Share News

Watch Video : టన్నెల్ నుంచి 41 మందిని ఎలా బయటకు తీసుకురానున్నారంటే..

ABN , First Publish Date - 2023-11-24T13:29:47+05:30 IST

ఉత్తరాఖండ్‌ రాష్ట్రం, ఉత్తర కాశీ జిల్లాలో సిల్క్యారా వద్ద సొరంగం కూలిన ఘటనలో చిక్కుకున్న 41 మంది నేడు బయటకు వచ్చే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది మాక్ డ్రిల్ నిర్వహించారు. ఒక పెద్ద పైపు ద్వారా వీల్ చైర్‌ను పంపించి దాని సాయంతో వారిని బయటకు తెచ్చేందుకు యత్నిస్తున్నారు.

Watch Video : టన్నెల్ నుంచి 41 మందిని ఎలా బయటకు తీసుకురానున్నారంటే..

Uttarkashi Tunnel Collapse : ఉత్తరాఖండ్‌ రాష్ట్రం, ఉత్తర కాశీ జిల్లాలో సిల్క్యారా వద్ద సొరంగం కూలిన ఘటనలో చిక్కుకున్న 41 మంది నేడు బయటకు వచ్చే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది మాక్ డ్రిల్ నిర్వహించారు. ఒక పెద్ద పైపు ద్వారా వీల్ చైర్‌ను పంపించి దాని సాయంతో వారిని బయటకు తెచ్చేందుకు యత్నిస్తున్నారు. ప్రస్తుతం సిబ్బంది మాక్ డ్రిల్‌కు సంబంధించిన ఒక వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేసింది.

ప్రస్తుతం టన్నెల్‌లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. మరికొద్ది సేపట్లో ఈ రెస్క్యూ ఆపరేషన్ ముగియనుంది. నవంబర్ 12న 41 మంది కార్మికులు టన్నెల్‌లో చిక్కుకున్నారు. 14 రోజుల నుంచి టన్నెల్ లోపలే వారంతా ఉండి పోయారు. ఇది పూర్తైతే ఇండియాలోనే అతిపెద్ద రెస్క్యూ ఆపరేషన్‌ ఇదే అవుతుందని అధికారులు చెబుతున్నారు. నిన్న అర్ధరాత్రి వరకూ రెస్క్యూ ఆపరేషన్ పనులు కొనసాగాయి. మిషన్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో డ్రిల్లింగ్ పనులు నిలిచిపోయాయి. సిల్క్యారా సొరంగంలో 46.8 మీటర్ల వరకూ అధికారులు డ్రిల్లింగ్ పూర్తి చేశారు.

అంతర్జాతీయ టన్నెల్ అనుభవజ్ఞులను ప్రభుత్వం పిలిపించి కార్మికులను బయటకు తీసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. శిథిలాలను తొలగించే 25 టన్నుల బరువైన అమెరికన్‌ ఆగర్‌ యంత్రం నిలిపిన చోట పగుళ్లు ఏర్పడడంతో రెస్క్యూ ఆపరేషన్‌ను నిలిపివేశారు. పరిస్థితిని చక్కదిద్దిన తర్వాత డ్రిల్లింగ్‌ను తిరిగి ప్రారంభించనున్నట్లు తెలిసింది. కాగా.. రెస్క్యూ ఆపరేషన్‌లో మరో 3-4 అడ్డంకులు ఎదరవుతాయని, అయినా కూలీలను శుక్రవారం ఉదయం నాటికి బయటకు తీసుకొస్తామని ఎన్డీఆర్‌ఎఫ్‌ సభ్యుడు సయ్యద్‌ హస్నైన్‌ ధీమా వ్యక్తం చేశారు. కాగా, టన్నెల్‌లో కొంతభాగం ఈ నెల 12న కూలిపోగా 57 మీటర్ల మేర శిథిలాలు పేరుకుపోయాయి. ఆగర్‌ యంత్రంతో బుధవారం సాయంత్రం నాటికి 45 మీటర్ల వరకు శిథిలాలు తొలగించారు.

మిగిలిన 12 మీటర్ల డ్రిల్లింగ్‌ను అర్థరాత్రి పునఃప్రారంభించారు. పెద్ద ఇనుప దూలం అడ్డు పడడంతో ఆరు గంటల పాటు తవ్వకం నిలిపివేశారు. ఆగర్‌ యంత్రాన్ని రీ అలైన్‌ చేసి, ఎన్డీఆర్‌ఎఫ్‌, ఇతర సిబ్బంది ఇనుప దూలాన్ని కత్తిరించాక గురువారం శిథిలాల తొలగింపు మొదలుపెట్టారు. మధ్యాహ్నం వరకు మరో 1.8 మీటర్ల మేర తవ్వకం పూర్తయింది. ఇంకా 9 మీటర్ల వరకు ఉన్న శిథిలాలనే తొలగించాల్సి ఉంది. కేంద్ర మంత్రి జనరల్‌ వీకే సింగ్‌, ఉత్తరాఖండ్‌ సీఎం పుష్కర్‌సింగ్‌ ధామి పరిస్థితిని సమీక్షించారు. ‘‘మీకు అతి దగ్గరగా ఉన్నాం’’ అంటూ ధామి.. కూలీలతో పైప్‌ ద్వారా సంభాషించారు.

Updated Date - 2023-11-24T13:51:53+05:30 IST