Kuwait: ప్రవాసులకు వార్నింగ్.. ఆ గడువు దాటి దేశం బయట ఉన్నారో అంతే సంగతులు..!

ABN , First Publish Date - 2023-01-20T09:36:38+05:30 IST

వలసదారులకు (Expats) కువైత్ సర్కార్ వార్న్ చేసింది.

Kuwait: ప్రవాసులకు వార్నింగ్.. ఆ గడువు దాటి దేశం బయట ఉన్నారో అంతే సంగతులు..!

కువైత్ సిటీ: వలసదారులకు (Expats) కువైత్ సర్కార్ వార్న్ చేసింది. ప్రవాసులు ఆరు నెలలకు మించి దేశం బయట ఉండొద్దని, గడువు కంటే ముందే వచ్చేయాలని సూచించింది. ఒకవేళ ఆరు నెలల కాలపరిమితికి మించి దేశం బయట ఉంటే వారి రెసిడెన్సీ ఆటోమెటిక్‌గా క్యాన్సిల్ అవుతుందని వెల్లడించింది. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని తెలిపింది. ఈ మేరకు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని (Ministry of Interior) జనరల్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ పబ్లిక్ రిలేషన్స్ అండ్ సెక్యూరిటీ మీడియా డైరెక్టర్ జనరల్ మేజర్ జనరల్ తౌహీద్ అల్-కందారి వెల్లడించారు.

అల్-కందారి మాట్లాడుతూ.. మంత్రిత్వ శాఖలోని నివాస వ్యవహారాల విభాగం ఆరు గవర్నరేట్‌లలోని నివాస విభాగాల ద్వారా ప్రవాసులకు సెలవుల కోసం అభ్యర్థనలను స్వీకరిస్తుందని తెలిపారు. అలాగే ఆర్టికల్ 22 నివాస అనుమతిని కలిగి ఉన్న వలస విద్యార్థులు ఎవరైతే దేశం వెలుపల తమ చదువులను పూర్తి చేసుకున్నారో వారు రిజిస్టర్ అయిన విశ్వవిద్యాలయం నుండి ధృవపత్రాన్ని సమర్పించాలి. అప్పుడే వారు ఆరు నెలల కంటే ఎక్కువ కాలం దేశం వెలుపల ఉండటానికి అనుమతి కోసం వారి సంరక్షకుల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని అన్నారు. అంతేగాక సంబంధిత దేశంలోని కువైత్ రాయబార కార్యాలయం ద్వారా కూడా ధృవీకరించబడాలని చెప్పారు.

ఈ సందర్భంగా ఆర్టికల్ 17 (ప్రభుత్వ రంగం) పరిధిలోకి వచ్చే వారి నివాసాల ఎలక్ట్రానిక్ రద్దును జాతీయత మరియు నివాస వ్యవహారాల విభాగం ప్రారంభిస్తుందని అంతర్గత మంత్రిత్వ శాఖ పబ్లిక్ రిలేషన్స్ అండ్ సెక్యూరిటీ మీడియా డిపార్ట్‌మెంట్ 3 నెలల క్రితం ప్రకటించినట్లు అల్-కందారి గుర్తు చేశారు. ఆర్టికల్ 19 (ప్రైవేట్ రంగంలో భాగస్వామి), ఆర్టికల్ 22 (డిపెండెంట్), ఆర్టికల్ 23 (అధ్యయనం), ఆర్టికల్ 24 స్వీయ స్పాన్సర్, ఆర్టికల్ 18 (ప్రైవేట్ రంగ ఉపాధి) వారు ఆరు నెలల కంటే ఎక్కువ కాలం దేశం వెలుపల ఉంటే.. విదేశీయుల నివాస చట్టంలోని ఆర్టికల్ (12), పేరా (3) ప్రకారం రద్దు చేయబడుతుందన్నారు.

Updated Date - 2023-01-20T13:19:43+05:30 IST