Kuwait: ప్రవాసులకు మరో బిగ్ షాక్.. పొమ్మనలేక పొగ పెడుతున్న కువైత్!
ABN , First Publish Date - 2023-02-19T08:15:40+05:30 IST
గల్ఫ్ దేశం కువైత్ (Kuwait) గడిచిన కొంతకాలంగా ప్రవాసుల (Expats) పట్ల కఠినంగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.
కువైత్ సిటీ: గల్ఫ్ దేశం కువైత్ (Kuwait) గడిచిన కొంతకాలంగా ప్రవాసుల (Expats) పట్ల కఠినంగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. వర్క్ పర్మిట్స్, రెసిడెన్సీ వీసాలు ఇలా ప్రతి విషయంలో ఇంతకుముందెన్నడూ లేని విధంగా కఠిన నిబంధనలు విధిస్తూ వస్తోంది. ఇక కువైటైజేషన్ పాలసీ (Kuwaitization Policy) పేరిట కూడా తీవ్ర ఇబ్బందులు పెడుతోంది. దీనిలో భాగంగా ఉద్యోగావకాశాల్లో స్థానికులకు అధిక ప్రాధాన్యం కల్పిస్తోంది. గత కొంతకాలంగా ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో భారీ సంఖ్యలో కువైటీలను (Kuwaitis) నియమిస్తోంది. దీంతో గడిచిన రెండు మూడేళ్లుగా భారీ మొత్తంలో వలసదారులు ఆ దేశాన్ని విడిచిపెడుతున్నారు. అటు వైద్య సేవల పరంగా కూడా ప్రవాసులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఇటీవలే వలసదారులకు ఇచ్చే మెడిసిన్ ఫీజును పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం తాజాగా అమలులోకి రావడంతో మెడిసిన్స్ కోసం ఆరోగ్య కేంద్రాలను సందర్శించే ప్రవాసుల సంఖ్య 20 నుంచి 25 శాతం తగ్గినట్లు తాజాగా వెలువడిన ప్రాథమిక నివేదికలు వెల్లడించాయి.
ఇదిలాఉంటే... ఇప్పుడు ఆరోగ్యమంత్రిత్వశాఖ మరో కీలక ప్రకటన చేసింది. మిష్రెఫ్ (Mishrief) ఫెయిర్ గ్రౌండ్‌లో ప్రవాసులకు ఇకపై మెడికల్ టెస్టులు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ సెంటర్‌ను తాత్కాలికంగా షువైఖ్‌లోని (Shuwaikh) మెడికల్ ఎగ్జామినేషన్ సెంటర్‌కు తరలిస్తున్నట్లు వెల్లడించింది. రుమైథీయాలోని హెల్త్ సెంటర్ ప్రారంభం అయ్యేవరకు ప్రవాస కార్మికులు హెల్త్ చెకప్‌ల కోసం షువైఖ్ కేంద్రానికి వెళ్లాల్సిందిగా తెలిపింది. అతి త్వరలోనే రుమైథీయా కేంద్రం ప్రారంభిస్తామని ఈ సందర్భంగా మంత్రిత్వశాఖ పేర్కొంది. ఇలా వివిధ రూపాల్లో వలస కార్మికులను గత కొంతకాలంగా ఇబ్బందులకు గురిచేస్తూ కువైత్ పొమ్మనలేక పొగ పెడుతున్నదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇది కూడా చదవండి: ఎవరీ వివేక్ రామస్వామి..? అన్నీ కలిసొస్తే అమెరికా అధ్యక్షుడిని అవుతానంటున్న ఈ ఎన్నారై బ్యాక్‌గ్రౌండ్ ఏంటంటే..