BRICS : దక్షిణాఫ్రికాలో జీ జిన్‌పింగ్‌తో మోదీ ఏం మాట్లాడారో?

ABN , First Publish Date - 2023-08-24T15:01:47+05:30 IST

బ్రిక్స్ సదస్సు సందర్భంగా దక్షిణాఫ్రికాలోని జొహన్నెస్‌బర్గ్‌లో చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కలిశారు. మీడియా సమావేశంలో పాల్గొనడానికి వెళ్తూ, జిన్‌పింగ్‌తో మోదీ ఏదో మాట్లాడారు.

BRICS : దక్షిణాఫ్రికాలో జీ జిన్‌పింగ్‌తో మోదీ ఏం మాట్లాడారో?
Xi Jinping, Narendra Modi

జొహన్నెస్‌బర్గ్ : బ్రిక్స్ సదస్సు సందర్భంగా దక్షిణాఫ్రికాలోని జొహన్నెస్‌బర్గ్‌లో చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కలిశారు. మీడియా సమావేశంలో పాల్గొనడానికి వెళ్తూ, జిన్‌పింగ్‌తో మోదీ ఏదో మాట్లాడారు. భారత్-చైనా మధ్య తూర్పు లడఖ్‌లో ప్రతిష్టంభన ఏర్పడిన నేపథ్యంలో వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణపై ఆసక్తి రేగుతోంది.

బ్రెజిల్, రష్యా, చైనా, భారత దేశం, దక్షిణాఫ్రికా దేశాల కూటమి బ్రిక్స్ సమావేశాలు జొహెన్నెస్‌బర్గ్‌లో జరిగాయి. ఈ సందర్భంగా ఈ దేశాల నేతలంతా గురువారం మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఎవరికి కేటాయించిన ఆసనాల్లో వారు కూర్చొనడానికి వెళ్తున్నపుడు జీ, మోదీ తారసపడ్డారు. ఆయనతో మోదీ ఏదో చెప్తూ చకచకా ముందుకు వెళ్లి, తనకు కేటాయించిన స్థానంలో కూర్చున్నారు.

దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసా గురువారం విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ, ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, అర్జంటైనా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియాలను బ్రిక్స్‌లోకి ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి ఈ దేశాల సభ్యత్వం అమల్లోకి వస్తుందన్నారు. బ్రిక్స్ తొలి దశ విస్తరణ ప్రక్రియపై తామంతా ఏకాభిప్రాయం వ్యక్తం చేశామని చెప్పారు. ఈ ఆరు దేశాలకు బ్రిక్స్‌లో సంపూర్ణ సభ్యత్వం లభిస్తుందన్నారు.


ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ, ఈ ఆరు దేశాలను బ్రిక్స్‌లోకి స్వాగతించారు. ఈ దేశాల నేతలను, ప్రజలను అభినందించారు. ఈ దేశాలతో భారత దేశానికి చారిత్రక అనుబంధం ఉందన్నారు. సహకారం, సౌభాగ్యం, అభివృద్ధి కోసం కలిసికట్టుగా కృషి చేద్దామని పిలుపునిచ్చారు. ఈ కూటమిలో చేరేందుకు ఆసక్తి చూపించే ఇతర దేశాలను కూడా కలుపుకోవడానికి అన్ని దేశాలతో కలిసి కృషి చేస్తామని తెలిపారు.

2020 ఏప్రిల్-మే నెలల నుంచి తూర్పు లడఖ్‌లో చైనా దుందుడుకు చర్యలకు పాల్పడుతోంది. చైనా సైన్యాన్ని నిలువరించడానికి భారత దేశం కూడా తన సైన్యాన్ని మోహరించింది. ఇరు దేశాల సైనిక కమాండర్ల స్థాయి చర్చలతో కొన్ని చోట్ల నుంచి తమ తమ సైన్యాలను ఉపసంహరించుకున్నాయి. ఇంకా కొన్ని చోట్ల సమస్య అపరిష్కృతంగానే ఉంది.

కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో బ్రిక్స్ నేతలు వ్యక్తిగతంగా హాజరైన తొలి సమావేశం ఇదే. ఈ నెల 22న ప్రారంభమైన ఈ సమావేశాలు గురువారంతో ముగిశాయి.


ఇవి కూడా చదవండి :

Chandrayaan-3 : మధ్య తరగతి ప్రజల్లో ఆశలు రేపుతున్న చంద్రయాన్-3 విజయం

Russia : పుతిన్‌పై తిరుగుబాటు చేసిన వాగ్నర్ చీఫ్ ఓ చిల్లర దొంగ!

Updated Date - 2023-08-24T15:01:47+05:30 IST