SC: సీనియర్ న్యాయమూర్తి వేధింపులతో మహిళా జడ్జి మనస్తాపం.. ఆత్మహత్యకు అనుమతి కోరుతూ సీజేఐకి లేఖ
ABN , Publish Date - Dec 15 , 2023 | 11:55 AM
ఉత్తరప్రదేశ్‌లోని ఓ మహిళా న్యాయమూర్తి సీనియర్ల వేధింపులు తాలలేక ఆత్మహత్యకు అనుమతి కోరుతూ రాసిన బహిరంగ లేఖ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లో ఒక మహిళా న్యాయమూర్తి తనను ఓ సీనియర్ జడ్జి లైైంగిక వేధింపులకు గురిచేస్తున్నారని, ఆత్మహత్యకు అనుమతి కోరుతూ రాసిన బహిరంగ లేఖ సంచలనం సృష్టిస్తోంది. సుప్రీంకోర్టు (Supreme Court) ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్‌కి(CJI Justice Chandrachud) రాసిన ఈ లేఖ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
"బారాబంకిలోని ఒక జిల్లా జడ్జి, ఆయన సహచరులు నన్ను లైంగికంగా వేధిస్తున్నారు. నన్ను చెత్తలో పురుగులా చూస్తున్నారు. దయచేసి గౌరవప్రదంగా నా జీవితాన్ని ముగించడానికి అనుమతినివ్వండి" అంటూ లేఖలో పేర్కొంది. ఆమె లేఖను అందుకున్న సీజేఐ సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్ అతుల్ ఎం కుర్హేకర్ అలహాబాద్ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌కు లేఖ రాస్తూ మహిళా న్యాయమూర్తి చేసిన ఫిర్యాదుపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.
హైకోర్టు తాత్కాలిక జడ్జి ఆ లెటర్ గురించి ఆరా తీస్తున్నారు. తాను ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా జులైలో విచారణ చేపట్టారని, కానీ ఆ ఎంక్వైరీలో ఏమీ తేలలేదని మహిళా జడ్జి తన లేఖలో పేర్కొన్నారు. లోతుగా విచారించడానికి జిల్లా జడ్జికి ట్రాన్స్‌ఫర్ చేయాలని ఆమె లేఖలో కోరారు.
కానీ ఆ పిటిషన్‌ని సుప్రీంకోర్టు కొట్టేయడంతో న్యాయం జరిగే అన్ని దారులు మూసుకుపోయాయని అన్నారు. తనకు జీవించాలని లేదని, ఏడాది కాలంగా శవంలా బతుకుతున్నానని, జీవం లేని ఈ శరీరాన్ని ముందుకు తీసుకువెళ్లడం వల్ల ఏం లాభం జరగదని లేఖలో ఆవేదన వ్యక్తం చేసింది. ఈ ఘటనపై అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.