Centre Ordinance: కేజ్రీవాల్‌కు మద్దతు ప్రకటించిన సీతారాం ఏచూరి

ABN , First Publish Date - 2023-05-30T16:16:25+05:30 IST

ఢిల్లీపై కేంద్రం ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చేస్తున్న పోరాటానికి సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మద్దతు ప్రకటించారు. ఢిల్లీలో అడ్మినిస్ట్రేటివ్ సర్వీసులను తమ అధీనంలో ఉండేలా కేంద్రం తీసుకువచ్చిన ఆర్డినెన్స్‌ను సీతారాం ఏచూరి ఖండించారు. ఆర్డినెన్స్ స్థానే బిల్లును పార్లమెంటులో ప్రవేశపెడితే ఆప్‌కు తమ పార్టీ మద్దతిస్తుందని ఆయన ప్రకటించారు.

Centre Ordinance: కేజ్రీవాల్‌కు మద్దతు ప్రకటించిన సీతారాం ఏచూరి

న్యూఢిల్లీ: ఢిల్లీపై కేంద్రం ఆర్డినెన్స్‌కు(Center ordinance on Delhli) వ్యతిరేకంగా ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) చేస్తున్న పోరాటానికి సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరి (Sitaram Yechury) మద్దతు ప్రకటించారు. ఢిల్లీలో అడ్మినిస్ట్రేటివ్ సర్వీసులను తమ అధీనంలో ఉండేలా కేంద్రం తీసుకువచ్చిన ఆర్డినెన్స్‌ను సీతారాం ఏచూరి ఖండించారు. ఆర్డినెన్స్ స్థానే బిల్లును పార్లమెంటులో ప్రవేశపెడితే ఆప్‌కు తమ పార్టీ మద్దతిస్తుందని ఆయన ప్రకటించారు. ఈ విషయంలో కాంగ్రెస్, ఇతర విపక్ష పార్టీలు ఆప్‌కు మద్దతు ఇవ్వాలని ఏచూరి విజ్ఞప్తి చేశారు. కేంద్రం తీసుకువచ్చిన ఆర్డినెన్స్ పూర్తిగా రాజ్యాంగ ఉల్లంఘన కిందకే వస్తుందని అన్నారు. ఇదే పరిస్థితి బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న చోట్ల కూడా తలెత్తవచ్చని హెచ్చరించారు.

కేంద్రం తీసుకువచ్చిన ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా పార్లమెంటులో తమకు మద్దతివ్వాలని కోరుతూ కేజ్రీవాల్ మంగళవారం ఉదయం సీపీఎం కార్యాలయంలో సీతారాం ఏచూరిని కలుసుకున్నారు. అనంతరం సంయుక్తంగా విలేఖరుల సమావేశంలో వారు పాల్గొన్నారు. కేంద్రం తీసుకువచ్చిన ఆర్డినెన్స్ రాజ్యాంగవిరుద్ధమని, కోర్టు ధిక్కారం కూడా అవుతుందని ఏచూరి ఈ సందర్భంగా మీడియాకు తెలిపారు. రాజ్యాంగాన్ని కాపాడేందుకు కాంగ్రెస్, ఇతర విపక్ష పార్టీలు ముందుకు రావాలని కోరారు. కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్‌ను రాజ్యసభలోనే కాకుండా ఎక్కడైనా సరే తాము వ్యతిరేకిస్తామని ఏచూరి స్పష్టం చేశారు.

ప్రభుత్వ సర్వీసుల నియామక అధికారాలు ఢిల్లీలో ఎన్నికైన ప్రభుత్వానికే ఉంటాయని సుప్రీంకోర్టు ఇటీవల సంచలన తీర్పునిచ్చింది. పోలీసులు, శాంతిభద్రతలు, భూములు ఢిల్లీ సర్కార్ పరిధిలోకి రావని తేల్చింది. అయితే, సుప్రీంకోర్టు తీర్పుకు భిన్నంగా ప్రభుత్వ అధికారుల నియామకాలపై మే 19న కేంద్రం ఒక ఆర్డినెన్స్ తీసుకువచ్చింది. దీనిని ఆప్ వ్యతిరేకిస్తూ, విపక్ష పార్టీల మద్దతును కూడగడుతోంది. ఆర్డినెన్స్ స్థానే బిల్లును కేంద్రం ఆరు నెలల్లోపు పార్లమెంటులో ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. ఆ బిల్లును విపక్షాలు ఏకగ్రీవంగా వ్యతిరేకిస్తే 2024 లోక్‌సభ ఎన్నికల ముందు కేంద్రానికి విపక్షాలు గట్టి సంకేతాలు ఇచ్చినట్టవుతుందని కేజ్రీవాల్ చెబుతున్నారు.

Updated Date - 2023-05-30T16:16:25+05:30 IST