Young Professionals Scheme: భారతీయుల కోసం బ్రిటన్ కొత్త పథకం.. ఎప్పట్నుంచంటే..
ABN , First Publish Date - 2023-01-18T10:22:07+05:30 IST
భారత్, బ్రిటన్ మధ్య ఓ కొత్త పథకానికి అంకురార్పణ జరిగింది.
ఎన్నారై డెస్క్: భారత్, బ్రిటన్ మధ్య ఓ కొత్త పథకానికి అంకురార్పణ జరిగింది. వచ్చే నెల 28వ తేదీ నుంచి ఈ పథకం అమలు కానుంది. యంగ్ ప్రొఫెషనల్స్ స్కీమ్ (Young Professionals Scheme) పేరిట యూకే తీసుకువస్తున్న ఈ పథకంలో భాగంగా భారతీయ వృత్తి నిపుణులు ఆ దేశంలో గరిష్టంగా రెండేళ్ల పాటు నివాసం ఉండి, అక్కడే పని చేసుకోవచ్చు. అలాగే బ్రిటన్ వృత్తి నిపుణులు కూడా మన దేశంలో ఉంటూ పని చేసుకునేందుకు ఇది వీలు కల్పిస్తుంది. 18 నుంచి 30 ఏళ్ల మధ్య వయసు ఉన్న యువ నిపుణులు దీనికి అర్హులు. ఇరు దేశాల 15వ విదేశీ వ్యవహారాల కార్యాలయాల సంప్రదింపుల అనంతరం ఈ మేరకు తాజాగా ప్రకటన వెలువడింది.
ఇక సంప్రదింపులకు విదేశాంగ కార్యదర్శి వినయ్ మోహన్ క్వాత్రా భారత ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించగా, బ్రిటిష్ పక్షానికి విదేశీ, కామన్వెల్త్ అండ్ డెవలప్‌మెంట్ ఆఫీస్ శాశ్వత అండర్ సెక్రటరీ ఫిలిప్ బార్టన్ నాయకత్వం వహించారు. కాగా, ఈ యంగ్ ప్రొఫెషనల్స్ స్కీమ్ ద్వారా ప్రతియేటా 18 నుండి 30 సంవత్సరాల వయస్సు గల డిగ్రీ-విద్యావంతులైన 3వేల మంది భారతీయ పౌరులకు ఆ దేశానికి వెళ్లి రెండేళ్ల వరకు నివాసం ఉండేందుకు, పని చేసుకోవడానికి వీలు కల్పిస్తుంది.