Gangster Killed: యూపీలో మరో గ్యాంగ్‌స్టర్ ఎన్‌కౌంటర్.. ఇప్పటిదాకా 184 మంది క్రిమినల్స్‌ హతం

ABN , First Publish Date - 2023-05-04T17:09:36+05:30 IST

అనిల్ దుజానా అని కరడుగట్టిన గ్యాంగ్‌స్టర్ హతమయ్యాడు. ఇతడిపై మొత్తం 18 హత్య కేసులున్నాయి. కాంట్రాక్ట్ కిల్లర్ కూడా.

Gangster Killed: యూపీలో మరో గ్యాంగ్‌స్టర్ ఎన్‌కౌంటర్.. ఇప్పటిదాకా 184 మంది క్రిమినల్స్‌ హతం
Gangster Anil Dujana

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో స్పెషల్ టాస్క్ పోలీసులు మరో గ్యాంగ్‌స్టర్‌ను ఎన్‌కౌంటర్ చేశారు. అనిల్ దుజానా అని కరడుగట్టిన గ్యాంగ్‌స్టర్ హతమయ్యాడు. ఇతడిపై మొత్తం 18 హత్య కేసులున్నాయి. కాంట్రాక్ట్ కిల్లర్ కూడా. మీరట్ యూనిట్ పోలీసులు అనిల్ దుజానాను లేపేశారని ఉత్తరప్రదేశ్ ఎస్టీఎఫ్ అడిషనల్ డీజీపీ అమితాబ్ యష్ తెలిపారు.

ఉత్తరప్రదేశ్‌లో 2017లో అధికారంలోకి వచ్చినప్పటినుంచి ముఖ్యమంత్రి (Uttar Pradesh Chief Minister) యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) మాఫియాపై ఉక్కుపాదం మోపుతున్నారు. డాన్‌లను, క్రిమినల్స్‌ను, గూండాలను, రౌడీలను ఏమాత్రం ఉపేక్షించడం లేదు. అధికారంలోకి రాగానే శాంతి భద్రతలు సరిచేయడంపై దృష్టిపెట్టిన యోగి గ్యాంగ్‌స్టర్స్ యాక్ట్ తీసుకొచ్చారు. దీని ప్రకారం 50 వేల మంది క్రిమినల్స్‌కు చెందిన ఆస్తులను సీజ్ చేశారు. గూండా యాక్ట్ కూడా తీసుకొచ్చారు. 2017 మార్చ్ 20 నుంచి ఇప్పటివరకూ 23 వేల మందికి పైగా అరెస్ట్ చేశారు. క్రిమినల్స్‌ను వేటాడే క్రమంలో 4911 మంది గాయపడ్డారు. క్షతగాత్రుల్లో 1424 మంది పోలీసులున్నారు.

2017 మార్చ్ నుంచి ఇప్పటివరకూ 184 మంది క్రిమినల్స్‌ను యూపీ పోలీసులు మట్టుబెట్టారు.

2017లో 28

2018లో 41

2019లో 34

2020లో 26

2021లో 26

2022లో 14

2023లో 15

ఎదురుకాల్పుల ఘటనల్లో 13 మంది పోలీసులు కూడా చనిపోయారు.

ఇటీవలి ఎన్‌కౌంటర్లు

ఈ ఏడాది ఫిబ్రవరి 24న ఉమేశ్ పాల్(Umeshh pal) అనే న్యాయవాదిని ప్రయాగ్‌రాజ్‌లో ఆయన నివాసం వెలుపల పట్టపగలు గ్యాంగ్‌స్టర్ అతీఖ్ అహ్మద్ (Gangster politician Atiq Ahmed) కుమారుడు అసద్(Asad), అతడి సహచరుడు గులాం(Ghulam) సహా మొత్తం పది మంది కాల్పులు జరిపి హత్య చేశారు. వీరి కాల్పుల్లో ఉమేశ్‌పాల్‌కు రక్షణ కల్పిస్తున్న ఇద్దరు పోలీస్ సిబ్బంది కూడా చనిపోయారు. 2005లో జరిగిన బీఎస్పీ ఎమ్మెల్యే రాజు పాల్ హత్య కేసులో ఉమేశ్ పాల్ సాక్షి. ఉమేశ్ పాల్ హత్య కేసును యూపీ సర్కార్ ఒక సవాలుగా తీసుకుంది. మాఫియా నేతలను మట్టిలో కలిపేస్తామని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రతిన కూడా చేశారు. ఆ తర్వాత పోలీసులు వేట మొదలుపెట్టారు.

ఉమేశ్ పాల్ హత్య తర్వాత పరారైన అసద్, గులామ్‌ను ఏప్రిల్ 13న ఝాన్సీ బోర్డర్ వద్ద యూపీ ఎస్టీఎఫ్ హతమార్చింది. ఆ తర్వాత 48 గంటల్లోనే ఏప్రిల్ 15న అతీఖ్ అహ్మద్, అతడి సోదరుడు అష్రఫ్‌ను ముగ్గురు వ్యక్తులు అతి సమీపం నుంచి కాల్చి చంపారు. అనంతరం పోలీసులకు లొంగిపోయారు.

యూపీలో పురపాలక ఎన్నికలు జరుగుతున్న వేళ గ్యాంగ్‌స్టర్ అనిల్ దుజానా ఎన్‌కౌంటర్ జరగడం ప్రకంపనలు రేపుతోంది. రాష్ట్రంలో శాంతి భద్రతలు మెరుగుపరిచేందుకే తాము క్రిమినల్స్ అంతుచూస్తున్నామని యూపీ పోలీసులు చెబుతున్నారు.

Updated Date - 2023-05-04T17:11:26+05:30 IST