Uttar Pradesh : మాఫియా డాన్ కబ్జా భూమిలో పేదలకు అందమైన ఫ్లాట్లు.. నిరుపేద లబ్ధిదారులకు తాళాలు అప్పగించిన యోగి..
ABN , First Publish Date - 2023-06-30T14:45:28+05:30 IST
మాఫియాను మట్టి కరిపిస్తానని చెప్పిన ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆ దిశగా చురుగ్గా చర్యలు తీసుకుంటున్నారు. అదే సమయంలో మాఫియా కబ్జా చేసిన భూములను జప్తు చేసి, అందమైన ఇళ్లను నిర్మించి, నిరుపేదలకు అప్పగిస్తున్నారు. ఆయన శుక్రవారం 76 ఫ్లాట్ల తాళాలను నిరుపేద లబ్ధిదారులకు అప్పగించారు.
ప్రయాగ్‌రాజ్ (ఉత్తర ప్రదేశ్) : మాఫియాను మట్టి కరిపిస్తానని చెప్పిన ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (Uttar Pradesh Chief Minister Yogi Adityanath) ఆ దిశగా చురుగ్గా చర్యలు తీసుకుంటున్నారు. అదే సమయంలో మాఫియా కబ్జా చేసిన భూములను జప్తు చేసి, అందమైన ఇళ్లను నిర్మించి, నిరుపేదలకు అప్పగిస్తున్నారు. ఆయన శుక్రవారం 76 ఫ్లాట్ల తాళాలను నిరుపేద లబ్ధిదారులకు అప్పగించారు. ఇటీవల హత్యకు గురైన మాఫియా డాన్, రాజకీయ నేత అతిక్ అహ్మద్ కబ్జా చేసిన భూమిని స్వాధీనం చేసుకుని, ఈ ఫ్లాట్లను నిర్మించారు.
ఈ భూమిలో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (పట్టణ) పథకం క్రింద ఈ 76 ఫ్లాట్లను నిర్మించారు. వీటికి లబ్ధిదారులను జూన్ 9న లాటరీ ద్వారా ఎంపిక చేశారు. వీటి తాళాలను లబ్ధిదారులకు అందజేస్తున్న సందర్భంగా యోగి ఆదిత్యనాథ్ స్థానిక బాలలతో మాట్లాడారు. ఈ ఫ్లాట్లను ఆయన స్వయంగా పరిశీలించారు. ఫ్లాట్ల లోపలి గదుల్లో కలియదిరిగి కొళాయిలు, ఇతర సదుపాయాలను తనిఖీ చేశారు. నగరంలో 226 డెవలప్‌మెంట్ ప్రాజెక్టులను యోగి ప్రారంభించారు.
ఈ సందర్భంగా యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ, 2017వ సంవత్సరానికి పూర్వం పేదలు, వ్యాపారులు, ప్రభుత్వ సంస్థల భూములను మాఫియా కబ్జా చేసేదని, పేదలు నిస్సహాయంగా చూసేవారని గుర్తు చేశారు. ఆ విధంగా కబ్జాకు గురైన భూములను స్వాధీనం చేసుకుని, వాటిలో ఇప్పుడు తాము పేదల కోసం ఇళ్లను నిర్మిస్తున్నామని చెప్పారు. ఇది గొప్ప విజయమని తెలిపారు.
41 చదరపు మీటర్ల వైశాల్యంలో రెండు గదులు, ఓ వంటగది, ఓ మరుగుదొడ్డితో ఈ ఫ్లాట్‌ను నిర్మించారు. ఒక్కొక్క ఫ్లాట్ ఖరీదు రూ.6 లక్షలు అని, లబ్ధిదారులకు కేవలం రూ.3.5 లక్షలకే అందజేశామని అధికారులు తెలిపారు. లబ్ధిదారుల ఎంపిక కోసం అలహాబాద్ మెడికల్ అసోసియేషన్ ఆడిటోరియంలో ఓ కార్యక్రమాన్ని నిర్వహించామని, 6,030 దరఖాస్తులను పరిశీలించి, లాటరీలో పాల్గొనడానికి 1,590 మంది దరఖాస్తుదారులు అర్హులని నిర్థరించామని చెప్పారు.
ప్రయాగ్‌రాజ్‌లోని లుకేర్‌గంజ్ ప్రాంతంలో మాఫియా డాన్, సమాజ్‌వాదీ పార్టీ నేత అతిక్ అహ్మద్ కబ్జా చేసిన భూమిని రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. 1,731 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిరుపేదలకు అందుబాటులో ఉండేవిధంగా ఫ్లాట్లను నిర్మించింది. యోగి ఆదిత్యనాథ్ 2021 డిసెంబరు 26న వీటి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
ఇవి కూడా చదవండి :
Make in India : మోదీపై పుతిన్ ప్రశంసల జల్లు