Share News

INDIA bloc meeting: ఇండియా కూటమి సమావేశానికి హాజరుపై మమత క్లారిటీ..

ABN , First Publish Date - 2023-12-06T20:18:07+05:30 IST

'ఇండియా' కూటమి సమావేశానికి దూరంగా ఉండబోతున్నారంటూ వదంతుల రావడంపై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బుధవారంనాడు క్లారిటీ ఇచ్చారు. అందరికీ అనుకూలమైన తేదీన కాంగ్రెస్ నిర్ణయిస్తే త్వరలోనే తామంతా కలుస్తామని చెప్పారు.

INDIA bloc meeting: ఇండియా కూటమి సమావేశానికి హాజరుపై మమత క్లారిటీ..

కోల్‌కతా: ఇండియా (INDIA) కూటమి సమావేశానికి హాజరయ్యే విషయంలో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ (Mamata Banerjee), బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ (Nitish Kumar) వివరణ ఇచ్చారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మూడు రాష్ట్రాల్లో బీజేపీ చేతులో కాంగ్రెస్ ఓటమి చవిచూసిన క్రమంలో ఖర్గే నివాసంలో ఇండియా కూటమి సభ్యుల సమావేశం బుధవారం ఏర్పాటు చేశారు. అయితే, పలువురు నాయకులు అందుబాటులో ఉండటం లేదనే కారణంగా డిసెంబర్ 17వ తేదీకి సమావేశం వాయిదా పడింది. దీనికిముందే, మమతా బెనర్జీ, నితీష్ 'ఇండియా' కూటమి సమావేశానికి దూరంగా ఉండబోతున్నారంటూ వదంతుల రావడంపై మమతా బెనర్జీ బుధవారంనాడు క్లారిటీ ఇచ్చారు. అందరికీ అనుకూలమైన తేదీన కాంగ్రెస్ నిర్ణయిస్తే త్వరలోనే తామంతా కలుస్తామని చెప్పారు.


''ముందుగా నాకు సమాచారం ఇవ్వలేదు. ఒకరోజు మందు రాహుల్ గాంధీ ఫోన్ చేసి సమావేశం గురించి చెప్పారు. అందరికీ అనువైన తేదీతో కాంగ్రెస్ ముందుకు వస్తే త్వరలోనే మేము కలుస్తాం'' అని మమతా బెనర్జీ నార్త్ బెంగాల్ పర్యటనకు బయలుదేరుతూ బుధవారంనాడు మీడియాతో చెప్పారు. తనతో పాటు ఇతర సీఎంలకు కనీసం వారం, పది రోజులకు ముందే సమాచారం తెలియజేస్తే అందరికీ అనువుగా ఉంటుందని అన్నారు. నార్త్ బెంగాల్‌లో తాను వారం రోజుల పాటు పర్యటిస్తున్నట్టు చెప్పారు.


జ్వరంగా ఉండటం వల్లే: నితీష్

ప్రతిపక్ష ఇండియా కూటమి మీటింగ్‌కు తాను హాజరుకావడం లేదంటూ వచ్చిన వదంతులను బీహార్ సీఎం నితీష్ కుమార్ తోసిపుచ్చారు. తాను జ్వరంతో బాధపడుతున్నందువ వల్ల ప్రతిపక్షాల సమావేశానికి హాజరు కాలేకపోయానని చెప్పారు. దీనిపై జాతీయ మీడియాలో వస్తున్న వార్తలు అర్ధం లేనివని, నాన్సెన్స్ అని కొట్టిపడేశారు. తదుపరి సమావేశం ఎప్పుడు జరిగినా వెళ్తానని తెలిపారు.

Updated Date - 2023-12-06T20:18:09+05:30 IST