

గతంలో ‘సనాతన ధర్మం’పై తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు ఎంత దుమారం రేపాయో అందరికీ తెలిసిందే. సనాతన ధర్మం డెంగ్యూ, మలేరియా లాంటిదని.. దాన్ని పూర్తిగా నిర్మూలించాలని ఆయన కుండబద్దలు...

Sanatana Dharma Row: సనాతన ధర్మాన్ని వ్యతిరేకిస్తూనే ఉంటా.. మరో బాంబ్ పేల్చిన ఉదయనిధి స్టాలిన్

గతంలో ‘సనాతన ధర్మం’పై తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు ఎంత దుమారం రేపాయో అందరికీ తెలిసిందే. సనాతన ధర్మం డెంగ్యూ, మలేరియా లాంటిదని.. దాన్ని పూర్తిగా నిర్మూలించాలని ఆయన కుండబద్దలు కొట్టారు. ఈ వ్యాఖ్యలపై దేశ రాజకీయాల్లో పెను వివాదమే చెలరేగింది. ముఖ్యంగా.. బీజేపీ తారాస్థాయిలో విమర్శలు ఎక్కుపెట్టింది. అయినా సరే.. తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉంటానని ఉదయనిధి తేల్చి చెప్పారు. తాజాగా ఆయన మళ్లీ అదే రిపీట్ చేశారు. తన వ్యాఖ్యల్ని ఏమాత్రం వెనక్కు తీసుకోబోనని బాంబ్ పేల్చారు.


‘‘సనాతన ధర్మంపై నేను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉంటాను. నా వ్యాఖ్యలను ఏమాత్రం వెనక్కు తీసుకోను. నేనేమీ తప్పుగా మాట్లాడలేదు. నేను చెప్పింది నిజమే. చట్టపరంగా ఎలాంటి సవాళ్లు ఎదుర్కోవడానికైనా నేను సిద్ధమే. నేను నా భావాజాలాన్ని వ్యక్తిపరిచాను. అంబేడ్కర్‌, పెరియార్‌, తిరుమావళన్‌ మాట్లాడిన దానికన్నా నేనేమీ ఎక్కువ మాట్లాడలేదు’’ అని ఉదయనిధి చెప్పారు. తనకు ‘మనుషులే’ ప్రధానమని నొక్కి చెప్పారు. మంత్రి, ఎమ్మెల్యే, యూత్ వింగ్ సెక్రటరీ వంటి పదవుల్లో తాను ఉండొచ్చు లేదా ఉండకపోవచ్చని.. కానీ మనిషిగా ఉండటం చాలా ముఖ్యమని అన్నారు. సనాతన ధర్మం అనేది కొన్ని వందల సంవత్సరాల సమస్య అని.. దీనికి వ్యతిరేకంగా తాము మాట్లాడుతూనే ఉంటామని పేర్కొన్నారు.

కాగా.. సెప్టెంబర్‌లో ఒక సభలో సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించిన కేసుని మద్రాసు హైకోర్టు విచారించింది. ఈ సందర్భంగా.. అధికారంలో ఉన్నవారు రెచ్చగొట్టే ప్రసంగాలు చేయొద్దని, ఏదైనా భావజాలాన్ని రద్దు చేసే హక్కు ఏ వ్యక్తికీ లేదని పేర్కొంది. భావజాలం, కులం, మతం పేరుతో ప్రజలను విభజించే అభిప్రాయాలను ప్రచారం చేయడానికి బదులు.. పానీయాలు, మాదకద్రవ్యాలను నిర్మూలించే కార్యక్రమాలపై దృష్టి పెట్టాలని చెప్పింది. అలాగే.. సనాతన ధర్మంపై ప్రసంగాన్ని ఏర్పాటు చేసిన సభ నిర్వాహకులు, ఉదయనిధిపై చర్యలు తీసుకోవడంలో పోలీసులు విఫలమయ్యారని విమర్శించింది. ఈ నేపథ్యంలోనే ఉదయనిధి పైవిధంగా స్పందించారు.


ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలేంటి?

సెప్టెబర్‌లో నిర్వహించిన ఒక సభలో ఉదయనిధి మాట్లాడుతూ.. ‘‘కొన్ని విషయాలను మనం వ్యతిరేకించలేం. వాటిని పూర్తిగా రద్దు చేయాలి. డెంగ్యూ, దోమలు, మలేరియా, కరోనావైరస్ వంటి వాటిని వ్యతిరేకించలేం. వాటిని మనం నిర్మూలించాలి. సనాతన ధర్మాన్ని కూడా అలాగే నిర్మూలించాల్సి ఉంటుంది. సనాతనాన్ని వ్యతిరేకించడం కన్నా నిర్మూలించడమే ఉత్తమం. సనాతన అనే పేరు సంస్కృతం నుంచి వచ్చింది. ఇది సామాజిక న్యాయం, సమానత్వానికి విరుద్ధం’’ అని చెప్పుకొచ్చారు.

ఉదయనిధి ఈ వ్యాఖ్యలు చేయడమే ఆలస్యం.. బీజేపీ తీవ్రస్థాయిలో మండిపడింది. ఈ వ్యాఖ్యాల్ని ‘ఇండియా’ కూటమికి కూడా ఆపాదించి.. రాజకీయ ప్రయోజనం పొందేందుకు గట్టిగానే ప్రయత్నించింది. అంతేకాదు.. ఉదయనిధి తలపై ఆఫర్ కూడా ప్రకటించారు. ఐటీ మంత్రి అమిత్ మాల్వియా అయితే.. హిట్లర్ లాంటి ఆలోచనల్ని ఉదయనిధి కలిగి ఉన్నారంటూ సంచలన ఆరోపణలు గుప్పించారు. ప్రస్తుతం అందరూ ఎన్నికల హడావుడిలో పడటంతో.. ఈ వివాదం కొంత తగ్గుముఖం పట్టింది.

Updated Date - 2023-11-06T20:22:20+05:30 IST