Telugu Expats in Gulf: కల్తీ కల్లు దొరక్క.. గల్ఫ్‌లో తెలంగాణ యువత పిచ్చిచేష్టలు..!
ABN , First Publish Date - 2023-02-14T12:09:43+05:30 IST
తెలంగాణలో ఏరులై పారుతున్న కల్తీ కల్లు దుష్ఫలితాలు ఎల్లలు దాటుతున్నాయి.
గల్ఫ్‌లో ‘గుల్ఫాం’ గత్తర
తీవ్ర అస్వస్థతతో కొందరి మృత్యువాత
మానసిక వైకల్యం బారిన మరెందరో
(ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి): తెలంగాణలో ఏరులై పారుతున్న కల్తీ కల్లు దుష్ఫలితాలు ఎల్లలు దాటుతున్నాయి. అప్పుల బాధతో ఉపాధి కోసం గల్ఫ్‌కు వస్తున్న కల్తీ కల్లు బానిస యువత ఇక్కడ పిచ్చిగా ప్రవర్తిస్తూ మాతృభూమికి తిరిగి వెళ్తుండగా, మరికొందరు అనారోగ్యానికి గురై మృత్యువాత పడుతున్నారు. అప్పులు చేసుకుని మరీ దుబాయికి వచ్చిన యువత ఇప్పుడు.. దుబాయి ఉద్యోగం వద్దు, కూలీనాలీ చేసుకుంటూ అక్కడే కల్లు తాగుతూ బతుకుతాం, స్వదేశానికి వెళ్లిపోతాం అంటూ ఒత్తిడి చేస్తుండడం విస్మయాన్ని కలిగిస్తోంది. ఇలా స్వదేశానికి తిరిగి వెళ్తున్న వారు చేసిన అప్పులు తీర్చలేక మరింతగా అప్పుల ఊబిలోకి కూరుకుపోతున్నారు. ప్రాణాంతకమైన ఆల్ర్ఫాజోలం, క్లోరోఫాం, డైజోఫాంలతో పాటు క్రిమిసంహారక మందుల్లో వాడే ముడి పదార్థాలను డ్రగ్స్ మోతాదుకు మించి నీటిలో కలిపి కల్లుగా విక్రయిస్తుండడంతో వీటిని సేవించే వారు దానికి బానిసలుగా మారుతున్నారు. తెలంగాణ ప్రాంతంలో గుల్ఫాం కల్లుగా పిలిచే ఈ కల్లు లేకుండా వీరు ఒక్కరోజు కూడా గడపలేకపోవడం కష్టంగా మారింది. కల్లులేకపోవడంతో దుబాయిలో విమానం దిగిన వెంటనే కొందరైతే పిచ్చిగా ప్రవర్తిస్తూ తిరిగి అదే విమానంలో స్వదేశానికి పంపించేయాలని ప్రాధేయపడుతున్నారు.
అప్పు చేసి దుబాయికి వచ్చిన జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం వర్షకొండ గ్రామానికి చెందిన ముద్దారం గంగారాంకు దుబాయిలో లభించే మద్యం సీసాలు ఇచ్చినా గుల్ఫాం కల్లు మాత్రమే కావాలంటూ పిచ్చిగా ప్రవర్తిస్తున్నాడు. నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి గ్రామానికి చెందిన మహేందర్ గతేడాది ఆగస్టు 10 నుంచి కల్లు లేకపోవడంతో పిచ్చిగా ప్రవర్తిస్తూ తప్పిపోయాడు.ఇదే జిల్లాలోని మల్లారం గ్రామానికి చెందిన షేక్ చాంద్ గుల్ఫాం కల్లు కోసం వెదుకుతూ సౌదీ అరేబియా ఎడారిలో మరణించాడు. మరో ముగ్గురు కూడా ఇదే పరిస్థితుల్లో ప్రాణాలు కోల్పోయారు. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల సమీప గ్రామానికి చెందిన మహ్మద్ అలీ పరిస్థితి మరీ దారుణం. బంధువులతో కలిసి మక్కా పుణ్యక్షేత్ర సందర్శనకు వచ్చిన అలీ కల్లు లేకపోవడంలో విమానంలో పిచ్చిగా ప్రవర్తించడమే కాకుండా సౌదీలో విమానం దిగిన వెంటనే కల్లు కోసం అన్వేషిస్తూ తప్పిపోగా ఇక్కడి వారు పిచ్చివాడిగా భావించి.. బంధువులకు అప్పగించారు. ఇవి మచ్చుకు కొన్ని ఉదాహరణలు మాత్రమే.
ఇది కూడా చదవండి: కోవిడ్ సమయంలో ఆపన్నహస్తం.. క్వీన్ ఎలిజబెత్ ప్రశంసలు.. ఇప్పుడేమో దేశ బహిష్కరణ.. యూకేలో భారతీయుడి దీనగాథ!
ఇంకే మందూ తాగరు..
గల్ఫ్ దేశాల్లో కొన్నిచోట్ల బహిరంగంగా, మరికొన్ని చోట్ల దొంగచాటుగా మద్యం లభిస్తున్నా తెలంగాణ కల్తీ కల్లు మత్తుకు ఒకసారి బానిసలైన వారు ఏ ఇతర మద్యాన్ని ఇష్టపడరని మందు ప్రియులు చెబుతున్నారు. ఒక్క దుబాయిలో ఇటీవల కాలంలో 25 మంది కల్లు లేక పిచ్చిగా ప్రవర్తిస్తుండడంతో స్వదేశానికి పంపించినట్లు దుబాయిలోని తెలంగాణ సామాజిక కార్యకర్త జి.నరేందర్ మహారాజ్ తెలిపారు. కల్తీ కల్లుకు అలవాటైన వారిని గల్ఫ్ దేశాలకు పంపించవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.