Telugu Expats: తెలంగాణ నుంచి గల్ఫ్‌లో 15 లక్షల మంది ప్రవాసులు.. వారు నెలకు స్వదేశానికి పంపించే ఆదాయం ఎంతో తెలిస్తే..
ABN , First Publish Date - 2023-08-17T07:36:22+05:30 IST
తెలంగాణ రాష్ట్రం నుంచి 15 లక్షల మంది వలసదారులు గల్ఫ్ దేశాలలో పనిచేస్తున్నారని ఒక అంచనా. ఒక కార్మికుడు, ఉద్యోగి సరాసరి నెలకు 700 యుఎఇ దిర్హామ్స్ / సౌదీ రియాల్స్ లేదా సమానమైన గల్ఫ్ కరెన్సీలు పంపితే అది రూ.14వేలకు సమానం.
బతుకు భద్రత లేని గల్ఫ్ కార్మికులు
తెలంగాణ రాష్ట్రం నుంచి 15 లక్షల మంది వలసదారులు గల్ఫ్ దేశాలలో పనిచేస్తున్నారని ఒక అంచనా. ఒక కార్మికుడు, ఉద్యోగి సరాసరి నెలకు 700 యుఎఇ దిర్హామ్స్ / సౌదీ రియాల్స్ లేదా సమానమైన గల్ఫ్ కరెన్సీలు పంపితే అది రూ.14వేలకు సమానం. 15 లక్షల మంది గల్ఫ్ ప్రవాసులు నెలకు రూ.14 వేలు పంపిస్తే రూ.2,100 కోట్లు అవుతుంది. సంవత్సరానికి రూ.25,200కోట్లు. తెలంగాణ గల్ఫ్ ప్రవాసులు పంపే రూ.25,200 కోట్లు విదేశీ మారక ద్రవ్యం వారి కుటుంబ సభ్యుల ద్వారా దేశీయంగా వినియోగంలోకి వచ్చినప్పుడు కనీసం 10 శాతం జీఎస్టీతో సంవత్సరానికి రూ.2,520 కోట్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పన్నుల రూపంలో ఆదాయం వస్తుంది. ఇందులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తన సగం వాటా కింద సంవత్సరానికి రూ.1,260 కోట్లు లాభపడుతున్నది. ‘బొగ్గుబాయి – బొంబాయి – దుబాయి’ అనే నినాదంతో ప్రత్యేక రాష్ట్రం కోసం చేసిన ఉద్యమంలో గల్ఫ్ కార్మికులు, వారి కుటుంబాలు ముందున్నాయి. తెలంగాణ ఏర్పడిన గత తొమ్మిదేళ్ళలో తెలంగాణకు చెందిన 1,800కి పైగా కార్మికులు గల్ఫ్ దేశాలలో మృతి చెందారు. 2014 కంటే ముందు కూడా వేలాది మంది కార్మికులు గల్ఫ్ దేశాలలో అమరులయ్యారు.
భారత్ నుంచి విదేశాలకు ఎగుమతులను పెంచేందుకు, విదేశీ మారక ద్రవ్య ఆదాయాన్ని పెంచేందుకు, భారతదేశంలో అదనపు ఉపాధిని సృష్టించేందుకు 1981లో ఎక్స్‌పోర్ట్ ఓరియెంటెడ్ యూనిట్స్ స్కీం (ఎగుమతి ఆధారిత యూనిట్ల పథకం) ప్రవేశపెట్టబడింది. ఇందుకోసం ప్రభుత్వం భూమి, నీరు, విద్యుత్, బ్యాంకు రుణాలు, పారిశ్రామిక రాయితీలు, పన్ను మినహాయింపులు అందిస్తుంది. కార్మికులు తమ స్వంత ఖర్చులతో గల్ఫ్ దేశాలకు వలస వెళుతున్నారు. ఎలాంటి ఖర్చు లేకుండా మానవ వనరులను విదేశాలకు ఎగుమతి చేస్తున్న భారత ప్రభుత్వం పెద్ద ఎత్తున విదేశీ మారకద్రవ్యాన్ని ఆర్జిస్తున్నది. గల్ఫ్ రిక్రూట్‌మెంట్ వ్యవస్థకు ఇండస్ట్రీ స్టేటస్ (పరిశ్రమల హోదా) ఇవ్వాలి. ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సిలును ఏర్పాటు చేయాలి. మెడికల్ టెస్ట్, ఫ్లయిట్ టికెట్, నైపుణ్య శిక్షణ లాంటి వాటికి ఇన్‌ఫుట్ సబ్సిడీ ఇవ్వాలి. గల్ఫ్ దేశాలకు కార్మికులను భర్తీ చేసేందుకు ఒక్కొక్కరి నుంచి రూ.30 వేలు సర్వీసు చార్జీగా తీసుకోవడానికి రిక్రూటింగ్ ఏజెన్సీలకు భారత ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. సర్వీస్ చార్జీపై 18 శాతం జీఎస్టీ రూ.5,400 వసూలు చేస్తున్నారు. రిక్రూట్‌మెంట్ ఫీజు లేకుండా ఉచితంగా ఉద్యోగ భర్తీ చేపట్టాలనే సంకల్పానికి ప్రభుత్వాల మద్దతు అవసరం. కార్మికులను విదేశాలకు పంపే అతిపెద్ద దేశమైన భారత్‌కు ఒక మైగ్రేషన్ పాలసీ (వలస విధానం) లేకపోవడం విచారకరం.
గల్ఫ్ కార్మికుల సంక్షేమం, సామాజిక భద్రత కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నిధితో కూడిన ‘గల్ఫ్ కార్మికుల సంక్షేమ బోర్డు’ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నది. ఇందుకోసం సమగ్ర తెలంగాణ ఎన్నారై పాలసీ (ప్రవాసీ విధానం) రూపొందించాలి. విదేశాలకు ఉపాధికోసం వలస వెళ్లిన కార్మికులకు సామాజిక రక్షణ (సోషల్ ప్రొటెక్షన్), సామాజిక భద్రత (సోషల్ సెక్యూరిటీ), విశ్వవ్యాప్త సామాజిక రక్షణ అంతస్తులు (యూనివర్సల్ సోషల్ ప్రొటెక్షన్ ఫ్లోర్స్) ఏర్పాటు చేయాలని ఆసియా–గల్ఫ్ దేశాలలో చర్చ జరుగుతున్నది. వలస కార్మికులకు సామాజిక భద్రతా ప్రయోజనాల పోర్టబిలిటీ (ఏ దేశానికైనా బదిలీ చేసుకునే వీలు) ఉండాలన్న డిమాండ్ ఉన్నది. చెల్లించే ప్రీమియం తక్కువ ధరలో ఉండే విధంగా జాతీయ సామాజిక రక్షణ వ్యవస్థలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఇందుకోసం ప్రపంచ సామాజిక సురక్ష నిధి (గ్లోబల్ సోషల్ ప్రొటెక్షన్ ఫండ్)ని ఏర్పాటు చేయాలి. కోవిడ్ మహమ్మారి వల్ల ప్రపంచ వ్యాప్తంగా 49.5కోట్ల మంది తమ ఉద్యోగాలను, ఆదాయాలను కోల్పోయారు. అసహాయులైన లక్షలాది మంది వలస కార్మికులు ఉట్టి చేతులతో విదేశాల నుంచి తమ స్వదేశాలకు చేరుకున్నారు.
గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం రూ.500 కోట్ల వార్షిక బడ్జెట్ కేటాయించాలి. గల్ఫ్ మృతుల కుటుంబాలను ఆదుకోవడానికి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి. జీవిత బీమా, ప్రమాద బీమా, ఆరోగ్య బీమా, పెన్షన్‌లతో కూడిన సమగ్రమైన సాంఘిక భద్రత (సోషల్ సెక్యూరిటీ) పథకాన్ని ప్రవేశ పెట్టడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలి.
సింగిరెడ్డి నరేష్ రెడ్డి
తెలంగాణ గల్ఫ్ కాంగ్రెస్