DK Shivkumar: అడ్వర్‌టైజ్‌మెంట్లు ఇచ్చామే కానీ ఓట్లు అడగలేదే.. ఈసీ నోటీసుపై డీకే..
ABN , First Publish Date - 2023-11-28T16:52:36+05:30 IST
అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమైన తెలంగాణలోని పలు వార్తాపత్రికల్లో సంక్షేమ పథకాలపై అడ్వర్‌టైజ్‌మెంట్లు ఇవ్వడంపై ఎన్నికల కమిషన్ ఇచ్చిన నోటీసుకు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మంగళవారంనాడు స్పందించారు. సంక్షేమ పథకాల ప్రస్తావనే చేశాము కానీ ఓట్లు వేయమని అడ్వర్‌టైజ్‌మెంట్లలో కోరలేదని ఆయన చెప్పారు.
బెంగళూరు: అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమైన తెలంగాణ (Telangana)లోని పలు వార్తాపత్రికల్లో సంక్షేమ పథకాలపై అడ్వర్‌టైజ్‌మెంట్లు (Advertisements) ఇవ్వడంపై ఎన్నికల కమిషన్ (Election commission) ఇచ్చిన నోటీసుకు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ (DK Shivakumar) మంగళవారంనాడు స్పందించారు. సంక్షేమ పథకాల ప్రస్తావనే చేశాము కానీ ఓట్లు వేయమని అడ్వర్‌టైజ్‌మెంట్లలో కోరలేదని ఆయన చెప్పారు. ఈసీ నోటీసు చట్టానికి అనుగుణంగా లేదన్నారు.
''రాజకీయంగా మేము ఓట్లు అడగలేదు. మా ప్రభుత్వం ఏదైతే చేసిందో అదే మేము చెప్పాం. ఇక్కడ కూడా తెలుగు మాట్లాడే ప్రజలు చాలా మంది ఉన్నారు. ఇతర భాషల వారు కూడా ఇక్కడ నివసిస్తున్నారు. మా ప్రభుత్వ హయాంలో జరిగిన పనుల గురించే మేము చెప్పామే కానీ ఓట్లు అడగలేదు'' అని డీకే శివకుమార్ తెలిపారు.
ఈసీ నోటీసు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన పనులు, సంక్షేమ పథకాలను హైలైట్ చేస్తూ ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లోని వార్తాపత్రికల్లో రాష్ట్రేతర ప్రభుత్వాలు యాడ్‌లు ఇవ్వడం తమ దృష్టికి వచ్చిందని, ఇది ఎన్నికల ప్రవర్తనా నియమావళి స్ఫూర్తిని ఉల్లంఘించడమేనని ఈసీఐ పేర్కొంది. నవంబర్ 24 నుంచి 27 వరకూ పలు వార్తాపత్రికల హైదరాబాద్ ఎడిషన్‌లో ప్రకటనలు వచ్చినట్టు తమ దృష్టికి వచ్చిందని తెలిపింది. దీనిపై వివరణ కోరుతూ కర్ణాటక ప్రభుత్వానికి నోటీసు ఇచ్చింది. నవంబర్ 29వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు వివరణ ఇవ్వాలని కోరింది. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించిన సమాచార ప్రసార శాఖ సెక్రటరీ ఇన్‌చార్జిపై ఎందుకు చర్చ తీసుకోరాదో చెప్పాలని ఆదేశించింది.