Omar Abdullah: రష్యాకు ఒక చట్టం, ఇజ్రాయెల్‌కు ఇంకో చట్టమా?
ABN , First Publish Date - 2023-10-24T18:41:49+05:30 IST
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం భీకరరూపం దాల్చడంపై జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా స్పందించారు. రష్యాకు ఒక చట్టం, ఇజ్రాయెల్‌కు ఒక చట్టమా అని ప్రశ్నించారు.
శ్రీనగర్: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం (Israel-hamas War) భీకరరూపం దాల్చడంపై జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా (Omar Abdullah) స్పందించారు. రష్యాకు ఒక చట్టం, ఇజ్రాయెల్‌కు ఒక చట్టమా అని ప్రశ్నించారు. గాజాపై బాంబుల వర్షం కురిపిస్తుండటం వల్ల వందలాది మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
''యుద్ధం మొదలైన మొదటిరోజు నుంచి గాజాలో జరుగుతున్న దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. గాజాపై బాంబుల వర్షం కురిపిస్తుండటం వల్ల అమాయక ప్రజల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నారు. రష్యా, ఇజ్రాయెల్ విషయంలో భిన్నమైన చట్టాలున్నాయని ప్రపంచం చూటుకుంటోంది'' అంటూ అంతర్జాతీయ ప్రపంచంపై ఒమర్ అబ్దుల్లా విమర్శలు గుప్పించారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడి వార్ క్రైమ్ అని చెప్పిన ప్రపంచదేశాలు, ఇజ్రాయెల్ అదే పని గాజాపై చేస్తే తప్పనిపించడం లేదా? అని నిలదీశారు. అయితే ఆ రెండూ (యుద్ధాలు) సరైనవి కావని, ఏది కరెక్టో ప్రపంచదేశాలే ఇప్పుడు నిర్ణయించుకోవాలని అన్నారు. అక్టోబర్ 7వ తేదీ నుంచి గాజాపై జరుగుతున్న దాడుల్లో ఇంతవరకూ 5,087 మంది పాలస్తీనియన్లు మరణించారు. జమ్మూకశ్మీర్‌లోని నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ సహా దాదాపు అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు ఈ దాడులను ఖండిస్తూ, శాంతి నెలకొనాలని పిలుపునిచ్చాయి.