Share News

Ayodhya Deepotsav: 51 ఘాట్‌లు..24 లక్షల దీపాలు.. అయోధ్యలో ప్రపంచ రికార్డు

ABN , First Publish Date - 2023-11-11T17:50:38+05:30 IST

అయోధ్యలో రామమందిర నిర్మాణం శరవేగంగా జరుగుతున్న తరుణంలో దీపావళి సంబరం ఈసారి అంబరాన్నంటనుంది. సరయూ తీరంలోని మొత్తం 51 ఘాట్‌లలో ఏకకాలంలో 24 లక్షల ద్వీపాలను వెలిగించనున్నారు.

Ayodhya Deepotsav: 51 ఘాట్‌లు..24 లక్షల దీపాలు.. అయోధ్యలో ప్రపంచ రికార్డు

అయోధ్య: అయోధ్యలో రామమందిర నిర్మాణం శరవేగంగా జరుగుతున్న తరుణంలో దీపావళి (Diwali) సంబరం ఈసారి అంబరాన్నంటనుంది. నభూతో నభవిష్యతి అనే రీతిలో దీపోత్సవ్ జరిపేందుకు ఉత్తరప్రదేశ్‌లోని (Uttar pradesh) అయోధ్యా (Ayodhya) నగరం ముస్తాబైంది. దీపావళికి ఒకరోజు ముందే ఏటా సరయూ నది తీరాన నిర్వహించే 'దీపోత్సవ్' కార్యక్రమం శనివారం సాయంత్రం మొదలవుతోంది. సరయూ తీరంలోని మొత్తం 51 ఘాట్‌లలో ఏకకాలంలో 24 లక్షల ద్వీపాలను వెలిగించనున్నారు. ఈ కార్యక్రమాన్ని గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు ప్రతినిధులు హాజరై, డ్రోన్ కెమెరాలతో దీపాలను లెక్కించనున్నారు. సాయంత్రం 6.30 గంటలకు యోగి ఆదిత్యనాథ్ సరయూ హారతి ఇవ్వగానే 25 వేల మంది వాలంటీర్లు 24 లక్షల దీపాలను వెలిగిస్తారు.


కాగా, దీపోత్సవ్ కార్యక్రమానికి ముందు నిర్వహించిన రాజాభిషేక్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, గవర్నర్ ఆనందిబెన్ పటేల్ హాజరయ్యారు. రామ్ కథా పార్క్‌ సమీపంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో రాముడు, సీత, లక్ష్మణ్ వేషధారులకు సీఎం సాదర స్వాగతం పలికారు. వేడుకల్లో భాగంగా రామజన్మభూమి మార్గాన్ని వివిధ రకాల పుష్పాలతో అలంకరించారు.


గిన్నిస్ వరల్డ్ రికార్డు దిశగా..

అయోధ్యలో 24 లక్షల దీపాలను ఏకకాలంలో వెలిగించడం ద్వారా గిన్నిస్ వరల్డ్ రికార్డును సాధించాలని యూపీ ప్రభుత్వం పట్టుదలగా ఉందని యూపీ ఉప ముఖ్యమంత్రి బ్రిజేష్ పాఠత్ తెలిపారు. ఈ భారీ దీపోత్సవ్ కార్యక్రమానికి జార్ఖండ్ లోని పకూర్ జిల్లాకు చెందిన గిరిజనులతో సహా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్దఎత్తున ప్రజలు, 50 దేశాలకు చెందిన హైకమిషనర్లు, రాయబారులు హాజరవుతున్నట్టు చెప్పారు. కాగా, రామ్ కథా పార్క్‌కు మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో సర్వాంగసుదరంగా అలంరించిన శ్రీరామ శకటం ఆహూతులను విశేషంగా ఆకట్టుకుంది.

Updated Date - 2023-11-11T17:57:58+05:30 IST