Women's Resevation Bill: బిల్లుకు మేము వ్యతిరేకం: ఒవైసీ

ABN , First Publish Date - 2023-09-19T17:29:10+05:30 IST

మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు ఉద్దేశించిన మహిళా రిజర్వేషన్ బిల్లును కేంద్రం లోక్‌సభలో మంగళవారంనాడు ప్రవేశపెట్టడంతో దీనిపై చర్చ కూడా మొదలైంది. ముస్లిం మహిళలకు రిజర్వేషన్ కల్పించని ఈ బిల్లును తాము వ్యతిరేకిస్తున్నట్టు ఎంఐంఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ చెప్పారు.

Women's Resevation Bill: బిల్లుకు మేము వ్యతిరేకం: ఒవైసీ

న్యూఢిల్లీ: మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు ఉద్దేశించిన మహిళా రిజర్వేషన్ బిల్లును (Women's Reservation bill) కేంద్రం లోక్‌సభలో మంగళవారంనాడు ప్రవేశపెట్టడంతో దీనిపై చర్చ కూడా మొదలైంది. 'నారీ శక్తి వందన్ అభియాన్' పేరుతో కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఈ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టారు. దీనిపై లోక్‌సభలో బుధవారం చర్చ జరుగుతుంది. 21న రాజ్యసభలో బిల్లును ప్రవేశపెడతారు. కాగా, ఈ బిల్లును ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi) వ్యతిరేకించారు. ముస్లిం మహిళలకు రిజర్వేషన్ కల్పించని ఈ బిల్లును తాము వ్యతిరేకిస్తున్నట్టు మీడియాకు తెలిపారు.


''ప్రాతినిధ్యం అనేది ఎవరికి కల్పించాలి? ప్రాతినిధ్యం అనేది లేనివారికే ప్రాతినిధ్యం కల్పించాలి. ముస్లిం మహిళలకు రిజర్వేషన్ కల్పించే అశం లేకపోవడమే ఈ బిల్లులో ప్రధాన లోపం. ఆ కారణంగా మేము (ఎంఐఎం) బిల్లును వ్యతిరేకిస్తున్నాం'' అని ఒవైసీ తెలిపారు.


2029లోనే మహిళా కోటా అమల్లోకి..

కేంద్ర ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లు అనేది రాజ్యాంగ బిల్లు కావడంతో ఉభయ సభల ఆమోదం పొందడానికి మూడింట రెండు వంతుల మెజారిటీ అవసరమవుతుంది. అయితే, ఉభయసభలు ఆమోదించిన తర్వాత కూడా చట్టరూపంలో కోటా ఆమలు కావాలంటే 2029లోనే సాధ్యమవుతుందని నిపుణులు చెబుతున్నారు. చట్ట ప్రకారం లోక్‌సభలో మూడింట ఒక వంతు మహిళలకు సీట్లు రిజర్వ్ చేస్తారు. ఎస్సీ, ఎస్సీ రిజర్వ్‌డ్‌ సీట్లలో కూడా మూడింట ఒక వంతు మహిళా రిజర్వేషన్ వర్తిస్తుంది. రాజ్యాంగంలోని 128వ సవరణ చేశాక 2027లో జనగణన ప్రారంభమవుతుందని, అనంతరం నియోజకవర్గాల పునర్విభజన జరిగి, అది పూర్తయ్యాకే 2029 నుంచి బిల్లు అమల్లోకి వస్తుందని చెబుతున్నారు.

Updated Date - 2023-09-19T17:29:10+05:30 IST