Air india: ఎయిరిండియాకు వరుస చిక్కులు..ఈసారి ఏం జరిగిందంటే..?
ABN , First Publish Date - 2023-04-30T18:33:50+05:30 IST
ఎయిరిండియా మరోసారి చిక్కుల్లో పడింది. విమానం కాక్‌పిట్ లోకి ఒక పైలట్ తన గాళ్‌ఫ్రెండ్‌ను..
న్యూఢిల్లీ: ఎయిరిండియా (Air India) మరోసారి చిక్కుల్లో పడింది. విమానం కాక్‌పిట్ (Cockpit) లోకి ఒక పైలట్ తన గాళ్‌ఫ్రెండ్‌ను (Female Friend) అనుమతించిన ఘటనను రిపోర్డ్ చేయడంపై విఫలమైందంటూ ఎయిరిండియా సీఈవో క్యాంప్‌బెల్ విల్సన్ (Campbell Wilson), ఫ్లైట్ సేఫ్టీ హెడ్ హెన్రీ డోనోహో (Henry Donohoe)కు ఏవియేషన్ రెగ్యులేటర్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) నోటీసులు ఇచ్చింది. దుబాయ్-ఢిల్లీ ఫ్లయిట్లో పైలట్ తన గాళ్‌ఫ్రెండ్‌ను అనుమతించిన ఈ ఘటన ఫిబ్రవరి 27న జరిగింది. ఈ ఘటనపై విమానం క్యాబిన్ సిబ్బంది ఒకరు డీజీసీఏకు ఫిర్యాదు చేశారు.
ఈ ఘటనపై సకాలంలో ఫిర్యాదు చేయకపోవడం డీజీసీఏ భద్రతా ఆదేశాల ఉల్లంఘన కిందకు వస్తుందంటూ ఏప్రిల్ 21న ఎయిరిండియా సీఈఓ, ఫ్లైట్ సేఫ్టీ హెడ్‌కు నోటీసులు పంపినట్టు డీజీసీఐ సీనియర్ అధికారి ఒకరు ఆదివారంనాడు తెలిపారు. ఘటనపై విచారణలో కూడా జాప్యం చోటుచేసుకుందని ఆయన చెప్పారు. 15 రోజుల్లోగా షోకాష్ నోటీసుకు సమాధానం ఇవ్వాలని కూడా ఇద్దరు అధికారులను డీజీసీఏ ఆదేశించినట్టు తెలిపారు.
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఫిబ్రవరి 27న ఈ ఘటన చోటుచేసుకుంది. మార్చి 3న క్యాంప్‌బెల్ డోనోహోలకు కాన్ఫిడెన్షియల్ మెయిల్లో ఈ విషయం తెలిసింది. ఏప్రిల్ 21న డీజీసీఏ తొలి ఎంక్వయిరీ జరిగింది. ఆ తర్వాత ఎయిరిండియా మాత్రం ఎలాంటి దర్యాప్తు చేపట్టలేదు. కాగా, ఎయిరిండియా అంతర్జాతీయ విమానాల్లో ఇటీవల రెండుసార్లు చేటుచేసుకున్న మూత్ర విసర్జన (Peeing) ఘటనలపై ఎయిరిండియాకు రూ.30 లక్షలు, రూ.10 లక్షల చొప్పున జరిమానా పడింది.