Share News

Uttarakhand Tunnel: డ్రిల్లింగ్ పనులు పూర్తి..ఏ క్షణంలోనైనా కార్మికులు బయటకు..

ABN , First Publish Date - 2023-11-28T15:10:11+05:30 IST

పదిహేడు రోజుల నిరీక్షణకు మరి కొద్ది గంటల్లోనే తెరపడనుంది. ఉత్తరాఖండ్ లోని ఉత్తర్‌కాశి సిల్‌క్యారా సొరంగంలో చిక్కుకున్న 41 మంది ఏ క్షణంలోనే బయట పడే అవకాశాలున్నాయి. రెస్క్యూ బృందం చేపట్టిన మాన్యువల్ డ్రిల్లింగ్ పనులు మంగళవారం మధ్యాహ్నం పూర్తయ్యాయి.

Uttarakhand Tunnel: డ్రిల్లింగ్ పనులు పూర్తి..ఏ క్షణంలోనైనా కార్మికులు బయటకు..

ఉత్తర్‌కాశీ: పదిహేడు రోజుల నిరీక్షణకు మరి కొద్ది గంటల్లోనే తెరపడనుంది. ఉత్తరాఖండ్ (Uttarakhand)లోని ఉత్తర్‌కాశి (Uttarkashi) సిల్‌క్యారా సొరంగం(Silkyara tunnnel)లో చిక్కుకున్న 41 మంది ఏ క్షణంలోనే బయట పడే అవకాశాలున్నాయి. రెస్క్యూ బృందం చేపట్టిన మాన్యువల్ డ్రిల్లింగ్ పనులు మంగళవారం మధ్యాహ్నం పూర్తయ్యాయి. 60 మీటర్ల డ్రిల్లింగ్ మేర తవ్వకాలు జరపడంతో కార్మికులకు చేరువగా వెళ్లారు. అంతా సవ్యంగా జరిగితే సాయంత్ర కల్లా కార్మికులు బయటకు వచ్చే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు. అయితే, డ్రిల్లింగ్ పనులు పూర్తయిన విషయాన్ని ఎన్‌హెచ్ఐడీసీఎల్ మేనేజింగ్ డైరెక్టర్ మహమూద్ అహ్మద్ వెంటనే ధ్రువీకరించలేదు. డ్రిల్లింగ్ హోల్‌ ద్వారా ఎస్కేప్ పైపును పంపుతున్నట్టు చెప్పారు.


టన్నెల్ వద్దకు చేరుకున్న సీఎం

కాగా, ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి టన్నెల్ వద్దకు చేరుకున్నారు. డ్రిల్లింగ్ పనులు పూర్తయి సాయంత్రానికి కల్లా కార్మికులందరినీ సురక్షితంగా బయటకు తీసుకు వచ్చేందుకు తుది సన్నాహాలు జరుగుతుండంతో ఆ పనులను ఆయన స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. మరో వైపు కూలీల కుటుంబాలకు అధికారులు సమాచారం ఇచ్చారు. ఇప్పటికే సొరంగం నుంచి కూలీలను బయటకు తెచ్చేందుకు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది మాక్ డ్రిల్ నిర్వహించింది. కార్మికులను బయటకు తీసుకువచ్చేందుకు టన్నెల్ లోనికి అంబులెన్స్‌లు పంపుతున్నారు. అంబులెన్స్‌లతో పాటు దుప్పట్లు, స్ట్రెచర్లు లోపలకు పంపారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్‌డీఆర్ఎఫ్, ఇతర ఏజెన్సీలను సిద్ధంగా ఉంచారు. కార్మికులను బయటకు తీసుకువచ్చిన తర్వాత తక్షణ వైద్య చికిత్స అందించనున్నారు. సిల్‌క్యారాకు 30 కిలోమీటర్ల దూరంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ వద్ద 41 పడకలతో తాత్కాలిక వార్డును సిద్ధం చేసినట్టు అధికారులు చెప్పారు. అంబులెన్స్‌లు వెళ్లేందుకు వీలుగు రోడ్డు మార్గాన్ని మెరుగుపరిచారు. దుస్తులు, బ్యాగులతో సిద్ధంగా ఉండాలని కార్మికుల కుటుంబ సభ్యులకు అధికారులు సమాచారం ఇచ్చారు.

Updated Date - 2023-11-28T15:14:40+05:30 IST