Donald Trump: అధికారంలోకి వస్తే భారత్‌పై ప్రతీకారం.. 'వాతలు' తప్పవంటున్న ట్రంప్..!
ABN , First Publish Date - 2023-08-22T07:49:59+05:30 IST
వచ్చే ఏడాది జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల కోసం బరిలో నిలిచిన మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రచారాన్ని మరింత ముమ్మరం చేశారు.
వాషింగ్టన్, ఆగస్టు 21: వచ్చే ఏడాది జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల కోసం బరిలో నిలిచిన మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రచారాన్ని మరింత ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా ఈసారి ఏకంగా భారత్‌పైనే గురిపెట్టారు. అమెరికా ఉత్పత్తులపై భారత్ భారీగా సుంకం విధిస్తోందని, తనను అధికారంలోకి తీసుకొస్తే న్యూఢిల్లీపై ప్రతీకార పన్ను విధిస్తానని ఒక వార్తాచానెల్ ఇంటర్వ్యూలో తేల్చిచెప్పారు. ‘‘భారత్ మనపై అత్యంత భారీగా పన్నులు విధిస్తోంది. ఉదాహరణకు హార్లీ-డేవిడ్‌సన్ బైకుల ఎగుమతిని చూస్తే ఏకంగా 100శాతం, 150, 200 శాతాల వరకూ సుంకాన్ని విధిస్తోంది. మన దేశంలో మాత్రం ఎటువంటి పన్ను లేకుండా తమ ఉత్పత్తులను విక్రయిస్తోంది. తమ దేశానికి వచ్చి పరిశ్రమను నిర్మిస్తే పన్ను ఉండదని ఆఫర్ ఇస్తోంది. కానీ అది మనకు సమ్మతం కాదు. ఈ విషయంలో నా హయాంలో చాలా గట్టిగానే ఆ దేశంతో పోరాడాను. మీరు ఏమైనా అనుకోండి, వాళ్లు మనపై సుంకం విధిస్తే, మనం కూడా విధించి తీరాల్సిందే’’ అని ట్రంప్ తేల్చిచెప్పారు.
ఇదిలా ఉండగా.. రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థుల ప్రాథమిక చర్చకు తాను గైర్హాజరు కానున్నట్లు డొనాల్డ్ ట్రంప్ తాజాగా తన సామాజిక మాధ్యమాల్లో తెలిపారు. ‘‘నేను ఎలాంటివాడినో, ఎంత విజయవంతంగా అధ్యక్ష బాధ్యతల్ని నిర్వర్తించానో ప్రజలకు తెలుసు. అందువల్ల నేను ఏమాత్రం చర్చలో పాల్గొనదలచుకోలేదు’’ అని వెల్లడించారు. అయితే.. ఇది కేవలం తొలి చర్చకు మాత్రమేనా లేక అన్ని చర్చలకూ గైర్హాజరు కానున్నారా అనే దానిపై స్పష్టతనివ్వలేదు. ‘‘రేసులో నాకంటే చాలా వెనుకబడి, కేవలం 1శాతం, సున్నా శాతం అవకాశాలు ఉన్న అభ్యర్థులు రాత్రంతా నన్ను ప్రశ్నలు అడుగుతూ ఉంటే నేను సమాధానాలు చెప్పాలి, దాని వల్ల నాకేం ఉపయోగం?’’ అంటూ ఈ ఏడాది జూన్‌లో ఓ ఇంటర్వ్యూలో ట్రంప్ వ్యాఖ్యానించారు.