Indian lady: భారతీయ మహిళపై దాడి కేసు.. చైనా జాతీయుడిని దోషిగా తేల్చిన సింగపూర్ న్యాయస్థానం
ABN , First Publish Date - 2023-06-15T09:56:00+05:30 IST
కరోనా సమయంలో మాస్క్ విషయంలో భారతీయ మహిళను అసభ్యంగా దూషించడమే కాకుండా దాడికి పాల్పడిన కేసులో చైనీయుడిని తాజాగా సింగపూర్ న్యాయస్థానం (Singapore Court) దోషిగా తేల్చింది.
సింగపూర్ సిటీ: కరోనా సమయంలో మాస్క్ విషయంలో భారతీయ మహిళను అసభ్యంగా దూషించడమే కాకుండా దాడికి పాల్పడిన కేసులో చైనీయుడిని తాజాగా సింగపూర్ న్యాయస్థానం (Singapore Court) దోషిగా తేల్చింది. వివరాల్లోకి వెళ్తే.. 2021 మేలో సింగపూర్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఆ సమయంలో ముఖానికి మాస్క్ సరిగా ధరించలేదంటూ భారతీయ మహిళ హిందోచా నీతా విష్ణుభాయ్ (Hindocha Nita Vishnubhai) ను నిందితుడు వాంగ్ జింగ్ ఫాంగ్ (Wong Xing Fong) అడ్డుకున్నాడు. అంతటితో ఆగకుండా ఆమెను అసభ్యపదజాలంతో దూషించాడు. అదే సమయంలో ఆమెపై చేయి చేసుకున్నాడు. ఘటన జరిగిన రోజున విష్ణుభాయ్ చోవా చు కాంగ్ స్టేడియంలో తాను పనిచేసే ఫాస్ట్‌ఫుడ్ సెంటర్‌కు వెళ్లేందుకు వేగంగా నడుస్తోంది.
ఈ క్రమంలో ఆమెను ఎవరో పిలుస్తున్నట్లుగా అనిపించడంతో వెనక్కి తిరిగి చూసింది. అక్కడ నిందితుడు వాంగ్, అతని భార్య చువా యున్ హాన్ ఉన్నారు. వీరిద్దరూ ఆమెను మాస్క్ (Face Mask) సరిగా ధరించాలంటూ వాగ్వాదానికి దిగారు. అనంతరం వాంగ్ జింగ్ ఫాంగ్ దాడికి పాల్పడ్డాడు. కాంగ్‌లోని నార్త్‌వేల్ కండోమినియం (Northvale condominium) సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బాధితురాలు నీతా విష్ణుభాయ్ ఫిర్యాదు మేరకు వాంగ్ జింగ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కోర్టులో హాజరుపరిచారు. సుదీర్ఘ విచారణ అనంతరం మంగళవారం అతడిని కోర్టు దోషిగా తేల్చింది. జూలై 31న అతనికి శిక్షను ఖరారు చేయనుంది.