Share News

Telangana results: తెలంగాణ కాంగ్రెస్ విజయం వెనుక వ్యూహకర్త ఆయనే..

ABN , First Publish Date - 2023-12-03T17:16:40+05:30 IST

తెలంగాణ ఇచ్చామన్న నినాదంతో ప్రజల్లోకి వెళ్లిన కాంగ్రెస్ చేతిలో బీఆర్ఎస్ ఊహించని ఓటమి చవిచూసింది. 2014లో పార్టీగా ఆవిర్భవించిన తర్వాత ఎన్నికల్లో బీఆర్ఎస్ తొలిసారి ఓటమిని చవిచూసింది. తెరముందు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి సారథ్యం వహించగా, తెరవెనుక వ్యూహరచన సాగించిన క్రెడిట్.. ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలుకు దక్కుతుంది.

Telangana results: తెలంగాణ కాంగ్రెస్ విజయం వెనుక వ్యూహకర్త ఆయనే..

హైదరాబాద్: తెలంగాణ ఇచ్చామన్న నినాదంతో ప్రజల్లోకి వెళ్లిన కాంగ్రెస్ (Congress) చేతిలో బీఆర్ఎస్ (BRS) ఊహించని ఓటమి చవిచూసింది. 2014లో పార్టీగా ఆవిర్భవించిన తర్వాత ఎన్నికల్లో బీఆర్ఎస్ (BRS) తొలిసారి ఓటమిని చవిచూసింది. తెరముందు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి సారథ్యం వహించి నాయకులందరినీ ఏకతాటిపై నడిపించి గెలుపును సుసాధ్యం చేయగా, తెరవెనుక వ్యూహరచన సాగించిన క్రెడిట్.. ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు (Sunil Kanugolu)కు దక్కుతుంది.


ఎవరీ సునీల్ కనుగోలు..?

కర్ణాటకకు చెందిన సునీల్ కనుగోలు 2023లో జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని చిత్తుగా ఓడించి కాంగ్రెస్ పార్టీకి ఘన విజయం సాధించిపెట్టారు. దీంతో ఆయన పేరు ఒక్కసారిగా ప్రముఖంగా వార్తల్లోకి వచ్చింది. అంతర్గత సర్వేలు జరపడం, వ్యూహరచన చేయడంలో దిట్టగా పేరు తెచ్చుకున్న ఆయనకు తెలంగాణ కాంగ్రెస్ వ్యూహకర్తగా పార్టీ కీలక బాధ్యతలు అప్పగించింది. అయితే, రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లలో ఆయనకు తగినంత స్వేచ్ఛ ఇవ్వలేదు. అక్కడ అశోక్ గెహ్లాట్, కమల్‌నాథ్ వంటి నేతలు ప్రధానంగా తమ సొంత వ్యూహాలతోనే ముందుకు వెళ్లారు.


కాగా, రెండు నెలల క్రితం సునీల్ కొనుగోలుతో సమావేశానికి హైదరాబాద్‌కు రావాల్సిందిగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆహ్వానించారు. పార్టీ ఎన్నికల వ్యూహరచన చేయాలని కేసీఆర్ కోరినప్పటికీ ఆయన సున్నితంగానే ఈ ప్రతిపాదనను నిరాకరించారు. కాంగ్రెస్ పార్టీ తరఫున వ్యూహరచన చేశారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీకి అడ్వయిజర్‌గా కూడా ఉన్న సునీల్ కనుగోలు ఇటీవల భారత్ జోడో యాత్ర విజయవంతానికి కీలక వ్యూహరచన చేశారు. కాంగ్రెస్ పార్టీతో పనిచేయడానికి ముందు ఆయన అన్నాడీఎంకే, బీజేపీ, డీఎంకేతో కూడా పనిచేశారు. 2024 టాస్క్ ఫోర్స్ సభ్యుడిగా ఉండాలని ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌కు కాంగ్రెస్ పార్టీ గతంలో ఆఫర్ ఇచ్చినప్పటికీ ఆయన నిరాకరించడంతో సునీల్ కనుగోలును కాంగ్రెస్ తమ టాస్క్‌ఫోర్స్ టీమ్‌లోకి తెచ్చుకుంది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ తరఫున ప్రశాంత్ కుమార్ వ్యూహరచన చేసిన టీమ్‌లో సునీల్ కనుగోలు ఉన్నారు. ఆ ఎన్నికల్లోనే బీజేపీ ఘనవిజయం సాధించి ప్రధాన మంత్రిగా నరేంద్ర మోదీ పగ్గాలు చేపట్టారు.

Updated Date - 2023-12-03T17:16:46+05:30 IST