Karnataka polls: ఈ ముగ్గురి ప్రచారానికి భలే డిమాండ్..!

ABN , First Publish Date - 2023-04-11T16:56:42+05:30 IST

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ గట్టి పావులు కదుపుతోంది. అభ్యర్థుల ఎంపికలో గట్టి కసరత్తు చేస్తున్న ..

Karnataka polls: ఈ ముగ్గురి ప్రచారానికి భలే డిమాండ్..!

న్యూఢిల్లీ: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ (BJP) గట్టి పావులు కదుపుతోంది. అభ్యర్థుల ఎంపికలో గట్టి కసరత్తు చేస్తున్న పార్టీ అధిష్ఠానం, ఎన్నికల ప్రచారానికి హేమాహేమీలను (Star Campaigners) దింపేందుకు సన్నాహకాలు చేస్తోంది. రాష్ట్ర బీజేపీ సైతం జనాకర్షణ కలిగిన ముఖ్యమంత్రులు, కేంద్రం మంత్రులను గరిష్టంగా ప్రచారానికి పంపాలని అధిష్ఠానాన్ని కోరుతోంది. ముఖ్య నేతల్లో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, అసోం సీఎం హిమంత బిశ్వా శర్మ, కేంద్ర మంత్రి ఎస్.జైశంకర్‌కు మంచి డిమాండ్ ఉన్నట్టు రాష్ట్ర బీజేపీ వర్గాల సమాచారం. కేంద్ర మంత్రులు స్మృతి ఇరానీ, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ సైతం మంచి డిమాండ్ ఉన్న నేతల క్రమంలో ఉన్నారు.

అసెంబ్లీ ఎన్నికల తేదీలను గత నెలలో ఎన్నికల కమిషన్ ప్రకటించినప్పుడు ఎన్నికల వేడి కర్ణాటకలో పెరుగుతోంది. గత వారంలో ప్రధాని నరేంద్ర మోదీ కర్ణాటకలో కీలకమైన మైసూరు ప్రాంతంలో పర్యటించారు. కర్ణాటక ఒక విలక్షణమైన రాష్ట్రమని, నేతల పాపులారిటీ ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా కనిపించే వైవిధ్యం కనిపిస్తుందని బీజేపీ సీనియర్ నేత ఒకరు తెలిపారు. ''కోస్టల్ కర్ణాటక ప్రాంతంలో యోగి ఆదిత్యనాథ్‌ వంటి నేతలకు మంచి ఆదరణ ఉంది. కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దు జిల్లాలున్న ఈ ప్రాంతంలో భాషాపరంగా చూసినప్పుడు దేవేంద్ర ఫడ్నవిస్, గోవా సీఎం ప్రమోద్ సావంత్‌కు మంచి ఆదరణ లభిస్తుంది. హిమంత బిస్వ శర్మ మాట్లేడే విధానం, హిందుత్వాన్ని ముందుకు తీసుకువెళ్లే ధోరణి గ్రామీణ, పట్టణ ప్రజలను ఆకర్షిస్తుంది. కేంద్ర మంత్రుల్లో విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌, స్మృతి ఇరానీకి కూడా మంచి డిమాండ్ ఉంది. జైశంకర్ చాలా సూటిగా, సరళంగా మాట్లాడే తీరు ముఖ్యంగా యువతను బాగా ఆకట్టుకుంటుంది. స్మృతి ఇరానీ ప్రసంగాలు కూడా జనానికి చేరువయ్యేలా ఉంటాయి'' అని ఆయన తెలిపారు. కాగా, మే 10న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా, మే 13న ఫలితాలు వెల్లడవుతాయి.

Updated Date - 2023-04-11T17:03:01+05:30 IST