Shiva Shakti: నేములోనేముంది?

ABN , First Publish Date - 2023-08-29T02:27:52+05:30 IST

చంద్రుడి మీద విక్రమ్‌ 3 ల్యాండర్‌(Vikram 3 lander) దిగిన చోటుకు ‘శివశక్తి పాయింట్‌’ ('Shiva Shakti Point')అని.. గతంలో చంద్రయాన్‌ 2 కూలిపోయిన ప్రదేశానికి ‘తిరంగా పాయింట్‌’ అని పేరు పెడుతున్నట్టు ప్రధాని మోదీ(PM MODI) ప్రకటించారు! గతంలో యూపీఏ హయాంలో ఇస్రో చేపట్టిన చంద్రయాన్‌-1(Chandrayaan-1) మిషన్‌లో భాగంగా ల్యాండర్‌ చంద్రుడి మీద క్రాష్‌ ల్యాండ్‌ అయిన చోటుకు అప్పటి సర్కారు ‘జవహర్‌ స్థల్‌’ ('Jawahar Sthal')అని పేరు పెట్టింది.

Shiva Shakti: నేములోనేముంది?

‘శివశక్తి’ పేరు పెట్టడంపై తీవ్ర విమర్శలు

చంద్రుడిపై పరిశోధనలు చేసే దేశాలు తమకు నచ్చిన పేరు ప్రతిపాదించవచ్చు

రాజకీయ, సైనిక, మతపరమైన పేర్లను వీలైనంతవరకూ ప్రతిపాదించకూడదు

కొన్ని ఉపగ్రహాలకు దేవుళ్ల పేర్లు

విక్రమ్‌ ల్యాండర్‌ దిగినచోటుకు ‘శివశక్తి’ అనే పేరు పెట్టడంపై తీవ్ర విమర్శలు

చందమామపై బిలాలు, ప్రాంతాల పేర్లను ఆమోదించే అధికారం మాత్రం ఐఏయుదే

చంద్రుడి మీద విక్రమ్‌ 3 ల్యాండర్‌(Vikram 3 lander) దిగిన చోటుకు ‘శివశక్తి పాయింట్‌’ ('Shiva Shakti Point')అని.. గతంలో చంద్రయాన్‌ 2 కూలిపోయిన ప్రదేశానికి ‘తిరంగా పాయింట్‌’ అని పేరు పెడుతున్నట్టు ప్రధాని మోదీ(PM MODI) ప్రకటించారు! గతంలో యూపీఏ హయాంలో ఇస్రో చేపట్టిన చంద్రయాన్‌-1(Chandrayaan-1) మిషన్‌లో భాగంగా ల్యాండర్‌ చంద్రుడి మీద క్రాష్‌ ల్యాండ్‌ అయిన చోటుకు అప్పటి సర్కారు ‘జవహర్‌ స్థల్‌’ ('Jawahar Sthal')అని పేరు పెట్టింది. బీజేపీ పెట్టిన పేర్లపై కాంగ్రెస్‌, ఇతర విపక్షాలు మండిపడుతుంటే.. ‘కాంగ్రెస్‌ పార్టీకి ‘(గాంధీ)కుటుంబమే ప్రధానం. అందుకే చంద్రుడి మీద కూడా జవహర్‌ నామ జపాన్ని వదల్లేదు’ అంటూ బీజేపీ ఎదురుదాడి మొదలుపెట్టింది. ఈ రాజకీయాల సంగతి పక్కన పెడితే.. అసలు చంద్రుడి మీద స్థలాలకు/ప్రాంతాలకు పేర్లు ఎలా పెడతారు? ఎవరు పెడతారు? అంటే దానికి సమాధానం ‘ద ఇంటర్నేషనల్‌ ఆస్ట్రనామికల్‌ యూనియన్‌ (ఐఏయూ)’. అంతర్జాతీయ ఒప్పందాల ప్రకారం.. చంద్రుడుగానీ, అంతరిక్షంలోని ఏ గ్రహ మూ, ఉపగ్రహంగానీ ఏ దేశానికీ సొంతం కాదు. అన్ని దేశాలకూ ఆయా గ్రహాలు, ఉపగ్రహాలపై పరిశోధనలు చేసే అవకాశం ఉంది. అయితే ఆ ప్రాంతాలకు అవి తమకు నచ్చిన పేర్లు పెట్టుకుంటే.. ఆ పేర్లు మరొక దేశానికి అభ్యంతరకరంగా అనిపించవచ్చు. అందుకే ఈ విషయంలో ఒక పద్ధతి పాటించడానికి 1919లో ఐఏయూను ఏర్పాటు చేసుకున్నారు. అందులో భారతదేశం సహా 92 సభ్యదేశాలున్నాయి.

ఐఏయూ కన్నా ముందు..

ఐఏయూ అంటే ఓ వందేళ్ల క్రితం ఏర్పాటు చేసుకున్న సంస్థ. కానీ.. విశ్వాంతరాళాలను దుర్భిణి వేసి మరీ గాలించిన మహనీయుడు గెలీలియో 1610లోనే చంద్రుడిపై పర్వతాలు, బిలాలను గుర్తించాడు. కానీ, ఆయన వాటికి పేర్లు పెట్టలేదు. 1647లో మైకేల్‌ వాన్‌ లాంగ్రెన్‌ అనే శాస్త్రవేత్త చందమామ తొలి మ్యాప్‌ను రూపొందించాడు. చంద్రుడిపై బిలాలకు ఆయన ఆనాడు పెట్టిన పేర్లలో మూడు మాత్రమే ఇప్పటికీ కొనసాగుతున్నాయి. చందమామపై సముద్రాలు లేకున్నా.. చంద్రుడిపై ఉండే పలు ప్రాంతాలను సీ ఆఫ్‌ ట్రాంక్విలిటీ, సీ ఆఫ్‌ క్లౌడ్స్‌.. తదితర పేర్లతో పిలుస్తున్నాం కదా.. దానికి కారణం ఈయనే. అయితే, 1651లో.. గ్రిమాల్డి, రిక్కియోలి అనే ఇద్దరు ఆస్ట్రానమర్లు వేసిన పునాదుల మీదే ఇప్పుడు గ్రహాలకు పేర్లు పెట్టే ప్రక్రియ కొనసాగుతోంది. చంద్రుడిపై 210 బిలాలకు రిక్కియోలి పెట్టిన పేర్లనే ఇప్పటికీ వాడుతున్నాం.


సులభంగా ఉండాలి..

ఖగోళ వస్తువులకు నామకరణం చేయడానికి సంబంధించి ఐఏయూ కొన్ని సూచనలు చేసింది. వాటిలో ప్రధానమైనది.. పెట్టే పేరు చాలా సులభంగా, స్పష్టంగా ఎలాంటి గందరగోళానికీ తావిచ్చేవిధంగా ఉండకూడదు. ఇప్పటికే ఉన్న పేర్లను పెట్టకూడదు. ఖగోళ శాస్త్రానికి సేవలందించిన శాస్త్రజ్ఞులు, అన్వేషకుల పేర్లకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. రాజకీయ, సైనిక, మత ప్రాముఖ్యం ఉన్న పేర్లను వీలైనంతవరకూ ఉపయోగించకూడదు

ఆమోదం ఇలా..

ఐఏయూ వెబ్‌సైట్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం.. ఏదైనా గ్రహం, ఉపగ్రహంపై ప్రాంతాలకు పేర్లు పెట్టే ప్రక్రియలో ఐఏయూలోని ‘వర్కింగ్‌ గ్రూపులు’ కీలకపాత్ర పోషిస్తాయి. ఏదైనా గ్రహం/ఉపగ్రహానికి సంబంధించిన పేర్లపై ప్రతిపాదనలను తొలుత టాస్క్‌ గ్రూపులు పరిశీలిస్తాయి. వచ్చిన పేర్లన్నింటినీ పరిశీలించిన టాస్క్‌గ్రూప్‌ చైర్‌పర్సన్‌.. తమ నిర్ణయాన్ని ‘వర్కింగ్‌ గ్రూప్‌ ఫర్‌ ప్లానెటరీ సిస్టమ్‌ నోమెన్‌క్లేచర్‌ (గ్రహ వ్యవస్థలకు నామకరణం చేసే కార్యనిర్వాహక బృందం-డబ్ల్యూజీపీఎ్‌సఎన్‌)’కు సిఫారసు చేస్తారు. ఆ బృందంలోని సభ్యులు వాటిని పరిశీలించి.. ఎక్కువ ఓట్లు వచ్చిన పేరును అధికారికంగా ప్రకటిస్తారు. వెంటనే ఆ పేరును ‘గెజటీర్‌ ఆఫ్‌ ప్లానెటరీ నోమెన్‌క్లేచర్‌’లో చేరుస్తారు. వెబ్‌సైట్‌లో పబ్లిష్‌ చేస్తారు. ఆ పేరుపై సభ్యదేశాలకు ఏవైనా అభ్యంతరాలు ఉంటే మూడునెలల్లోగా ఆ అభ్యంతరాలను ఐఏయూ జనరల్‌ సెక్రటరీకి తెలియజేయాల్సి ఉంటుంది. వాటిని ఐఏయూ పరిశీలించి తుది నిర్ణయం తీసుకుంటుంది.

చంద్రుడిపై సారాభాయ్‌ బిలం

ఇస్రో మూలస్తంభం, భారత అంతరిక్ష కార్యక్రమానికి పితామహుడిగా భావించే విక్రమ్‌ సారాభాయ్‌ జ్ఞాపకార్థం.. చంద్రుడిపై ఒక బిలానికి ఆయన పేరు పెట్టిన విషయం చాలామంది భారతీయులకు తెలియదు. చందమామ ఈశాన్యభాగంలో మేర్‌ సెరెనిటాటిస్‌ ప్రాంతంలో ఉండే గుండ్రటి బిలానికి గతంలో బెస్సెల్‌ ఏ అనే పేరుండేది. 1973లో ఐఏయూ దానికి ‘సారాభాయ్‌ బిలం’గా నామకరణం చేసింది. దీని వ్యాసం 8 కిలోమీటర్లు. లోతు దాదాపు 1.7 కిలోమీటర్లు. ఈ సారాభాయ్‌ బిలానికి కేవలం 250-300 కిలోమీటర్ల దూరంలోనే 1972లో అపోలో 17 వ్యోమనౌక, 1973లో లూనా 21 మిషన్లు ల్యాండయ్యాయి.

దేవుడి పేర్లకూ ఓకే

సౌరవ్యవస్థలో గురు గ్రహానికి, శనిగ్రహానికి ఉన్న ఉపగ్రహాలకు గ్రీకు-రోమన్‌ పురాణాల్లోని దేవుళ్ల పేర్లు పెట్టిన సంగతి తెలిసిందే. ఆకాశ దేవుడిగా, మెరుపుల దేవుడిగా గ్రీకులు ఆరాధించే జియ్‌సకు ఇష్టులు, సన్నిహితుల పేర్లను వాటికి పెట్టారు. ‘మేక్‌మేక్‌’ అనే డ్వార్ఫ్‌ ప్లానెట్‌కు.. ఈస్టర్‌ ద్వీపానికి చెందిన రాపా నుయి పురాణాల్లో సృష్టికర్తగా పేర్కొన్న ‘మేక్‌మేక్‌’ అనే దేవుడి పేరు ఐఏయూ పెట్టింది.

‘జవహర్‌స్థల్‌’ పేరు అలా..

2008లో చంద్రయాన్‌-1 సఫలమై.. నవంబరు 14న ల్యాండర్‌ చంద్రుడిపై నిర్దేశిత స్థలంలో క్రాష్‌ ల్యాండ్‌ అయ్యింది. మనదేశం చంద్రుణ్ని అందుకోగలిగిందనడానికి గుర్తుగా ఆ స్థలానికి నెహ్రూ పేరు పెడదామని.. నాటి రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం ప్రతిపాదించినట్టు నాటి ఇస్రో చైర్మన్‌ మాధవన్‌ నాయర్‌ ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. నెహ్రూ పేరే ఎందుకంటే.. దేశంలో శాస్త్రీయ అభివృద్ధికి దారులు వేసిన నెహ్రూజన్మదినమైన నవంబరు 14న ల్యాండర్‌ క్రాష్‌ల్యాండ్‌ అయ్యింది కాబట్టి ఆయన పేరు పెడితే బాగుంటుందన్నది కలాం ఉద్దేశంగా తెలిపారు.

(సెంట్రల్‌ డెస్క్‌)

Updated Date - 2023-08-29T04:49:46+05:30 IST