Share News

Uttarkashi tunnel rescue: సొరంగం రెస్క్యూ ఆపరేషన్‌లో అతిపెద్ద అవరోధం.. నిలువుగా డ్రిల్లింగ్ !

ABN , First Publish Date - 2023-11-25T12:12:25+05:30 IST

ఉత్తరాఖండ్‌ రాష్ట్రం ఉత్తరకాశీ జిల్లాలో నిర్మాణంలో ఉన్న సొరంగం కూలిన ఘటనలో చిక్కుకుపోయిన కూలీలు ఇంకా లోపలే ఉన్నారు. రెస్క్యూ ఆపరేషన్‌లో శుక్రవారం అతిపెద్ద అవరోధం ఎదురైంది.

Uttarkashi tunnel rescue: సొరంగం రెస్క్యూ ఆపరేషన్‌లో అతిపెద్ద అవరోధం.. నిలువుగా డ్రిల్లింగ్ !

ఉత్తరకాశీ: ఉత్తరాఖండ్‌‌లోని ఉత్తరకాశీ జిల్లాలో నిర్మాణంలో ఉన్న సొరంగం కూలిన ఘటనలో చిక్కుకుపోయిన 41 మంది కూలీలు ఇంకా లోపలే ఉన్నారు. రెస్క్యూ ఆపరేషన్‌లో శుక్రవారం అతిపెద్ద అవరోధం ఎదురైంది. అమెరికన్ ఆగర్ యంత్రం మెటల్ గిర్డర్‌ను (ఇనుము బీములు) తాకింది. పని ముందుకు సాగకపోవడంతో యంత్రాలను వెనక్కి పిలిపించారు. ఫలితంగా శుక్రవారం సాయంత్రం నుంచి డ్రిల్లింగ్ పనులు నిలిచిపోయాయి. దీంతో ఇకపై మనుషులతో కొండ పైనుంచి డ్రిల్లింగ్ చేయించే అవకాశాలను అధికారులు పరిశీలిస్తున్నారు. సొరంగంలో నిలువుగా డ్రిల్లింగ్ చేయించాలని భావిస్తున్నారు. అయితే దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. త్వరలో నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. మరోవైపు నిలువుగా డ్రిల్లింగ్ చేపట్టేందుకు రెస్క్యూ ఆపరేషన్ బృందం సన్నద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. యంత్రాలను పూర్తి స్థాయిలో మోహరించినట్టు, మొదలుపెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్టు జాతీయ మీడియా రిపోర్టులు పేర్కొంటున్నాయి.


కూలీలతో డ్రిల్లింగ్..

కొండ పైనుంచి మనుషులతో నిలువుగా డ్రిల్లింగ్ చేయించేందుకు కూలీలు కొండపైకి తరలిస్తున్నట్టు ‘ఇండియా టుడే’ రిపోర్ట్ పేర్కొంది. కూలీల్లో మహిళలు కూడా ఉన్నారని, దాదాపు 20 మంది ఉన్నారని తెలిపింది. ఇదిలావుండగా రెస్క్యూ ఆపరేషన్ పూర్తయ్యి కూలీలను బయటకు తీసుకొచ్చిన తర్వాత వారిని హాస్పిటల్‌కు తరలించేందుకు బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (BRO) సన్నద్ధమైంది. నిలువుగా డ్రిల్లింగ్ చేపట్టే ప్రాంతానికి చేరుకునేందుకు రోడ్డును కూడా సిద్ధం చేస్తున్నారు. కాగా సిల్క్యారా వద్ద నిర్మాణంలో ఉన్న సొరంగం కూలిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో 41 మంది కూలీలు చిక్కుకుపోయారు.

Updated Date - 2023-11-25T12:12:27+05:30 IST