UAE: మద్యం విక్రయాలపై దుబాయ్ సంచలన నిర్ణయం.. ఇకపై పర్యాటకులు..

ABN , First Publish Date - 2023-01-03T10:04:57+05:30 IST

తరాలుగా అమలులో ఉన్న కఠోర ఇస్లామిక్ నిబంధనల కారణంగా అంతర్జాతీయంగా, ఆర్ధికంగా తాము నష్టపోతున్న విషయాన్ని ఆలస్యంగా గ్రహించిన యునైటెడ్ అరబ్ ఏమిరేట్స్ (United Arab Emirates) క్రమేణా కొన్ని నియమాలను సడలిస్తుంది.

UAE: మద్యం విక్రయాలపై దుబాయ్ సంచలన నిర్ణయం.. ఇకపై పర్యాటకులు..

పర్యాటక రంగానికి ఊతమిచ్చేందుకు పన్ను రద్దు

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: తరాలుగా అమలులో ఉన్న కఠోర ఇస్లామిక్ నిబంధనల కారణంగా అంతర్జాతీయంగా, ఆర్ధికంగా తాము నష్టపోతున్న విషయాన్ని ఆలస్యంగా గ్రహించిన యునైటెడ్ అరబ్ ఏమిరేట్స్ (United Arab Emirates) క్రమేణా కొన్ని నియమాలను సడలిస్తుంది. సహాజీవనానికి అనుమతి, హిందువు, క్రైస్తవ సివిల్ చట్టాలను గుర్తించిన యూఏఈ (UAE) ఇప్పుడు తాజాగా మద్యం విక్రయాలపై (Alcohol Sales) నిబంధనలను సడలించింది.​దుబాయి చట్టాల (Dubai Acts) ప్రకారం కేవలం రెండు ఏజన్సీలు మాత్రమే మద్యాన్ని అనుమతించబడ్డ నిర్దేశీత ప్రదేశాలలో విక్రయించాలి మరియు సేవించాలి. 21 సంవత్సరాల పైబడి వీసా కల్గి ఉన్న వారు అది కూడా ముస్లిమేతరులు మాత్రమే మద్యం సేవించడానికి, దుకాణం నుండి ఇండ్లకు తీసుకువెళ్ళడానికి ప్రత్యేకంగా లైసెన్సు పొందాలి. దీనికి కొంత ఫీజు చెల్లించాలి. ఇక ముస్లింలు మద్యం త్రాగడం పూర్తి నిషేధం. అలాగే అన్ని రకాల మద్యంపై 30 శాతం పన్ను ఉంటుంది.

తాజాగా లైసెన్సు ఫీజును రద్దు చేయడంతో పాటు మద్యంపై పన్నును దుబాయ్ ప్రభుత్వం (Dubai Government) రద్దు చేసింది. దీంతో మద్యం ధరలు తగ్గి పర్యాటకలకు ఊరట కల్గుతుందని ప్రభుత్వం భావిస్తుంది. ఇక గతంలో ఉన్న విధంగా మద్యం లైసెన్సు కేవలం ముస్లిమేతరులకు మాత్రమేనా? లేక ఇస్లాంను అచరించే వారికి కూడా ఇస్తారనేది మాత్రం స్పష్టం చేయలేదు. దుబాయిలో ధరలు ఎక్కువ కావడంతో దుబాయి నుండి ప్రతి రోజు వేల సంఖ్యలో ప్రవాస భారతీయులు సమీపంలో ఉన్న ఉమ్మాల్ ఖ్వాన్‌కు వెళ్ళి మద్యాన్ని కొనుగోలు చేస్తుంటారట. 4 దిర్హాంలు (రూ.90) ఉన్న బీరు సీసా దుబాయిలో క్యాబ్రే బార్లలో 50 దిర్హమ్స్ (రూ.1,126), మాములు షాపులలో 25 దిర్హాంలకు (రూ.563) విక్రయిస్తారు.

Dubai.jpg

ధర ఎక్కువ అయినా కూడా ప్రతి వారంతరానికి తెలుగు రాష్ట్రాల నుండి అనేక మంది రాజకీయ, అధికార, సినీ ప్రముఖులు దుబాయికు డ్రింక్ పార్టీలకు వస్తుంటారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడ్డ తర్వాత హైద్రాబాద్ నగరంలో పెరిగిపోయిన పబ్బుల సంస్కృతి కారణంగా దుబాయ్‌కు వచ్చే వారి సంఖ్య స్వల్పంగా తగ్గిందని చెప్పవచ్చు. దుబాయ్ కంటే ముందు అబుధాబి కూడా మద్యం విక్రయాలపై నిబంధనలు సడలించింది. అదే దుబాయ్‌కు పొరుగున ఉన్న షార్జా (Sharjah) ఏమిరేట్‌లో మాత్రం మద్యంపై పూర్తి స్ధాయిలో నిషేధం ఉంది. ఇక దుబాయ్, ఇతర ఏమిరేట్లలో జైళ్ళలో ఉన్న వారిలో తెలుగు వారితో సహా భారతీయులు పెద్ద సంఖ్యలో మద్యం అక్రమ రవాణా నేరాలపై పట్టబడ్డ వారే కావడం గమనార్హం.

Updated Date - 2023-01-03T10:49:59+05:30 IST