Mimicry Row: రాహుల్ తప్పేముంది?.. సమర్ధించిన కపిల్ సిబల్
ABN , Publish Date - Dec 25 , 2023 | 04:06 PM
పార్లమెంటు సమావేశాల్లో రికార్డు స్థాయిలో ఎంపీలపై సస్పెన్షన్ వేటుపడటం, ఇందుకు నిరసనగా ఉపరాష్ట్రపతి, లోక్‌సభ చైర్మన్ జగ్దీప్ ధన్‌ఖఢ్‌ను అనుకరిస్తూ టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీ మిమిక్రీ చేయడం, దానిని రాహుల్ గాంధీ వీడియో తీయడంపై చెలరేగిన దుమారం ఇంకా సద్దుమణగలేదు. గా, రాహుల్ చర్యను కాంగ్రెస్ మాజీ నేత, రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ సోమవారంనాడు సమర్ధించారు. ''అందులో తప్పేముంది?'' అని ఆయన వ్యాఖ్యానించారు.
న్యూఢిల్లీ: పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో రికార్డు స్థాయిలో ఎంపీలపై సస్పెన్షన్ వేటుపడటం, ఇందుకు నిరసనగా ఉపరాష్ట్రపతి, లోక్‌సభ చైర్మన్ జగ్దీప్ ధన్‌ఖఢ్‌ను అనుకరిస్తూ టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీ మిమిక్రీ చేయడం, దానిని రాహుల్ గాంధీ వీడియో తీయడంపై చెలరేగిన దుమారం ఇంకా సద్దుమణగలేదు. రాహుల్ వీడియో తీయడాన్ని జగ్దీప్ ధన్‌ఖడ్ తప్పుపట్టడం కూడా చర్చనీయాంశమైంది. కాగా, రాహుల్ చర్యను కాంగ్రెస్ మాజీ నేత, రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ (Kapil Sibla) సోమవారంనాడు సమర్ధించారు. ''అందులో తప్పేముంది?'' అని ఆయన వ్యాఖ్యానించారు. ఆ వీడియోను ఆ తర్వాత కూడా ఆయన ఎంతమాత్రం ఉపయోగించుకోలేదని చెప్పారు. మిమికింగ్ చేసిన వాళ్లే దీని గురించి ఆలోచించాలని పరోక్షంగా బెనర్జీని ప్రస్తవిస్తూ ఆయన వ్యాఖ్యానించారు.
పార్లమెంటు వెలుపల జరిగిన మిమిక్రీపై జగ్దీప్ ధన్‌ఖడ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఉపరాష్ట్రపతిగా తన స్థానాన్ని విపక్ష సభ్యులు అవమానించారని, ఇది రైతు కుటుంబం, జాట్ కులాన్నించి వచ్చిన తన నేపథ్యాన్ని వెక్కిరించడమేనని వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా తప్పుపట్టింది. జగ్దీప్ ధన్‌ఖడ్ కుల ప్రస్తావన ఎందుకు చేయాల్సి వచ్చిందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నిలదీశారు. తాను కూడా ఒక కులానికి చెందిన వాడిని కావడంతో పార్లమెంటులో మాట్లాడేందుకు అనేక సార్లు అనుమతించలేదని, అయితే ఆ విషయం తానెప్పుడూ మాట్లాడలేదని అన్నారు. మరోవైపు, మిమిక్రీ అనేది ఒక కళ అని, తాను వందలాది సార్లు మిమిక్రీ చేశానని, అది తన ప్రాథమిక హక్కు అని, ఇకముందు కూడా మిమిక్రీ చేస్తానని కల్యాణ్ బెనర్జీ గత శనివారంనాడు కోల్‌కతాలో మాట్లాడుతూ చెప్పారు.