North Korea : ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్‌కు ఏమైంది?
ABN , First Publish Date - 2023-02-07T13:52:56+05:30 IST
ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ (Kim Jong Un) ఆరోగ్యం మరింత క్షీణించిందా? అనే అనుమానాలు పెరుగుతున్నాయి.
న్యూఢిల్లీ : ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ (Kim Jong Un) ఆరోగ్యం మరింత క్షీణించిందా? అనే అనుమానాలు పెరుగుతున్నాయి. అత్యంత ముఖ్యమైన సైనిక కవాతులకు ముందు రోజుల్లో ఆయన కనిపించకపోవడంతో ఆయన పరిస్థితి విషమంగా ఉందేమోననే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రాజధాని నగరం ప్యాంగ్ యాంగ్‌లో ఈ వారంలో కొన్ని మాస్ పెరేడ్స్ నిర్వహించాలని ముందుగానే నిర్ణయించారు. కానీ ఈ పెరేడ్స్‌కు ఆయన హాజరవుతారో, లేదో తెలియడంలేదు. ఆయన దాదాపు ఓ నెల నుంచి బహిరంగంగా కనిపించడం లేదు.
అమెరికన్ మీడియా తెలిపిన వివరాల ప్రకారం, కిమ్ జోంగ్ ఉన్ ఆదివారం ఓ ముఖ్యమైన సమావేశానికి గైర్హాజరయ్యారు. గతంలో కూడా ఆయన కీలక సమావేశాల్లో పాల్గొనలేదు. సుదీర్ఘ కాలం ఆయన బహిరంగంగా కనిపించకపోవడంతో ఆయన ఆరోగ్యం గురించి ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
కొరియన్ పీపుల్స్ ఆర్మీ 75వ వ్యవస్థాపక దినోత్సవాల సందర్భంగా మంగళవారం లేదా బుధవారం మాస్ పెరేడ్స్ నిర్వహించవలసి ఉంది. గతంలో ఇటువంటి కవాతుల సందర్భంగా ఉత్తర కొరియా క్షిపణులు, అణ్వాయుధ సామర్థ్యాన్ని ప్రదర్శించేవారు.
ఇదిలావుండగా, దక్షిణ కొరియాతో కలిసి విన్యాసాలు నిర్వహించేందుకు అమెరికా ప్రయత్నిస్తుండటాన్ని ఉత్తర కొరియా వ్యతిరేకించింది. దీనిని దీటుగా ఎదుర్కొంటామని హెచ్చరించింది.
కిమ్ జోంగ్ ఉన్ 2014లో వరుసగా 40 రోజులపాటు బహిరంగంగా కనిపించలేదు.