Uttar Pradesh : యోగి ఆదిత్యనాథ్ మరో సంచలన నిర్ణయం.. ఈసారి ఎమ్మెల్యేల వంతు..

ABN , First Publish Date - 2023-08-09T09:18:39+05:30 IST

మాఫియా డాన్‌ల తాట తీస్తున్న ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) కన్ను ఈసారి శాసన సభ సమావేశాల తీరుపై పడింది. శాసన సభలో సభ్యులు పత్రాలను చింపుతూ, గందరగోళం సృష్టిస్తూ పత్రికలు, మీడియాలో పతాక శీర్షికలకు ఎక్కుతున్న విషయాన్ని గమనించారు. ఇకపై శాసన సభ హుందాగా, ప్రశాంతంగా కనిపించేలా చేయడానికి ఆయన నడుం బిగించారు.

Uttar Pradesh : యోగి ఆదిత్యనాథ్ మరో సంచలన నిర్ణయం.. ఈసారి ఎమ్మెల్యేల వంతు..

లక్నో : మాఫియా డాన్‌ల తాట తీస్తున్న ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) కన్ను ఈసారి శాసన సభ సమావేశాల తీరుపై పడింది. శాసన సభలో సభ్యులు పత్రాలను చింపుతూ, గందరగోళం సృష్టిస్తూ పత్రికలు, మీడియాలో పతాక శీర్షికలకు ఎక్కుతున్న విషయాన్ని గమనించారు. ఇకపై శాసన సభ హుందాగా, ప్రశాంతంగా కనిపించేలా చేయడానికి ఆయన నడుం బిగించారు. త్వరలోనే సభ్యులకు నూతన నిబంధనలను విధించబోతున్నారు.

త్వరలో ఆమోదం పొందబోతున్న ఉత్తర ప్రదేశ్ శాసన సభ కార్యకలాపాల నిర్వహణ, విధానపరమైన నిబంధనలు, 2023 ప్రకారం, సభ్యులు తమతోపాటు మొబైల్ ఫోన్లను శాసన సభలోకి తీసుకెళ్లకూడదు. శాసన సభలో పత్రాలను చింపడం, అనవసరంగా సభాపతికి తమ వెనుక భాగం కనిపించేలా నిల్చోవడం లేదా కూర్చోవడం వంటివి చేయకూడదు. సభలో మాట్లాడుతున్నపుడు గ్యాలరీలో ఉన్నవారిలో ఎవరివైపూ వేలెత్తి చూపించకూడదు, ప్రశంసించకూడదు. సభలోకి ఆయుధాలను తీసుకెళ్లకూడదు, ప్రదర్శించకూడదు. లాబీల్లో ధూమపానం చేయరాదు, గట్టిగా నవ్వకూడదు. సభ్యులు సభాపతి స్థానంవైపు చూస్తూ వంగి గౌరవం ప్రదర్శించాలి. సభలోకి ప్రవేశించేటపుడు లేదా సభ నుంచి వెళ్లిపోయేటపుడు లేదా కూర్చునేటపుడు లేదా తమ స్థానాల నుంచి లేచి నిల్చునేటపుడు తమ వీపు భాగం సభాపతి స్థానం వైపు పెట్టకూడదు. ఉత్తర ప్రదేశ్ శాసన సభ కార్యకలాపాల నిర్వహణ, విధానపరమైన నిబంధనలు, 1958ని సవరిస్తూ ఈ నిబంధనలను ఆమోదించబోతున్నారు.

శాసన సభను సమావేశపరచడానికి సమన్ జారీ చేసే సమయాన్ని 14 రోజుల నుంచి ఏడు రోజులకు తగ్గించారు. ప్రొసీడింగ్స్‌కు సంబంధంలేని పుస్తకాలు, సాహిత్యం, ప్రశ్నావళి, ప్రెస్ కామెంట్స్, చీటీలు వంటివాటిని సభలోకి తీసుకురాకూడదు, వాటిని సభ్యులకు పంపిణీ చేయకూడదు. ప్రతి రోజూ నిర్వహించే కార్యకలాపాల వివరాలను ఎమ్మెల్యేలకు ఆన్‌లైన్లో లేదా ఆఫ్‌లైన్లో ఓ జాబితాను శాసన సభ ప్రిన్సిపల్ సెక్రటరీ తరపున పంపిస్తారు.


శాసన సభాధిపతి సతీశ్ మహంగ్ తెలిపిన వివరాల ప్రకారం, ఉత్తర ప్రదేశ్ శాసన సభ కార్యకలాపాల నిర్వహణ, విధానపరమైన నిబంధనలు, 2023ను సోమవారం శాసన సభలో ప్రవేశపెట్టారు. దీనిపై చర్చ బుధవారం జరుగుతుంది. దీనికి ఆమోదం లభించబోతోంది.

పట్టుబడిన ఎమ్మెల్యే

గత ఏడాది డిసెంబరు 6న సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యే అతుల్ ప్రధాన్ శాసన సభ సమావేశాలను తన ఫేస్‌బుక్‌లో లైవ్ స్ట్రీమింగ్ చేస్తూ పట్టుబడ్డారు. రామ్‌పూర్ ఉప ఎన్నికలపై నిరసన తెలుపుతూ ఆయన ఈ చర్యకు పాల్పడ్డారు. దీంతో సభాపతి ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేసి, సభ నుంచి వెళ్లిపోవాలని ఆదేశించారు.


ఇవి కూడా చదవండి :

Manmohan: వీల్‌చైర్‌పై పార్లమెంటుకు మన్మోహన్.. బీజేపీ, కాంగ్రెస్ మాటలయుద్ధం..!

Trains: గంటల కొద్దీ ఆలస్యంగా రైళ్లు.. కారణం ఏంటంటే..

Updated Date - 2023-08-09T09:18:39+05:30 IST