MeToo Protest : కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్‌పై ఒలింపియన్ వినేష్ ఫోగట్ ఆరోపణలు

ABN , First Publish Date - 2023-05-03T11:33:56+05:30 IST

శక్తిమంతుడైన వ్యక్తికి వ్యతిరేకంగా నిలబడటం చాలా కష్టమని ఒలింపియన్ రెజ్లర్ వినేష్ ఫోగట్ ఆవేదన వ్యక్తం చేశారు

MeToo Protest : కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్‌పై ఒలింపియన్ వినేష్ ఫోగట్ ఆరోపణలు
Vinesh Phogat, Anurag Thakur

న్యూఢిల్లీ : శక్తిమంతుడైన వ్యక్తికి వ్యతిరేకంగా నిలబడటం చాలా కష్టమని ఒలింపియన్ రెజ్లర్ వినేష్ ఫోగట్ (Vinesh Phogat) ఆవేదన వ్యక్తం చేశారు. భారత రెజ్లింగ్ ఫెడరేషన్ చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని, ఆయనను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ రెజ్లర్లు న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వినేష్ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ, కేంద్ర క్రీడల శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్‌ (Anurag Thakur)పై కూడా ఆరోపణలు చేశారు.

వినేష్ మీడియాతో మాట్లాడుతూ, శక్తిమంతుడైన వ్యక్తి అధికారాన్ని సుదీర్ఘ కాలం దుర్వినియోగం చేస్తున్నపుడు, ఆ వ్యక్తికి వ్యతిరేకంగా నిలబడటం చాలా కష్టమని చెప్పారు. మూడు, నాలుగు నెలల క్రితం తాము ఓ అధికారిని కలిసి, మహిళా అథ్లెట్లు ఏ విధంగా లైంగిక వేధింపులకు గురవుతున్నారో వివరించామని చెప్పారు. తాము అన్ని వివరాలను చెప్పినప్పటికీ, ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. అందుకే తాము ధర్నా చేస్తున్నామన్నారు. కేంద్ర క్రీడల శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ కూడా ఎటువంటి చర్య తీసుకోలేదని, కమిటీని ఏర్పాటు చేయడం ద్వారా వివాదాన్ని అణచివేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.

‘‘లైంగిక వేధింపుల గురించి అథ్లెట్లు అందరూ కేంద్ర క్రీడల శాఖ మంత్రి (అనురాగ్ ఠాకూర్)కు వివరించిన తర్వాత మా నిరసనను ముగించాం. ఆయన ఓ కమిటీని ఏర్పాటు చేయడం ద్వారా ఈ విషయాన్ని అణచివేసేందుకు ప్రయత్నించారు. ఆయన అప్పట్లో ఎటువంటి చర్య తీసుకోలేదు’’ అని వినేష్ చెప్పారు.

రెజ్లర్ బజ్రంగ్ పూనియా మాట్లాడుతూ, ఒలింపిక్స్ కోసం రూపొందించిన నిబంధనలకు వ్యతిరేకంగా తాము నిరసన తెలుపుతున్నట్లు బ్రిజ్ భూషణ్ చెప్తున్నారన్నారు. తాము నిరసన తెలుపుతున్నది ఒలింపిక్స్ కోసం కాదన్నారు. లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా తాము నిరసన తెలుపుతున్నామని చెప్పారు.

బ్రిజ్ భూషణ్ శనివారం మాట్లాడుతూ, తాను తన పదవికి రాజీనామా చేస్తే, రెజ్లర్లు చేస్తున్న ఆరోపణలను ఆమోదించినట్లవుతుందన్నారు. హర్యానాలోని 90 శాతం మంది క్రీడాకారులు తనకు మద్దతుగా నిలిచారన్నారు, కేవలం ఒక రెజ్లింగ్ ఫ్యామిలీ మాత్రమే జంతర్ మంతర్ వద్ద నిరసన తెలుపుతోందన్నారు. దీనిపై వినేష్ స్పందిస్తూ, తమకు కావలసినదల్లా న్యాయమేనని చెప్పారు.

ఇదిలావుండగా, ఢిల్లీ పోలీసులు శుక్రవారం బ్రిజ్ భూషణ్‌పై రెండు కేసులు నమోదు చేశారు. లైంగిక వేధింపులు, క్రీడాకారిణులను అక్రమంగా దోచుకోవడం వంటి నేరాలకు ఆయన పాల్పడినట్లు ఆరోపించారు.

ఇవి కూడా చదవండి :

SIT : ఏపీ ప్రభుత్వ ‘సిట్‌’పై సుప్రీంకోర్టులో కీలక తీర్పు

Electricity bill: మీ కరెంటు బిల్లు రూ.1000 దాటుతోందా.. ఇకపై మీరు ఏ విధంగా చెల్లించాలంటే..

Updated Date - 2023-05-03T11:49:20+05:30 IST