US Coast Guard : టైటాన్ సబ్‌మెర్సిబుల్‌ శకలాల్లో మానవ అవశేషాలు!

ABN , First Publish Date - 2023-06-29T15:18:56+05:30 IST

ఉత్తర అట్లాంటిక్ సముద్రంలోని టైటానిక్ నౌక శిథిలాలను చూడటం కోసం ఔత్సాహికులను తీసుకెళ్లిన టైటాన్ సబ్‌మెర్సిబుల్ (Titan submersible) శకలాల నుంచి కొన్నిటిని స్వాధీనం చేసుకున్నట్లు అమెరికా కోస్ట్ గార్డ్ తెలిపింది. ఇవి మానవ అవశేషాలు అయి ఉండవచ్చునని తెలిపింది. వీటిని తిరిగి అమెరికాకు తీసుకొస్తున్నట్లు, వీటిని పరీక్షించి, విశ్లేషించనున్నట్లు వివరించింది.

US Coast Guard : టైటాన్ సబ్‌మెర్సిబుల్‌ శకలాల్లో మానవ అవశేషాలు!

న్యూఢిల్లీ : ఉత్తర అట్లాంటిక్ సముద్రంలోని టైటానిక్ నౌక శిథిలాలను చూడటం కోసం ఔత్సాహికులను తీసుకెళ్లిన టైటాన్ సబ్‌మెర్సిబుల్ (Titan submersible) శకలాల నుంచి కొన్నిటిని స్వాధీనం చేసుకున్నట్లు అమెరికా కోస్ట్ గార్డ్ తెలిపింది. ఇవి మానవ అవశేషాలు అయి ఉండవచ్చునని తెలిపింది. వీటిని తిరిగి అమెరికాకు తీసుకొస్తున్నట్లు, వీటిని పరీక్షించి, విశ్లేషించనున్నట్లు వివరించింది. ఈ సబ్‌మెర్సిబుల్ గత వారం సముద్రంలో మునిగిపోవడంతో దీనిలో ప్రయాణిస్తున్న ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.

టైటాన్ సబ్‌మెర్సిబుల్ శకలాలు బుధవారం సెయింట్ జాన్స్, న్యూఫౌండ్‌ల్యాండ్, లాబ్రడార్ నౌకాశ్రయానికి చేరుకున్నాయి. సముద్ర గర్భం నుంచి సేకరించిన ఆధారాలను మానవ అవశేషాలుగా భావిస్తున్నట్లు అమెరికన్ కోస్ట్ గార్డ్ విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. ఈ కీలక సాక్ష్యాధారాలను సేకరించడంలో, భద్రపరచడంలో అంతర్జాతీయ సంస్థలు సమన్వయంతో కృషి చేసినందుకు కోస్ట్ గార్డ్ చీఫ్ కెప్టెన్ జేసన్ న్యూబౌర్ ధన్యవాదాలు తెలిపారు. ఈ విషాదానికి కారణాలను తెలుసుకోవడం కోసం వివిధ దేశాలకు చెందిన సంస్థలు చేసే దర్యాప్తునకు ఈ సాక్ష్యాధారాలు ఉపయోగపడతాయని తెలిపారు. టైటాన్ విపత్తుకు కారణాలను అర్థం చేసుకోవడం కోసం ఇంకా చాలా కృషి చేయవలసి ఉందన్నారు.

గత ఆదివారం నుంచి కనిపించకుండా పోయిన టైటాన్ సబ్‌మెర్సిబుల్ శకలాలను గుర్తించేందుకు కెనడాకు చెందిన నౌక హొరైజాన్ ఆర్కిటిక్ రిమోట్‌లీ ఆపరేటెడ్ వెహికిల్‌ (ROV)తో కార్యకలాపాలను నిర్వహించింది. టైటానిక్ నౌక శిథిలాల వద్ద నిర్వహించిన ఈ ఆఫ్‌షోర్ కార్యకలాపాలు ముగిసినట్లు ఈ ఆర్ఓవీ యాజమాన్య కంపెనీ పెలాజిక్ రీసెర్చ్ సర్వీసెస్ బుధవారం ప్రకటించింది. అయితే అమెరికా, కెనడాలకు చెందిన ప్రభుత్వ సంస్థలు ఈ దర్యాప్తులో భాగస్వాములైనందువల్ల ఈ దర్యాప్తు గురించి మరిన్ని వివరాలను చెప్పలేమని ఈ కంపెనీ అధికార ప్రతినిధి ఒకరు చెప్పారు.

టైటాన్ సబ్‌మెర్సిబుల్ శకలాలు టైటానిక్ నౌక శిథిలాల నుంచి దాదాపు 1,600 అడుగుల దూరంలో, 12,500 అడుగుల లోతులో కనిపించినట్లు అమెరికన్ కోస్ట్ గార్డ్ వెల్లడించింది. జూన్ 18న టైటాన్ సబ్‌మెర్సిబుల్ ఎందుకు కుప్పకూలిపోయిందో తెలుసుకునేందుకు దర్యాప్తు కొనసాగుతోందని తెలిపింది. దీనిలో ప్రయాణిస్తున్న ఐదుగురు ప్రాణాలు కోల్పోయినట్లు జూన్ 22న ప్రకటించిన సంగతి తెలిసిందే.

అత్యున్నత స్థాయి దర్యాప్తు

టైటాన్ సబ్‌మెర్సిబుల్ కుప్పకూలిపోవడానికి కారణాలేమిటో తెలుసుకునేందుకు అమెరికా కోస్ట్ గార్డ్ ఓ దర్యాప్తు కమిటీ (Marine Board of Investigation)ను ఏర్పాటు చేసింది. కోస్ట్ గార్డ్ నిర్వహించే అత్యున్నత స్థాయి దర్యాప్తు ఇది. సముద్రంలోని అట్టడుగు ప్రాంతాల్లో ప్రయాణించే ప్రతి వాహనంలోనూ ఉండే పరికరాలన్నీ ఎప్పటికప్పుడు సమాచారాన్ని నమోదు చేస్తాయని, అయితే ఆ డేటా అందుబాటులో ఉందా? అనేదే ప్రశ్న అని ఓ అధికారి తెలిపారు.

ఐదుగురు బాధితులు

ఓషన్ గేట్ సీఈఓ, పైలట్ స్టాక్‌టన్ రష్, పాకిస్థాన్‌కు చెందిన షహజాదా దావూద్, ఆయన కుమారుడు సులేమాన్ దావూద్, బ్రిటిష్ అడ్వంచరర్ హమీష్ హార్డింగ్, టైటానిక్ ఎక్స్‌పర్ట్ పౌల్ - హెన్రీ నార్గియోలెట్ ఈ టైటాన్ సబ్‌మెర్సిబుల్‌లో ప్రయాణించారు. వీరంతా ప్రాణాలు కోల్పోయారు.

ప్రయాణికులపై భారీ వడ్డన

అమెరికాకు చెందిన ఓషన్‌గేట్ ఎక్స్‌పెడిషన్స్ కంపెనీకి చెందినదే టైటాన్ సబ్‌మెర్సిబుల్‌. దీనిని ఈ కంపెనీయే నిర్వహించింది. అయితే సబ్‌మెర్సిబుల్‌ను బహమాస్‌లో రిజిస్టర్ చేయించారు. ఈ సబ్‌మెర్సిబుల్‌ మదర్ షిప్ పోలార్ ప్రిన్స్ కెనడాకు చెందినది. ఈ సాహస ప్రయాణం కోసం ఒక్కొక్కరు 2,50,000 డాలర్లు చెల్లించినట్లు తెలుస్తోంది.

భద్రతపై ప్రశ్నలు

ఈ సబ్‌మెర్సిబుల్‌ సముద్రంలో కుప్పకూలిపోవడంతో ప్రైవేట్ అండర్‌సీ ఎక్స్‌ప్లొరేషన్ ఆపరేషన్స్ భద్రత గురించి ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. తాజా దర్యాప్తులో వెల్లడయ్యే కారణాలనుబట్టి మరిన్ని కట్టుదిట్టమైన చర్యలను అమలు చేయడానికి వీలవుతుందని కోస్ట్ గార్డ్ చెప్తోంది.

చాలా తేడా

సబ్‌మెరైన్‌కు, సబ్‌మెర్సిబుల్‌కు తేడా ఉంది. సబ్‌మెరైన్లు (జలాంతర్గాములు) సాధారణంగా సైనిక, సైంటిఫిక్ కార్యకలాపాల కోసం ఉపయోగిస్తారు. సబ్‌మెర్సిబుల్‌ 2.8 మీటర్ల వెడల్పు, 6.7 మీటర్ల పొడవు ఉంటుంది. ఇది కదిలే వేగం పరిమితంగా ఉంటుంది. గరిష్ఠంగా గంటకు 5.5 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. సముద్రంలోపల దాదాపు 4 వేల మీటర్ల లోతు వరకు వెళ్లగలదు. అయితే సబ్‌మెర్సిబుల్‌ను ఇటీవలి కాలంలో పర్యాటక రంగంలో ఉపయోగిస్తున్నారు.

ఇవి కూడా చదవండి :

Obama Vs Modi : బరాక్ ఒబామా ఓ ప్రైవేట్ వ్యక్తి : అమెరికా

Eid al-Adha : ఈద్ అల్-అదా పండుగ సందర్భంగా మోదీ శుభాకాంక్షలు

Updated Date - 2023-06-29T15:18:56+05:30 IST