Rahul Gandhi: యువత ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో మునిగిపోతున్నారు.. ఎందుకంటే.?
ABN , Publish Date - Dec 22 , 2023 | 02:45 PM
దేశంలోని యువత ఉద్యోగాలు లేక, నిరుద్యోగిత కారణంగా ఫేస్‌బుక్, ఇన్‌స్ట్రాగ్రామ్‌లలో ఎక్కువ సమయం తలమునకలవుతున్నారని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. పార్లమెంటు భద్రతా వైఫల్యం మరో ప్రశ్నను కూడా లేవనెత్తిందని, ఈ తరహా నిరసనలకు కారణమేమిటనేదే ఆ ప్రశ్న అని, దేశంలోని నిరుద్యోగితే ఈ ప్రశ్నకు సమాధానమని ఆయన చెప్పారు.
న్యూఢిల్లీ: దేశంలోని యువత ఉద్యోగాలు లేక, నిరుద్యోగిత కారణంగా ఫేస్‌బుక్, ఇన్‌స్ట్రాగ్రామ్‌లలో ఎక్కువ సమయం తలమునకలవుతున్నారని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) అన్నారు. పార్లమెంటు భద్రతా వైఫల్యం మరో ప్రశ్నను కూడా లేవనెత్తిందని, ఈ తరహా నిరసనలకు కారణమేమిటనేదే ఆ ప్రశ్న అని, దేశంలోని నిరుద్యోగితే ఈ ప్రశ్నకు సమాధానమని ఆయన చెప్పారు.
'ఇండియా' (I.N.DI.A.Z) కూటమి పార్టీలు జంతర్ మంతర్ వద్ద శుక్రవారంనాడు జరిపిన నిరసన కార్యక్రమంలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశంలోని నిరుద్యోగితపై మీడియా మాట్లాడటం లేదని, కానీ, సస్పెండైన ఎంపీలు పార్లమెంటు బయట చేసిన నిరసనను వీడియో తీసినందుకు తనను (రాహుల్‌ను) ప్రశ్నిస్తోందని అన్నారు. ''ఇద్దరు ముగ్గురు వ్యక్తులు పార్లమెంటులోకి ప్రవేశించి పొగ వదలిగారు. దీంతో బీజేపీ ఎంపీలు పరుగులు తీశారు. ఈ ఘటనలో భద్రతా ఉల్లంఘన అనే ప్రశ్న తలెత్తింది. అసలు యువకులు ఈ తరహాలో ఎందుకు నిరసన తెలపాల్సి వచ్చిందనే మరో ప్రశ్న కూడా ఉంది. దేశంలో నిరుద్యోగితే ఇందుకు కారణం'' అని రాహుల్ అన్నారు.
ఏడున్నర గంటలు ఆ పనిలోనే..
సోషల్ మీడియాను అంటిపెట్టుకుని సీటీల్లోని యువత ఎన్ని గంటలు గడుపుతున్నారనే దానిపై చిన్న సర్వే జరిపించానని, యువత ఏడున్నర గంటల సేపు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ తదితర సామాజిక మాధ్యమాల్లో సమయం గడుపుతోందని తెలిసి ఆశ్యర్యానికి గురయ్యానని రాహుల్ చెప్పారు. ''దీనికి కారణం ఏమిటి? నరేంద్ర మోదీ యువతకు ఉద్యోగాలు ఇవ్వడం లేదు. సెల్ ఫోన్లు చూసుకుంటూ కాలం గడిపేసే అవకాశం ఇచ్చారు. ఇది మీ ప్రభుత్వం తప్పు. అందువల్లే వాళ్లు పార్లమెంటు హౌస్‌లోకి దూకుతున్నారు'' అని రాహుల్ తప్పుపట్టారు. నిరుద్యోగిత గురించి మాట్లాడుతుంటే, 150 మందిని బయటకు గెంటేశారని, ఇది ఏదో ఒక వ్యక్తికి జరిగింది కాదని, దేశంలోని 60 శాతం ప్రజల వాణికి సంబంధించిన విషయమని అన్నారు.