Indian Expat: దుబాయిలో హోటల్‌లో పని.. పొట్టకూటి కోసం గల్ఫ్‌లో కష్టపడుతూనే ఈ 28 ఏళ్ల కుర్రాడు చేసిన పనేంటో తెలిస్తే..!
ABN , First Publish Date - 2023-06-14T12:28:37+05:30 IST
ఒడిశాలోని జస్పూర్ వాసి షాహజన్ మహ్మద్ (Sahajan Mohammad). 28 ఏళ్ల ఈ యువకుడు పొట్టకూటి కోసం దుబాయి వెళ్లి, అక్కడ ఓ హోటల్‌లో పని చేస్తున్నాడు.
దుబాయి: ఒడిశాలోని జస్పూర్ వాసి షాహజన్ మహ్మద్ (Sahajan Mohammad). 28 ఏళ్ల ఈ యువకుడు పొట్టకూటి కోసం దుబాయి వెళ్లి, అక్కడ ఓ హోటల్‌లో పని చేస్తున్నాడు. నెలకు 2వేల దిర్హమ్స్ (రూ.44,823) సంపాదిస్తున్నాడు. అబుదాబిలో (Abu Dhabi) నివాసం ఉండే అతడు కొంతకాలంగా పలు లాటరీలలో పాల్గొంటూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. ఈ క్రమంలో షాహజన్‌కు జూన్ 7న డ్రీమ్ ఐస్‌ల్యాండ్ స్క్రాచ్ కార్డ్ గేమ్ (Dream Island’s scratch card game) లో అదృష్టం కలిసి వచ్చింది. దాంతో ఏకంగా 20వేల దిర్హమ్స్ (రూ.4.48లక్షలు) గెలుచుకున్నాడు. అయితే, ఇలా లాటరీలో గెలిచిన ఈ భారీ మొత్తాన్ని విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించి పెద్ద మనసు చాటుకున్నాడు షాహజన్. ఇటీవల ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం బాధితులకు ఈ నగదును విరాళంగా ఇస్తానని తెలిపాడు.
కాగా, ఒడిశాలోని బాలాసోర్‌లో జూన్ 2వ తారీఖున రాత్రి 7 గంటల సమయంలో జరిగిన కొరమాండల్ ఎక్స్‌ప్రెస్ (Coromandel Express) ప్రమాదంలో దాదాపు 290 మంది వరకు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఇప్పటికే ప్రమాద బాధితులకు వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు తమవంతు సాయంగా విరాళాలు ప్రకటిస్తున్నారు. ఈ క్రమంలో లాటరీ గెలిచిన సాహజన్ కూడా స్వరాష్ట్రంలో జరిగిన ప్రమాదంలో గాయపడిన వారికి విరాళం ప్రకటించడంతో వార్తల్లో నిలిచారు. అతడి పెద్ద మనసును నెటిజన్లు మెచ్చుకుంటున్నారు.
Telugu Girl: లండన్‌లో ఉన్మాది ఘాతుకం.. తెలుగమ్మాయి మృతి!