Viral Video: ఖలిస్థాన్ మద్దతుదారులకు చెంపపెట్టు.. అగౌరవపరిచిన చోటే సగర్వంగా ఎగిరిన భారీ మువ్వన్నెల జెండా!
ABN , First Publish Date - 2023-03-20T11:20:30+05:30 IST
అవమానం ఎదురైన చోటే భారత త్రివర్ణ పతాకం(Indian National Flag) మళ్లీ రెపరెపలాడింది. లండన్‌లో భారత హై కమిషన్(Indian High Commission)
లండన్: అవమానం ఎదురైన చోటే భారత త్రివర్ణ పతాకం(Indian National Flag) మళ్లీ రెపరెపలాడింది. లండన్‌లో భారత హై కమిషన్(Indian High Commission) భవనంపై భారీ త్రివర్ణ పతాకం సగర్వంగా ఎగిరింది. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఖలిస్థాన్ సానుభూతి పరుడైన ‘వారిస్ పంజాబ్ దే’ నేత అమృత్‌పాల్ సింగ్(Amritpal singh) కోసం పంజాబ్ పోలీసులు(Punjab Police) అణువణువు గాలిస్తున్నారు. అమృత్‌పాల్ సింగ్ అనుచరులను పోలీసులు అరెస్ట్ చేయడంతో రెండు రోజులుగా పంజాబ్‌లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వారి అరెస్టును నిరసిస్తూ ఆయన మద్దతుదారులు చేస్తున్న ఆందోళనలు లండన్‌కూ పాకాయి.
ఈ నేపథ్యంలో లండన్‌లోని భారత రాయబార కార్యాలయం వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్న ఖలిస్థాన్ మద్దతుదారులు జెండాలతో ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో భారత జాతీయ జెండాను అగౌరవపరిచారు. హైకమిషన్ భవనంపై రెపరెపలాడుతున్న మువ్వన్నెల జెండాను కిందికి లాగేశారు. గమనించిన సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని జాతీయ జెండాను వారి నుంచి లాక్కున్నారు. ఖలిస్థాన్ జెండాను ఎగరవేసే ప్రయత్నాలను అడ్డుకున్నారు.
ఈ ఘటన జరిగి 24 గంటలు కూడా గడవకముందే భారత హైకమిషన్ ఖలిస్థాన్ మద్దతుదారులకు షాకిచ్చే నిర్ణయం తీసుకుంది. హైకమిషన్ భవనంపై భారీ త్రివర్ణ పతాకాన్ని ఏర్పాటు చేసింది. మరోవైపు, అమృత్‌పాల్‌ను పట్టుకునేందుకు పంజాబ్ పోలీసులు రెండు రోజులుగా పకడ్బందీగా గాలిస్తున్నా ఫలితం ఉండడం లేదు. అతడి కోసం అణువణువు జల్లెడపడుతున్నారు.